అరుంధతి నక్షత్ర దర్శనం -సి.హెచ్.ప్రతాప్
 వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు) తూర్పునకు గానీ, ఉత్తరానికి కానీ తీసుకుని వెళ్ళి, మొదట ధ్రువ నక్షత్రాన్ని తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రం లాగ వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతి లాగా మహాపతివ్రతగా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది. ధ్రువ నక్షత్ర దర్శనం చేసేప్పడు ఈ మంత్రం చెప్పాలి అంటీంది శాస్త్రం
సప్తర్షయః ప్రథమా కృత్తికానాం అరుంధతీం యత్ ధృవతాం
హనిన్యుః షట్కృత్తికా ముఖ్య యోగ వహంతీ యం అస్మాకం ఏత త్వష్టమీ.
అంటే సప్తఋషులు కృత్తికలలో మొదటి దానిగా ఈమెను పిలుచుట చేత మిగిలిన ఆరు కృత్తికలకు ముఖ్యమైన కలయికలను ఈమె నడుపుచున్నది. మాకు ఈమె ఎనిమిదవది.
వశిష్ట మహర్షి భార్య పేరే అరుంధతి. వివాహం అయిన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు. కేవలం అరుంధతీ నక్షత్రాన్ని మాత్రమే కాదు.. దాని పక్కనే ఉన్న వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని చెబుతారు. ఆకాశంలో తూర్పు వైపున అరుంధతి, వశిష్ట అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పండితులు చెబుతారు.అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపాదించింది. తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచి పోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం అరుంధతి, వశిష్టుని లాగా కలకాలం నిలిచిపోవాని కోరుకుంటారు. ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.అరుంధతీ వశిష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః అంటూ ఆరుగురు ఆదర్శదంపతులను ప్రతి శుభకార్యంలోనూ స్మరించి నమస్కరిస్తారు. వారిలో సప్తర్షీ మండలంలో స్థానం పొందిన సాధ్వి అరుంధతిని ఆదర్శంగా తీసుకుని కాపురం సాగించమని వధువుకు బోధిస్తారు. వశిష్ఠుని వలె శాంతచిత్తునివై గృహస్థ ధర్మాలను పాటించమని వరునికి చెబుతారు.రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలంలో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.[

కామెంట్‌లు