కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఉచిత విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఎస్సీ కాలనీ ఆంగ్లమాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లల తల్లిదండ్రుల్ని కోరారు. సోమవారం ఆయన టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతిలతో కలిసి బడిబాటలో భాగంగా పిల్లల ఇండ్లను సందర్శించారు. బడీడు పిల్లల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కరపత్రాలు అందజేసి, చైతన్యపరిచారు. ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రత్యేకతలను గురించి వారికి వివరించారు. నిర్మాణాత్మక, నాణ్యమైన ఉచిత విద్యతోపాటు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు, ఇంటి వద్ద పాఠ్యపుస్తకాల్లోని అభ్యాసాలు పూర్తి చేయుటకు వర్క్ బుక్కులు, నోట్ బుక్కులు, ఇతర స్టడీ మెటీరియల్ ఏడాదికి రెండు జతల స్కూలు యూనిఫామ్స్, ఉచితంగా అందజేస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు నిపుణులైన డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నామన్నారు. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా పౌష్టికాహారంలో భాగంగా ప్రతి రోజూ ఉదయం పాఠశాల పిల్లలకు రాగులు, బెల్లం పౌడర్ కలిపి తయారు చేసిన రాగిజావ, పూరి, ఉప్మా, ఇడ్లి, వడ, అటుకుల ఫ్రై, గుడాలు, పులిహోర, కిచిడి వంటివి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కింద పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, వారానికి మూడు కోడి గుడ్లు, సన్నబియ్యంతో రుచి, శుచి కరమైన భోజనంతో పాటు మినరల్ వాటర్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులకు వివరించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పాఠశాలలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామని, పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వాహణతో పాటు వాటిని అందంగా, ఆకర్షణీయంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసినట్లు ఆయన వివరించారు. పిల్లల తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేసుకోకూడదని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ఉచిత విద్యా సౌకర్యాలను పొందాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రుల్ని కోరారు. కార్యక్రమంలో టీచర్లు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పిల్లలు వారి తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
ఉచిత విద్యా సౌకర్యాల్ని వినియోగించుకోవాలి ;--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి