సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -537
తరక్షుఢాకీనీ న్యాయము
****
తరక్షు అనగా సివంగి. ఢాకినీ అనగా రక్తపానము చేసే దయ్యము,విశుద్ధ చక్రము వద్ద నుండే అమ్మవారి అంశ అయిన దేవత అనే అర్థాలు ఉన్నాయి.
సివంగిని ఎక్కి అమ్మవారు లేదా మహాకాళి వచ్చినట్లు అంటే సాక్షాత్తూ ఆ దుర్గా మాత రూపంలో వచ్చినట్లు అని అర్థము.
ఇక ఈ ఢాకినీ దేవతను గురించి తెలుసుకుందాం. ఈ దేవతను కాళికా దేవి, మహాకాళి, మహంకాళి, భద్రకాళి, కాళికా, దుర్గామాత ,కనక దుర్గ అనే  అనేక పేర్లతో పిలుస్తారు.ఈ దేవతను హిందూ మతంలో అతి శక్తివంతమైన,అనంత శక్తి దాయినిగా కొలుస్తుంటారు. అంతే కాదు అంతిమ శక్తి, విధ్వంస దేవత అని కూడా అంటుంటారు.
శక్తులను పూజించే శాక్తేయులు ఈ దేవతను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని  కలిగించే దేవతగా ఆరాధిస్తే.మరికొందరేమో భవతారిణిగనూ,శివుని భార్యగానూ కొలుస్తారు. దశ మహా విద్యలలో ఆదిశక్తి పేరిట అతి కౄరమైన రూపంగానూ, తాంత్రిక సంప్రదాయంలో మొదటి దేవతగానూ భావించి కొలుస్తుంటారు.అంతేకాదు మంత్రాల ద్వారా లీలలు, అద్భుతాలు చేసే ఓ స్త్రీగా కూడా ఢాకిని గురించి చెబుతుంటారు.
ఇక ఈ దేవతను అంతిమ అభివ్యక్తి,ఆదిమ విశ్వశక్తి,అన్ని జీవులకు తల్లిగా అమాయకులను రక్షించే దేవతగా, చెడును నాశనం చేసే అమ్మవారిగా ఆరాధిస్తారు.రామకృష్ణ పరమహంస వంటి యోగులు సైతం కాళీమాతగా ఈమెను పూజించడం జరిగింది.
ఈ శక్తి  దేవత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.పురాణాల ప్రకారం అమ్మ వారిని దుర్గా మాతగా, మహిషాసుర మర్ధినిగా పిలవడం చూస్తాం. కారణం దుర్గాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుని నుండి అనేక వరాలను పొందుతాడు.ఆ వరాల గర్వంతో ముల్లోకాలను ఇబ్బంది పెడుతుంటాడు.ముల్లోకాలలోని దేవతలు పరాశక్తిని వేడుకుంటారు.శతాక్షి రూపంలో దుర్గాసురుడిని సంహరించడంతో ఆమెను దుర్గామాతగా కొలవడం మొదలుపెట్టారు.మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో  ఈ దుర్గా దేవి కథ వుంది. సింహ వాహనం మీద బయలు దేరి మహిషాసురుని సంహరిస్తుంది. అందుకే దుర్గా దేవిని మహిషాసుర మర్ధినిగా కూడా కొలుస్తారు.
 ఇలా ఆది పరాశక్తి అయిన అమ్మవారిని నవదుర్గలుగా   నవరాత్రులలో పూజిస్తారు.ఒక్కో దుర్గా మాత  ఒక్కో వాహనం మీద అనగా సింహం, పెద్ద పులి, ఏనుగు,, అశ్వము మొదలైన  ప్రత్యేక వాహనాలను అధిరోహించి వచ్చి  ప్రత్యేక సందేశాలను ఇస్తుంటుందని భక్తుల విశ్వాసం. ఇలా అమ్మవారి అనేక రూపాల గురించే కాకుండా ఆమె మహిమల గురించి కూడా అనేక కథనాలు ఉన్నాయి.

 " ముఖ్యంగా  తరక్షుఢాకీనీ న్యాయము" ఎందుకు  ప్రస్తావించబడినదో చూద్దాం.
అమ్మ వారు,ఆదిశక్తి స్త్రీ రూపం. ఆదిమ మానవుల సమాజాన్ని చూసినట్లయితే మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది.ఆమెను ఎంతో గౌరవంగా చూడటంతో పాటు దైవంగా భావించే వారు.మహిళలు ఏ  విధంగా  ఉండాలో చెప్పడం కోసం సృష్టించబడిన న్యాయంగా దీనిని చెప్పుకోవచ్చు.ఆదిశక్తి అమ్మ వారు దేవతలందరిలో ఎంతటి శక్తివంతమైన దేవతో తెలిసిన ప్రతి స్త్రీ తమపై ఎవరైనా అఘాయిత్యం, అత్యాచారానికి పాల్పడితే తరక్షుఢాకీనీనిలా వారిని చీల్చి చెండాడాలనీ, అలాంటి ధైర్య సాహసాలు స్త్రీ జాతి అణువణువునా నింపుకోవాలనే అర్థంతో ఈ న్యాయమును మనం అర్థం చేసుకోవాలి.పసితనం నుండే బాలికలకు ధైర్య సాహసాలతో  పాటు తనను తాను రక్షించుకోవడానికి కావలసిన శక్తి యుక్తులు  నేర్పాలి.

కామెంట్‌లు