దిష్టిబొమ్మ;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 వాడు ఏతల్లి కన్నబిడ్డో
ఉషోదయాన్నే బయలుదేరుతాడు
మైళ్ళకొద్దీ నడుస్తాడు
ప్రతిఇంటిముందూ చిరునవ్వులపువ్వులు రాలుస్తాడు
పేదలబతుకుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రజాలికుడు
పసిమనసులు మురిపించే మాయగాడు
వీధులయినా, సంతలయినా,జాతర్లయినా,
ఉర్సులయినా వాడికేమీ తేడాలేదు
సీజనల్ వస్తువులతో
వాడిగంప ఎప్పుడూ నిండుదే
కాని,వాడి కడుపు మాత్రం
ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది
వాడి కాళ్ళు విధివంచితాలైనా 
వాడి చేతులు శప్తబందీలైనా
వాడి కళ్ళు శోకాశ్రుపుష్పశకలాలైనా
తన అస్తిత్వంకోసం నిరంతరం తిరుగుతూ
ప్రపంచ విపణి వీధిలో దిష్టిబొమ్మగా నిలబడాల్సిందే!!
**************************************

కామెంట్‌లు