ముక్తినాథ దేవాలయం;- - యామిజాల జగదీశ్

 వైష్ణవుల 108 దివ్యదేశాలలో ముక్తినాథ్ క్షేత్రం ఒకటి.  నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లా పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలలో భాగమైన తొరంగ్ వా పర్వతపాదం వద్ద ఉందీ పవిత్ర క్షేత్రం. ఉంజీ ఆలయం.  హిందువులు, బౌద్ధులు కలిసి పూజించే ఈ క్షేత్రం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం. ఈ పవిత్ర క్షేత్రాన్ని హిందువులు ముక్తి క్షేత్రమంటారు. అంటే మోక్షాన్నిచ్చే ప్రదేశం అని అర్థం. మొదట్లో ఈ ఆలయం వైష్ణవుల ఆధీనంలో ఉండేది. అనంతరం ఇది బౌద్ధుల ఆరాధనా కేంద్రంగా మారింది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశాన్ని సాలగ్రాం అని పిలిచేవారు. శ్రీమన్నారాయణుడికి ప్రతి రూపమైన సాలగ్రామాలు ఇక్కడ అధికంగా లభిస్తాయి. శక్తి పీఠాలలో ఒకటిగానూ పరిగణిస్తారు.
ఈ ఆలయంలో విష్ణువే శ్రీముక్తినారాయణుడి రూపంలో ఓ స్వర్ణ విగ్రహం ఉంది. ముక్తి నారాయణతో పాటు, ఆలయంలో భూదేవి, సరస్వతి, సీత, గరుడ, లవకుశల కాంస్య విగ్రహాలు ఉన్నాయి. అలాగే సప్తఋషులు (బ్రహ్మ దేవుడు సృష్టించిన ఏడుగురు ఋషులు)ను కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడి ముక్తి నాథుణ్ణి దర్శిస్తే జనన మరణాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే... ఉదయం హిందూ పద్ధతిలో, సాయంత్రం బౌద్ధ పద్ధతిలో పూజలు నిర్వహించడం. కారణం ఏమిటంటే, బౌద్ధులు ముక్తినాథ్ ఆలయాన్ని వంద పవిత్ర జలధారలుగా పూజించినట్లే, హిందూ వైష్ణవులకు ఇదొక పవిత్ర స్థలం. తిరుమంగైయాళ్వార్, పెరియాళ్వార్ ముక్తినాథుని స్తుతిస్తూ మంగళాశాసనం చేశారు. ఈ ఆలయంలో మరో విశేషం ఇక్కడ రామానుజుల విగ్రహం ఉండటం. కాగా పెరుమాళ్ పక్కన బుద్ధ విగ్రహం ఉండటం మరొక విశేషం. ఆలయం వెనుకే 108 తీర్థాలు ప్రవహిస్తున్నాయి. వీటిలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ఓ సంప్రదాయం.
సంవత్సరంలో మార్చి నుండి జూన్ వరకు ముక్తినాథ్ సందర్శనకు అనుకూలమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ముక్తినాథ్ ఆలయంలో ప్రార్థనలు, ఆరాధనలను కానిచ్చుకున్న తర్వాత హిందువులు, బౌద్ధులు ఆలయ ప్రవేశ ద్వారం సమీపంలోని చిన్న మఠమైన మెబర్ ల్హా Mebar Lhaను సందర్శిస్తారు. ఈ మఠాన్ని, పద్మసంభవకు అంకితం చేశారు. ఇక్కడకూడా బౌద్ధ దేవత చెన్రెజిగ్ (అవలోకితేశ్వర) విగ్రహం ఉంది. ఇక్కడ నిరంతరం వెలిగే అగ్నిని హిందువులు అగ్ని దేవతైన “జ్వాలా మాయి”గా ఆరాధిస్తారు.
 

కామెంట్‌లు