మహాకవి దాశరథి శత జయంతి ఉత్సవాల సందర్భంగా
============================================
తెలంగాణా ప్రజల కన్నీళ్లను అగ్నిధార గా మలిచి నిజాం పాలన మీద ఎక్కుపెట్టిన దాశరథి కృష్ణమాచార్యులు దాశరథిగా సుప్రసిద్ధుడు.
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణా విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతః స్మరణీయుడు.
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణా ఉద్యమానికీ ఊపిరూలిదిన కవి.
దాశరథి 1925 జూలై 22 న పూర్వ వరంగల్ జిల్లా చిన్న గూడూరు లో జన్మించారు.బాల్యం అంతా మధిరలో గడిచింది. ఇంటర్ భోపాల్ లో, ఉస్మానియా లో బి.ఏ.,
ఇంగ్లీష్ చదువుకున్నారు.
మొదట్లో కమ్యూనిస్ట్ గా ఉన్నా 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బయటికి వచ్చి నిజాం
అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తన గళం ఎత్తి ఉద్యమంలో పాలు పంచుకున్నాడు.
కొంతకాలం ఉపాధ్యాయుడుగా, రేడియో ప్రయోక్తగా చేశాడు.
కధలు,నాటికలు,
చిత్రగీతాలు,కవితలు ఇలా అనేక ప్రక్రియలలో రాశాడు.
నిజాం పాలనలో అనుభవిస్తున్న ప్రజల
కష్టాలను చూసి చలించిపోయాడు.
పీడిత తాడిత ప్రజల గొంతుగా మారాడు.
ఆంధ్ర మహాసభలో చైతన్య వంతమైన పాత్ర పోషించి ఇందూరు లో జైలుశిక్ష అనుభవించాడు.
జైలులో సహ ఖైదీ మిత్రుడు వట్టికోట ఆళ్వార్ స్వామి ఉన్నాడు. పళ్ళు తోమే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి
దెబ్బలు తిన్నాడు.
భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా
సాంస్కృతిక చైతన్యం రగిలించాడు.ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో ఒకడు. 1953లో తెరసం స్థాపించి ప్రజల్లో సాహితీ చైతన్యాన్ని రగిలించాడు.
1977 లో ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా నియమించబడ్డాడు.
తన సాహిత్యానికి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతులు గెల్చుకున్నాడు.
గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగు లోకి అనువదించాడు. తల్లి తెలంగాణా మీద ఆయన రాసిన పద్యాలు ఇప్పటికీ
ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. తెలంగాణాలో ఒక సుప్రసిద్ధ కవిగా రాణించిన దాశరధి 1987 నవంబర్
5 న పరమపదించారు.
పుస్తక పరిచయం:
******
దాశరథి రచించిన పద్యాలు, కవితలు
శ్రీరామ&కో. తెనాలి వారు రుద్రవీణ అను పేర ఒక సంపుటిగా వేశారు. ఇది 1950 లో ప్రధమ ముద్రణ అయ్యింది.
వెల 1రూ. దీనిలో మొత్తం 20 అంశాలు ఉన్నాయి.
ప్రకాశకులు తమ ముందు మాటలో
కోటి తెలంగాణ ప్రజల
ఏకైక మహా కంఠ
వీణాధ్వని వినాలంటే దాశరథి కావ్య గానం
వినాలి అనీ,దాశరధి గీతాలు వినని రసికులు,అతని సాహిత్యాన్ని ప్రేమించని వారు తెలంగాణాలో లేరని,ఆయన గీతాలు
పల్లెల నుండి పట్నాల దాకా, ధనికుడి నుండి
పేదవాడి దాకా, మితవాది నుండి అతివాది దాకా ప్రసరించాయనీ
అభిప్రాయపడ్డారు.
కావ్య సమీక్ష
*****
ఈ గ్రంథంలో మొత్తం 20 పద్య అంశాలు ఉన్నాయి. వేటికవే చాలా భిన్నంగా ఉన్నాయి. దాశరథి రచనలను
సంపుటీకరించి సాహితీమేఖల సంస్థ వారు "అగ్నిధార" గా వేయగా, దాశరథి మరికొన్ని రచనలను, ఆ కాలం లో స్వతంత్ర మొదలగు పత్రికలలో వచ్చినవి, శ్రీరామా&కో.వారు ఒక గ్రంధంగా రుద్రవీణ పేర వెలువరించారు.
అంశాల వారీగా దాశరథి కావ్యాన్ని ఒక్కో శీర్షిక కు ఒక్కో పద్యాన్ని ఉదహరిస్తూ
అవసరమైన చోట పద్య కవితా విశ్లేషణ చేయటం జరిగింది.
1.
రుద్రవీణ
ఇటునటును తెల్గునేల
లారటము జెంది
కలసి పో జూచుచున్న
ఎట్టులనె తోచు.,
కలిపి వేయుమి, నా తెలంగాణ తల్లి!
మూడు కోటుల నొక్కటే ముడి బిగించి
నా కోర్కె తీర్పు మమ్మా!!
అని విశాలాంధ్ర అనేది తన కల అని తెలుపుకున్నాడు.
2.
మంగళగీతి
వెన్నెల కాగడాలకు ద్రవించెడి చీకటి కొండపైన కూర్చున్న
అనంత తారకలు రొప్పుచు రోజుచు జారివచ్చి ఈ పున్నమి నాటి చెంగలువ పూవుల ఓల్ వికసించెనో యనన్
మిన్నులు దించి తెచ్చెదను మేచక వారిరుహా కరమ్ములన
3.
మూర్చన
చింతల తోపులో కురియు చిన్కులకున్
తడిముద్ద యైన బాలింత యెడిన్ శయనించు పసిరెక్కల
మొక్కను ఓని బిడకున్
బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబయి పోవునేమొ., సాగింతును రుద్రవీణ
పయనించుక వెచ్చని
అగ్నిగీతముల్.
అంటూ తన అగ్ని గీతాలతో ఆ తల్లిబిడ్డలు ఇరువురినీ వెచ్చగా చేస్తా అంటాడు.
4.
రస సమాధి
పూవుల దారిలో ఏడద
పొంగులు వార.....
శరత్కాలమునందు
విరబూసిన వెన్నెల దారులలో హృదయం
పొంగులు వారగా
శశి ని వలపించే చంగల్వ కన్నియ కన్నులలో పగడాల
కాంతి తోచినట్లుగా
కన్పించుచున్నదని కవి భావన.
5.
ఉషస్సున్దరి
నా నయనాలలో ప్రళయనర్తన శీలి మహానటుండు.....
నా కన్నులలో ప్రళయ కాలమందు నర్తించే మహాశివుని చూసిన
అతని బొటనవేలి యొక్క గోరు చివరి భాగం భగ్గు భగ్గుమని రెచ్చిన అగ్నివోలె ఉంది. భూమ్యాకాశాలు వణికి పోతున్నాయి.ఓ ఉషస్సున్దరీ నీ మోమును
మరల్పుము అని ఉషస్సు కు మేలుకొలుపు పాడుతున్నాడు.
6.
మేలుకొలుపు
సంజ వెలుంగులో మొయిలు చాటున ఫక్కున నవ్వు చుక్కలో
పుంజిత మైన రాతిరి కవుంగిట నిద్దురపోవు చందమామం జపియించు చంగలున
మానిని కన్నులలో ప్రవాళరేఖం జతసేయ
భాను కర కంజము లోకము మేలు
కొల్పెడిన్
7.
స్వామి పూజ
పడమర గాలి తాకిడికి వాడియు రాలిన పూల బాలులో....
పడమర గాలి తాకిడికి
వాడిపోయిన పూల మాదిరిగా నా హృదయం కూడా వాడిపోయినది స్వామి
ఎట్లు నిన్ను గయి సేతునింక
నీ అడుగుల సవ్వడి వినగానే నా నవ నాడులన్ని గడగడ లాడుతున్నాయి నా కళ్ళలో నెత్తుటి జీరలు కనపడతాయి.
8.
పచ్చని గడ్డిపై
పచ్చని గడ్డిపై కరకు పాదములంతటి కక్ష బూనెర....
పచ్చని గడ్డి పై మనిషి కరకు పాదాలతో తొక్కగా మచ్చుకు కూడా గడ్డి కనిపించడం లేదు. ఆ పాదాలు ఎంత కక్ష బూనాయో కదా.దైవం కూడా దీనిని మెచ్చాడు కాబోలు. ఈ రోజు హఠాత్తుగా వచ్చిన వానజల్లులతో ధరిత్రి తిరిగి పచ్చగడ్డి మొలకలతో పచ్చబడింది.
9.
వీర తెలంగాణము
తెలగాణమ్మున గడ్డి పోచయును సంధించెన్ కృపాణమ్ము!!....
తెలంగాణా లో నిజాం దుష్పరిపాలన చూసి
రోషముతో గడ్డిపోచ కూడా కృపాణంగా మారి ఆ దుష్ట నిజాము పీచమడచటానికి యుద్ధం చేసింది.ఈయుద్ధానికి
జగమంతా భీతిల్లిపోయింది. దివిలోని దిక్కులన్నీ ఇంద్రుని యొక్క ధనస్సు శర పరంపరలతో సయ్యాటలాడాయి.
10.
ముక్తభూమి
శ్రామికుని వేడి నిట్టూర్పులకు ప్రపంచమెన్నడో కాలి బూది కానున్నదేమొ....
శ్రామికుని వేడి నిట్టూర్పులకు ప్రపంచం ఎన్నడో
కాలి బూడిద కానున్న దేమో. లేనిచో కొండలు, అరణ్యాలు ఎండ వడకు గాలికి ఎలా మండిపోతాయి.
11.
అగ్ని కుంకుమము
లేదు లేదు చల్లారగా లేదు....
గద్దెల నెక్కి పేదల రక్తాన్ని సిగరెట్లుగా పీల్చువారిని పెద్దవారి గుండెల్లో రగులుతున్న అగ్ని కాల్చేస్తుందనీ అప్పటి దాకా ఆ మంట
చల్లారదనీ ఈ పద్యంలో కవి పేర్కొన్నాడు.
12.
సుప్రభాతం
నాగేటి చాళ్లలో నడిచే
రైతులారా....
నాగేటి చాళ్లలో నడిచే రైతులారా మీ నిశ్శబ్ద గళాలు పాడిన గీతా రహస్యాలు బధిర
లోకానికి...అంటే ఈ చెవిటి లోకానికి వినిపించే నా రుద్రవీణ ఇదిగో..... అంటాడు కవి.
13.
రానున్నది
రానున్నది ఏది నిజం
అది ఒకటే సోషలిజం
కలపండోయ్ భుజం భుజం
కదలండోయ్ గజం గజం
అడుగడుగున యెడద
నెత్తురు మడుగులుగా
విడవండోయి
పడిపోయిన గుడి గోడలు విడిచిపెట్టి నడవండోయి
ఉదయాకాశ పతాకం
ఎద లో కదలాడే నేడు
హృదయావేశ తటాకం
నదిలా పొరలాడె నేడు
రానున్నది ఏది నిజం.
ఈ పద్యం చదివితే శ్రీశ్రీ
మహా ప్రస్థానం గుర్తుకు రాక మానదు.
14.
రుధిరపక్షులు
నేను మీటే రుద్రవీణకు
స్వరం నేర్పే రుధిర పక్షులు
దిక్కు దిక్కులు
ముక్కు మొనతో
రక్కి వచ్చిన రుధిర పక్షులు
...
బధిర లోకం ప్రాణవాయువు
బాగుచేసే రుధిర పక్షులు
...
చీకటింటికి చిన్ని కిరణం
తెచ్చి విడిచే రుధిర పక్షులు
...
15.
కవాటం
గతాన్ని విస్కీలా తాగిన
కవిన్నేను
భవిష్యత్తు నిషా నిజం.
విముక్తి కోసం పోరాడిన
సమరవీరుల సమాధి శిఖరాల్లో సింహాసనాలు వేసుకు
కూర్చుండిన కొత్త రకం
పరిపాలకులారా
శవాలు బ్రతికాయి, లేస్తాయి, మీతో మళ్ళీ
రణం చేస్తాయి
16.
మహాగీతం
చరిత్ర పాడని
ధరిత్రి చూడని
పవిత్ర గీతం పాడండి
విచిత్ర భూతం చూడండి
నరాలలో తరతరాల గాధలు
శిరస్సులో నరనరాల
బాధలు
గిరి శిరస్సు పై హరీంద్ర గర్జన
మన మనస్సులో తర్జన భర్జన
పర ప్రభుత్వపు టురికంబాలు
ప్రజాప్రభుత్వపు
గజిబిజి చర్యలు
స్వతంత్రమంటూ
పెద్ద మాటలు
కుతంత్రాలతో
గ్రుద్దులాటలు
విన్నాం కన్నాం
కన్నాం విన్నాం.
17.
రుధిర దీపిక
ఈ చరిత్ర చీకటి గదిలో
ఈ ధరిత్రి అమ్ముల పొదిలో
తైల దీపం వెలుతురుతో
వెదకి వెదకి వేసారినా
లభించేది కనిపించేది
పెద్దల విద్యావంతుల
ధనరాజుల
తరతరాల బూజుల
ఒట్టి పాతగాజుల విలువలు
చిలువలు పలువలుగా
అల్లి, కల్పించి చెప్పే అబద్ధాల
రాజాధిరాజుల
మార్తాండతేజుల
పురుషత్వపు పరుషత్వపు
అల్లిబిల్లి అల్లిక బిగి కథలు
అవునా
అనాధ శ్రామిక మూర్తీ
ఆగామి యుగ పరివ్యాప్త కీర్తి.
...
తొలగించుకో యుగయుగాల పీడతనం చూపులు
లే తండ్రీ
లయరుద్ర మహానుభావా
ప్రియ విశ్వ శ్రామిక దేవ!!.......
అంటూ శ్రామికులను
దేవుళ్లుగా కీర్తిస్తాడు.
18.
అనంత సంగ్రామం
కర్షకులు కార్మికులు
మధనపడ్డ మేధావులు
తమ శ్రమలకు
తగిన ఫలం ఇమ్మంటే
తిరుగుబాటు
షావుకారు వడ్డీలకు
జమీందారు హింసలకు
వేగలేక ఆగలేక
ఎదిరిస్తే కమ్యూనిస్టు.
అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాధుడికి ఆగర్భ
శ్రీనాధుడికీ మధ్య!!
19.
హిమధామం
ఈ ఉత్తర దిశా
వాయు మండలం
గాలిలో తేలుతున్న
హిమాచలం
సుదీర్ఘ చైనా కుడ్యానికి
రెండు పక్కలు
మంచు పిట్ట రెండు రెక్కలు
నర్తించే రజత సర్పాల
దండలు ఈ కొండలు
అంటూ హిమాలయ పర్వతాలను ఈ శీర్షికలో వర్ణిస్తాడు కవి.
20.
శిల్పి
ఓరుగల్లు శిల్పాలను చూసి ముగ్దుడై శిల్పిని గురించి రాశాడు.
నిను గని కొండలన్ని రమణీ కుచ పాళికలై
కపోల మోహన ఫలకమ్ములై,భ్రుకుటులై
శురాంగనలై రూపు దిద్దుకొనగా,ఉలితో అమృతమ్ము చల్లి జీవనములు పోసి పోయెదవు,బ్రహ్మవు,
శిల్పి కులా వతంసమా
అంటూ శిల్పిని బ్రహ్మతో
పోలుస్తూ తన పద్యాలతో అభినందిస్తాడు దాశరథి.
ఉపసంహారం
అభ్యుదయ కవి చక్రవర్తి, కవిసింహ, మహాకవిగా ఎన్నో బిరుదులు పొందిన
దాశరథి రాసిన
ఈ రుద్రవీణ కావ్యాన్ని
నా తెలంగాణా కు అంకితం... అంటూ
నా తెలంగాణా కోటి రత్నాల వీణ అంటూ...నినదించి
తన తెలంగాణా పై ప్రేమను చాటుకున్నాడు.
దీనిలోని
కొన్ని పద్యాలు సంస్కృత పదభూయిష్టం గా ఉన్నప్పటికీ రాను రాను అచ్చ తెలుగు వ్యావహారిక భాషలో దర్శనమిస్తాయి.
దీనిలోని కొన్ని పద్యాలు చదువుతుంటే దాశరథి పై శ్రీశ్రీ ప్రభావం పడిందని చెప్పవచ్చు.
శ్రీ శ్రీ మహా ప్రస్థానం లోని కవితల్లాగా దాశరధి కూడా నిజాం దుష్కృత్యాలను ప్రత్యక్షంగా చూసి చలించి తాడిత పీడిత
బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గళమెత్తి, కలమెత్తి గర్జించిన కవిగా మనకు ఈ కావ్యంలో కనిపిస్తాడు. ఇరు తెలుగు రాష్ట్రాలూ
మెచ్చిన మహాకవి దాశరథి.
------------------
దాశరధి ;- పరిమి వెంకట సత్యమూర్తిహస్తినాపురం సెంట్రల్,హైదరాబాద్చరవాణి:9440720324
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి