న్యాయాలు -566
ధనుర్గుణ న్యాయము
*****
ధను అనగా విల్లు. గుణ అనగా గుణము( మంచి , చెడు)ఒక సద్గుణము, ఉపయోగము, ఫలము, త్రాడు,అల్లెత్రాడు,వీణ యందలి తీగె,ఆవృత్తి, గొప్పదనము,3అను సంఖ్య అనే అర్థాలు ఉన్నాయి.
విల్లు వంకరగా ఉన్నప్పటికీ విలుకాండ్రు దానికే అల్లెతాడు బిగించి బాణాలను ప్రయోగిస్తారు.
విల్లు అనేది బాణాలను విసరడానికి ఉపయోగించే ఒక రకమైన ఆయుధం. మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆయుధం ఇదే. వేల సంవత్సరాల నుండి నేటివరకు దీనిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక్క భారతీయులే కాదు ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లు, పర్షియన్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో పురాతన నాగరికతలచే ఉపయోగించబడింది. ఇక భారతీయ సంస్కృతిలో ఈ ధనుర్భాణాలను వేట, యుద్ధం, క్రీడలు మొదలైన వాటిలో ఉపయోగించడం మనకు తెలిసిందే.పూర్వకాలంలో రాజులు తప్పనిసరిగా విలువిద్యను నేర్చుకునేవారు.విలు విద్య అనేది ఆ రోజుల్లో ప్రసిద్ధ వినోద కార్య కలాపం.
ఇక ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం.ధనుస్సు లేదా విల్లును సాధారణంగా కలప, కార్బన్ ఫైబర్ తో తయారు చేస్తారు. వింటి తాడును విల్లు చివరలకు జోడించబడి వెనుకకు లాగినప్పుడు ఒక లాంటి శక్తి విడుదల అవుతుంది.ఇక బాణము పదునైన మొన, ఈకలతో వెనుక భాగంలో ఒక బాణాన్ని విల్లుపై ఉంచి సంధించినప్పుడు వంగిన విల్లు అవయవాలలో నిలువ చేయబడిన శక్తి బాణానికి బదిలీ చేయబడి బాణాన్ని ముందుకు వేగంగా పరుగులు పెట్టేలా చేస్తుంది.మన దేశ క్రీడల్లో విలువిద్యను కూడా ఒక పోటీగా నిర్వహిస్తున్నారు.
ధనుర్భాణాలు ఎలా ఉపయోగిస్తాడో గమనిస్తే..ధనుర్ధారి ఒక చేతితో విల్లును పట్టుకుని, మరొక చేతితో బాణాన్ని వింటినారి పై వుంచి లాగి వదులుతాడు.అలా బాణం యొక్క మార్గము,ధనుర్ధారి యొక్క లక్ష్యము బాణం యొక్క తయారీ రకం,గాలి వంటి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుకున్న వైపు దూసుకెళ్తుంది.
ఆధునిక కాలంలో దీనిని పోటీ క్రీడగా మార్చారు.ఈ విద్యను అభ్యసించడం ద్వారా ధ్యానం,వ్యాయామం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
మామూలు దృష్టితో చూస్తే విల్లు ఒకనాడు ఆత్మ రక్షణకు, ఆహార వేట కోసం ఉపయోగించిన ఆయుధం.ఆ తర్వాత వీరుడు ఉపయోగించే ఆయుధాల్లో ముఖ్యమైనదిగా పేరు పొందింది. రామాయణంలో శ్రీరాముడు, మహాభారతంలో అర్జునుడు విల్లును ఉపయోగించడం చూస్తాం.శ్రీరాముడు ఎల్లప్పుడూ ధనుర్ధారిగా కనిపించడం మనకు తెలుసు.
మరి ఈ ధనుర్గుణ న్యాయమును మన పెద్దలు ఎందుకు వ్యక్తులకు వర్తింపజేసి చెప్పారో చూద్దాం.
ఈ ధనుస్సు లేదా విల్లు ఆకారాన్ని పరికించి చూస్తే అందులో ఉన్న గొప్పదనం గానీ,శక్తి గానీ ప్రత్యక్షంగా కానరావు. వంకర తిరిగి పెదవి ఆకారంలో చెక్క ముక్కలతో తయారు చేసిన వస్తువుగా మాత్రమే కనిపిస్తుంది. కానీ దానికి బాణాన్ని కలిపి సంధిస్తే అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది.
దీనినే మనశ్శరీరాలకు వర్తింప చేస్తే దేహమెలా ఉన్నా సంకల్పమనే అల్లెతాడు బిగించి,మనస్సనే శరాన్ని సంధిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, చేరడానికి అవకాశం ఉంటుంది. మనిషి ఎప్పుడూ వినయంగా ఒదిగిన విల్లులా వుండాలి. ధనుర్గుణం అదే కదా!సందర్భం వచ్చినప్పుడు సంధించిన బాణంలా దూసుకు పోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఈ "ధనుర్గుణ న్యాయము"ను ఉదాహరణగా చెప్పి వుంటారనేది మనకు ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది.ఇలా ఇందులోని అంతరార్థం గ్రహించిన మనం కూడా అలాగే వుందాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి