సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా.

 న్యాయాలు -560
దుష్ట విద్యా ప్రదాన న్యాయము
*****
దుష్ట అనగా చెడినది,పాడైనది,గాయపడినది,నశించినది,దూషితమైనది,ఉల్లంఘించబడినది,భ్రష్టమైనది,నీచమైనది.విద్యా అనగా చదువు.ప్రదానం అనగా ఇచ్చుట, బహుమతి అనే అర్థాలు ఉన్నాయి.
 దుష్టులకు విద్యను నేర్పితే లేదా వస్తే అది  చెడుకే కానీ మంచికి ఉపయోగపడదని అర్థము.
 దుష్టులు తాము నేర్చుకున్న విద్యను ఎప్పుడూ తమ స్వార్థం కోసమో, ఇతరుల వినాశనం కోసమో ఉపయోగిస్తుంటారు. వారు ఎంతటి విద్యావంతులు అయినా అలాంటి వారికి దూరంగానే వుండాలి. దానికి సంబంధించిన ఈ శ్లోకం ఏం చెబుతుందో చూద్దామా...
 "విద్యచే భూషితుండై వెలయుచున్న/ తొడరి వర్జింప నగునుమీ దుర్జనుండు/ చారు మాణిక్య భూషిత శస్త మస్త/ కంబైన పన్నగము భయంకరము గాదె/"
అనగా పాము తలపై ఎంత విలువైన మణి ఉన్నా దాని జోలికి పోము. ఎందుకంటే పాముది దుష్ట స్వభావం. పాలుపోసి పెంచినా కరవక మానదు అంటారు.అందుకే పాము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఉంటాము కూడా. పాము లాంటి వాడే దుర్జనుడు.ఎంత విద్యను అభ్యసించినా అతనిలో దుష్టత్వం బలంగా పాతుకుపోయి వుండటం వల్ల  అతని వల్ల నష్టమే జరుగుతుంది.కాబట్టి అతడికి ఎప్పుడూ దూరంగానే వుండాలి"అని అర్థము.
 అలాంటి  ఎంతటి విద్య/ చదువు ఉన్న దుష్టులైనా  వారి సహవాసం,స్నేహం వెంటనే మానేయాలి.దీనికి నిత్య జీవితంలో జరిగే సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం నడుస్తున్నప్పుడో,ఒక చోట కూర్చున్నప్పుడో  ఆ పరిసరాల్లో ఉన్న ఓ చీమ కుడితే వెంటనే కుట్టిన దాంతో పాటు అక్కడే ఉన్న చీమలను నలిపేయడమో,లక్ష్మణ రేఖ లాంటివి పెట్టి చంపేయడమో చేస్తాం. మనల్ని కుట్టింది ఒక్క చీమే కానీ దాని వల్ల మిగతా చీమలన్నీ బలైపోయాయి.
అలాగే దుష్టుల సాంగత్యం,వారి ప్రవర్తన వల్ల సామాన్యులు,సహచరులుగా ఉన్న వారు యిబ్బందులకు గురవుతారు.కాబట్టి "త్యజ దుర్జన సంసర్గం,భజ సాధు సమాగమం, కురు పుణ్య మహో రాత్రం" అన్నారు.అంటే దుష్టులకు దూరంగా, సజ్జనులకు దగ్గరగా చేరాలి.ఈర్ష్య , అసూయ, క్రోధం లాంటి దుర్గుణాలను దరికి రానీయకుండా జాగ్రత్త పడాలి అని అర్థము.
ఇలాంటి అర్థాన్ని ఇచ్చే  భాస్కర శతక పద్యాన్ని కూడా చూద్దామా...
"అనఘునికైన చేకూరు ననర్హుని గూడి చరించునంతలో/ మన మెరియంగ అప్పుడవమానము కీడు ధరిత్రి యందునే/ అనువునైన తప్పవు యథార్థము/ తానది యెట్టులున్నచో ఇనుమును గూర్చి/ అగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా!"
అనగా ఎంతటి మంచివారైనా, సంస్కారం,సహృదయత లేని  వారితో స్నేహం చేయడం వల్ల,అవమానం, అపకీర్తి కలుగుతాయి.అదెలా అంటే అగ్ని ఇనుముతో కూడి వుండటం వల్ల అగ్నికి కూడా సమ్మెట దెబ్బలు పడుతుంటాయి కదా! అలాగే చెడ్డవాని సహవాసం వల్ల మంచి వారికి కూడా అగౌరవం కలుగుతుంది అని భావము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇనుము లాంటి వ్యక్తి ఎంత విద్య నేర్చినా, విద్యావంతుడైనా అతనితో  కలిసి వుంటే సమ్మెట పోటులాంటి కష్టాలు తప్పవు.
 విద్యను సరైన విధంగా ఉపయోగించుకునే వారిలో క్రింద శ్లోకం  చెప్పిన విధంగా ధర్మ నిరతి కలుగుతుంది.
"విద్యా దదాతి వినయం,వినయాద్యాతి పాత్రతాం/పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం,తతః సుఖం!!"
 విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వలన అర్హత కలుగుతుంది.విద్యా వినయాల వలన ధనం కలుగుతుంది.ఆ ధనము ద్వారా ధర్మ నిరతి కలుగుతాయి అని అర్థము.
అలా మనిషిని, మనసును మంచిగా తీర్చి దిద్దే విద్యను దుర్వినియోగం చేసే వారు ఎప్పుడూ సమాజానికి, సాటి వారికి హాని కలిగించే వారే.ప్రమాదకారులే.
అందుకే పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాల్లో ఎవరికి ఎలాంటి విద్య నేర్పాలో గ్రహించి నేర్పేవారు.ఈ "దుష్ట విద్యా ప్రదాన న్యాయము"ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎంత గొప్ప విద్యావంతులు అయినా దుష్టులకు దూరంగా ఉండాలి.నేర్చుకున్న విద్యను సమాజ హితానికి ఉపయోగించాలి. అలాంటి వారు భావి తరాలకు మార్గదర్శకులై గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

కామెంట్‌లు