సుప్రభాత కవిత ; -బృంద
ప్రాగ్దిశను జరిగిన
నిశ్శబ్ద విస్ఫోటనం
కరిగిన కాంచనం ఒలికినట్టు
మెరిసిన అఖిల భువనం

అచ్చెరువై చూసేను
సంబరాన అంబరం
పరుగాపి  చూసేను
పాలమబ్బుల సమూహం

బంగరుకిరణాల దారిని 
దిగివచ్చె వెలుగు వేలుపు
పుత్తడిలా మెరిసే పుడమిని
నులివెచ్చగ తాకి పాడె మేలుకొలుపు

కొండల కోనల కప్పుతూ
పరచిన  మంచు దుప్పట్లు
కురిసిన వెలుగుల వానలో
తడిసి వెచ్చగ కరిగి పోయేను

చేయితిరిగిన చిత్రకారుని
చేతిలోని కుంచె రచించిన
రంగులీను సోయగాల
అద్భుత రమణీయ చిత్రం

అందమైన ప్రకృతికాంతకు
అనుదినం కనకాభిషేకాలే!
అవనికి అణువణువూ ఆభరణాలు
ఆదిత్యుని అనుగ్రహ కిరణాలు!

మరో అందమైన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు