సుప్రభాత కవిత ; -బృంద
పూల పల్లకీలపై తేలివచ్చి
మురిపించు మలయసమీరపు
అలల లాగా మనసును తాకిన
జ్ఞాపకమేదో కన్నుల మెరిపించి
పెదవులపై విరిసిన పున్నమిలాగా మొగమంతా నవ్వుల వెన్నెల పరచుకున్నట్టు ప్రసరించిన 
వెలుగుల  వేకువ

తొలగీ తొలగని చీకటిలో
విరిసీ విరియని పువ్వులాగా
తెలిసీ తెలియని మనసులోని
తెలుపలేని భావలహరి
తెలుసుకున్న తెల్లవారి
తెలివెలుగుల వేకువ

వచ్చీరాని మాటలాడే
పసిపిల్లలు  నోటివెంట పలికే
ముద్దుపలుకుల  తేనెల ఊటల
తేట తెలుగు మాటలకు
మురిసి పోయే కన్నవారి
సంతోషపు తీరున 
అలరించే అందాల వేకువ

తలపులన్ని తలుపులు తెరచుకుని
సీతాకోక చిలుకలై ఎగిరి 
విహారం చేయగోరి 
లోకాన్ని చూసిన వెంటనే
కంట వెలిగే మెరుపుల మల్లే
తూరుపింట  తొలి సంధ్య
వెలిగించే దివ్వెలాటి వేకువ

చెలిమిగా చెంత చేరి
కలిమిగా మారిన బంధమల్లే
భువిలోనే భవ్యమైన
అనుబంధపు పోలికగా
నింగిని నెమ్మదిగా సాగుతూ
నేలను బంగరు కాంతుల నింపి
దూరంగా వున్నా చేరువగా
నిలిచి పలకరించి
నిలువెల్లా చైతన్యపు 
కదలికలు నింపే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు