న్యాయాలు -571
నష్టాశ్వర దగ్ధ రథ న్యాయము
****
నష్ట అనగా నశించినది, మరుగుపడినది అశ్వ అనగా గుఱ్ఱము, ఏడు.దగ్ధ అనగా మండిన,తగులబడిన,శోకపీడితమైన,దుష్టుడైన, రథ అనగా తేరు, వాహనము, శరీరము అనే అర్థాలు ఉన్నాయి.
యుద్ధంలో ఒకడి గుఱ్ఱము చనిపోయింది. మరొకడి రథము కాలిపోయింది.ఇరువురు కలిసి తమ సమస్యల్ని అధిగమించి రథారోహణము చేసి యుద్ధంలో పాల్గొన్నారని అర్థము.
పూర్వకాలంలో రాజ్యాలను పాలించే రాజులు తమ పాలనను విస్తరించుకోవడం కోసం తరచూ యుద్ధాలు చేసేవారు. దానిని దృష్టిలో పెట్టుకొని సృష్టించిన న్యాయము ఇది.
ఇందులో యుద్ధంలో పాల్గొన్న ఇద్దరు యోధుల యుక్తి , సమయస్ఫూర్తి, సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం గురించి చెప్పడం జరిగింది. ఒక యోధుడు యుద్ధం చేస్తున్న సమయంలో శత్రువుల చేతిలో అతని గుర్రం చనిపోయింది.రథము కదిలే పరిస్థితి లేదు చేయాల్సిన యుద్ధం గుర్రం లేక పోవడం వల్ల చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అలాగే మరో యోధుడి రథము కాలిపోయింది.గుర్రము మాత్రమే మిగిలింది . మరలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో అతడికి తోచలేదు.కానీ యోధుడైన వాడు ఊరికే ఉండడు.సమయాన్ని వృదా చేయడు కదా! విజయమో వీర స్వర్గమో వరించేంత వరకు యుద్ధం చేయడమనేది వీరుడి యొక్క లక్షణం.అందుకే యుద్ధరంగాన్ని పరికించి చూస్తే గుఱ్ఱమును కోల్పోయిన యోధుడు కనిపించాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఒకరి గుర్రాన్ని మరొకరి రథానికి కట్టి యుద్ధాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత వారిని విజయం వరించిందా? వీర స్వర్గానికి వెళ్ళారా? అనేది అప్రస్తుతం.కానీ ఇందులో వారి సమయస్ఫూర్తి, సమయోచిత నిర్ణయం మనకు ఇక్కడ అర్థం అవుతోంది.
మరి ఈ నష్టాశ్వర దగ్ధ రథ న్యాయమును పెద్దలు ఎందుకు వ్యక్తులకు వర్తింపజేసి చెప్పారో చూద్దాం.
ఇలాంటి సందర్భాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో జరుగుతుండేవి.ఇప్పుడంటే క్యాటరింగులు, టెంట్ హౌసులు వచ్చాయి.కానీ పూర్వకాలంలో వివాహ సమయంలో కావలసిన అన్ని వస్తువులు అందరి వద్దా ఉండేవి కావు. వంట సామాగ్రి దగ్గర నుంచి ఎన్నో వస్తువులను ఒకరింటి నుండి మరొకరు తెచ్చుకుని అవసరం గట్టెక్కించుకునే వారు.
అంతే కాదు మనలో చాలామంది ఏదైనా వస్తువు చెడిపోతే పని ఆగిపోయిందనీ, చేయాల్సినవి చేయలేక పోయామని బాధపడుతూ ఉంటారు.అదే సమయస్ఫూర్తి, సందర్భోచితంగా ఆలోచించగలిగే వారు తమ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులతోనో,పక్కింటి వారిని అడిగో పూర్తిచేసుకుంటారు. ఓ చిన్న ఉదాహరణను చూద్దాం.ఒక కాగితం చించాలన్నా ,పండు కోసుకోవాలి అనుకున్నా దానికి ఓ చాకు లాంటిది ఉండాలి. అది లేనప్పుడు పక్కన ఉన్న మరో వ్యక్తిని అడిగి సమస్యను తీర్చుకోవచ్చు.
మరోటి చూద్దామా...ఇలాంటివి ప్రతి ఇంటిలోనూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.పిండి వంటలు చేయడానికి అవసరమైన కడాయి ( మూకుడు),గరిటలు, మిగతా సామగ్రి ఇంట్లో లేనప్పుడు పక్కింటి వారి నుండి తెచ్చుకుని ఉపయోగించుకుంటాం కదా!
ఇదండీ "నష్టాశ్వర దగ్ధ రథ న్యాయము" నుంచి మనం నేర్చుకోవలసిన యుక్తి,అవసరానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మన నిత్య జీవితంలో చాలా సార్లు వస్తుంటాయి. జరుగుతుంటాయి.ప్రయాణాల వేళల్లోనో,పదిమంది కలిసి ఉన్న సమయంలో కూడా ఈ న్యాయము వలె ఒకరికొకరు సమయస్ఫూర్తితో సహకరించుకుంటే అవసరాలు తీరుతాయి ఇక ఆనందం,ఆహ్లాదం మన వెంటే వుంటాయి .మీరేమంటారు?


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి