కోలవెన్ను రామకోటేశ్వరరావు;- - యామిజాల
 తెలుగు అందాలను ఇతర ప్రాంతాలవారికి, ఇతర దేశాలవారికి అందించాలని మనసులో తళుక్కు మనడంతో ఆ దృష్టితోనే విద్యార్థి దశ నుంచే ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, రచన సాగించడం, తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించడంతో ఆయన పేరు నలుగురి నోటా నానింది. తెలుగు భాషా సాహిత్యానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించిన ఆయనప్రముఖ ఆంగ్ల పత్రికా రచయితగా, సంపాదకుడిగా పేరుప్రఖ్యాతులు గడించారనడం అతిశయోక్తి కాదు.  
ఇంతకూ ఆయనెవరో చెప్పలేదు కదూ.
ఆయనే కోలవెన్ను రామకోటేశ్వర రావు.
1894 అక్టోబరు 22వ తేదీన జన్మించిన ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నరసరావుపేటలో హైస్కూలు వరకూ చదివిన ఆయన ఆ తర్వాత బందరులోని నోబుల్ కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం మద్రాసు వెళ్ళి అక్కడి ప్రెసిడెన్సీ కళాశాలలో నాయ్యశాస్త్రంలో పట్టా పొందారు.
కొంతకాలంపాటు బోధనావృత్తిలో ఉన్నప్పటికీ బాలగంగాధరం తిలక్, మహాత్మాగాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులైన రామకోటేశ్వరరావు జాతీయ ఉద్యమ సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాలుపంచుకుని జైలు జీవితం గడిపిన ఆయన కాగి చల్లారిన పాలలాటివారు.
న్యాయవాదవృత్తిలోనూ కొంతకాలం కొనసాగిన ఆయన  ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వరాజ్య పత్రికలో పని చేశారు.
అయితే ఆయనలోని దృఢసంకల్పం మరో అడుగు ముందుకు వేయించింది. స్వరాజ్య పత్రిక నుంచి బయటకొచ్చి అప్పటి మద్రాసు నుంచి త్రివేణి అనే ఆంగ్ల సాహిత్య పత్రికను వెలువరించడానికి పూనుకున్నారు. అనుకున్నట్టే 1927లో త్రివేణి అనే పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆశయానికి ఒక్క తెలుగువారే కాక మహారాష్ట్ర, కన్నడ ప్రాంత రచయితలూ తోడ్పడ్డారు. ఆయన త్రివేణి పత్రిక ద్వారా అందించిన రచనలు దేశవిదేశాల వారికి తెలుగు సాహిత్యం చేరువైంది. ఈ క్రమంలో ఆయన కృషి అమోఘం. అద్భుతం.
రాజనీతిజ్ఞులకన్నా సాహితీవేత్తలు భారత సమైక్యత సాధించగలరని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఏ భాషపైనా ద్వేషం పెంచుకోకూడదని, సంస్కృతానికి, ఆంగ్లానికి కూడా మనమందరం రుణపడి ఉన్నామని చెప్తుండే రామకోటేశ్వరరావుకు అడవి బాపిరాజు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు అంటే ప్రాణమిత్రులు.
ఆంగ్ల సాహిత్యం వల్ల తెలుగు సాహిత్యానికి ప్రమాదం అంటూ వచ్చిన వ్యాఖ్యలకు ఆయన ఆశ్చర్యపోయేవారు.   ఏ భాషా మరో భాషకు ప్రమాదం కాదని, ఏ భాష గొప్పతనం ఆ భాషదే అని నమ్మే ఆయన ఆంధ్రులకు ఇంగ్లీషు, హిందీ కూడా అవసరమే అని చెప్పేవారు.
తన సంపాదకత్వంలో త్రివేణి పత్రికను ఆహా ఓహో అని కాకపోయినా ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ స్థాయిలోనే నడిపిన తృప్తి తనకుందని చెప్పిన రామకోటేశ్వరరావు 1970 మే 19వ తేదీన తుదిశ్వాస విడిచారు.

కామెంట్‌లు