చినుకుల చిటపటలే
వర్షాగమన సంతోష సంబరాల
సరిగమల సప్తస్వరాలు
గుంపుగ సాగే మేఘమాలికల
అంతరంగాన వినిపించే
అనురాగమాలికలు
ఇలకు దిగివస్తున్న చినుకుల
సవ్వడి మూడంచెల స్వరగతులై
వినిపించే వీనుల విందైన కచేరీలు
తపనల తడిసిన పుడమి
వెలువరించే మట్టి పరిమళం
ఆర్తిగ వేచిన మది ఆహ్వానాలు
కొబ్బరాకులపై కురిసే వాన
చక్కని లయనిచ్చు సొంపైన
శబ్దాల గలగలల గమకాలు
నిలిచిన నీటిని తాకిన
చినుకుల సవ్వడి...
ప్రకృతికాంత పదనూపుర ధ్వనులు
గాలితో కలిసి నర్తించే
వానచినుకుల వయ్యారాలు
తాండవ హేలను తలపించే మెరుపులు
చినుకుల రాయబారమంపిన
గగనపు రాగలహరుల తడిసి
ఊయలూగే తరువుల విన్యాసాలు
నింగిని సాగే కారుమబ్బుల
బరువును దింపి కరువును బాపి
నేలకు పచ్చని బట్టలు తొడిగే వైనాలు
ఏకబిగిని కురిసే ధారలు
వేధించిన గ్రీష్మానికి
వర్షం పలికే వీడుకోలు
తొలకరిలో తడిసిన అవనికి
అణువణువూ పులకరింతలే
దివ్య సంగీతపు వాహినులే!
తడిసిన తూరుపు వీణను
సవరించి సాధన కొనసాగించి
అమృత తుల్య జీవనసంగీతం
అవధరింపచేసే అరుణోదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి