గోవా...;- ప్రమోద్ ఆవంచ.

 ఒక అందమైన దృశ్య కావ్యం.అక్కడి సముద్రం మరీ అద్బుతం. ఒడ్డున నిల్చుంటే ఎన్నో ఆలోచనల అలలు తీరాన్ని తాకేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.అంతా నిశ్శబ్దం ఒక్క అలల హోరు తప్ప..చెవులు వింటున్నాయి,కళ్ళు చూస్తున్నాయి,చూసే హృదయం స్పందిస్తుంది..స్పందించే హృదయం ఒక గులాబీ మొగ్గ లా విచ్చుకుంటుంది.కానీ మొగ్గ కింద ఉన్న ముల్లు చేసే గాయంతో....మనసును పలికే ప్రతి పదం కవిత్వం అవుతుంది...చెరిగిపోని జ్ఞాపకం అవుతుంది.తీర్చలేని వ్యధను మిగిలిస్తుంది. అవును గాయం నుంచే కవిత పుడుతుంది.ఆ గాయం కేవలం మనసుకు మాత్రమే పరిమితమైనది.ఎవరితోనో చెప్పుకుంటే తీరేది కాదు తనలో మదనపడి,తనలో తాను కోల్పోయి, బాహ్య ప్రపంచానికి అవసరం లేని తన బాధతో సహ జీవనం చేస్తూ,ఊహిస్తూ, ఊహలతో మాట్లాడుతూ, ఆకాశంలో విహరిస్తూ, నింగి నేలా రెండింటినీ ఒకటి చేస్తూ ఉంటే అకస్మాత్తుగా స్వప్నం చెదిరిపోతే మస్తిష్కం తనతో తాను కుస్తీలు పడుతుంటే 
కల తేలిపోయి,నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది.రోజు
ముగుస్తుంది.కొద్దిరోజులకు రోజులు మసకబడుతాయి.
రోజులు గడిచేకొద్దీ ఆ పాత మధురాలు జ్ఞాపకాలు అవుతాయి.జీవితం అంటే జ్ఞాపకాలతో బాధ పడడమేనా 
ఒంటరితనాన్ని అనుభవించడమేనా... ఒంటరిగా గత 
ఆనందాలను తలుచుకుంటూ ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదిస్తే అది పాజిటివ్ సైన్ అని అనుకోవాలా...ఏమో ఏమీ అర్ధం కాని స్థితి.
                   గోవా.... సముద్రం...కండోలిమ్ బీచ్ నేను  
మిత్రుడు సాహిర్ భారతిని అడిగా గోవాలో జనాలు తక్కువగా ఉండే బీచ్ ఏదో చెప్పమనీ,దానికతడు కండోలిమ్ బీచ్ పేరు చెప్పాడు సాహిర్ భారతి గోవాకు  సంబంధించినంత వరకు నాకు చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే గత ఏడేళ్ల నుంచి తన రిసార్ట్స్ లలో వేలాది 
మంది పర్యాటకులకు గోవా చారిత్రాత్మక స్థలాలను, అక్కడి బీచ్ లలో ప్రకృతి అందాలను, చూపిస్తూ, తాను,
జీవిస్తూ,పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు.
సాహిర్ భారతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.ఉద్యోగం చేసే 
ఉద్యేశ్యం లేక స్వంతంగా బిజినెస్ చేస్తూ పది మందిని 
ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చాలా వేగంగా కాలంతో 
పరుగెతున్నాడు.ఆ యువకుడికి చాలా గొప్ప గోల్స్ 
ఉన్నాయి.తాను వంద కోట్లకు చేరుకునేంత వరకు విశ్రమించేది లేదని,తన లక్ష్య సాధన దిశగా అహర్నిశలూ 
శ్రమిస్తున్నాడు.తన మాటలో స్పష్టత, తాను అనుకున్నది 
సాధించాలన్న తపన, పట్టుదల, కాలంతో పోరాటం చేసే 
ఆ కసి,ఆ ధైర్యం... తనలో నాకు కనిపించింది.
ఇంజనీరింగ్ చదవడం వల్ల తనకు లాజికల్ థింకింగ్ తో పాటు, భవిష్యత్తులో తాను చేసే పని మీద మంచి క్లారిటీ ఉన్నట్లు నాకు అనిపించింది.సాహిర్ ప్రముఖ కవులు యాకూబ్, శిలాలోలిత గార్ల రెండవ కుమారుడు.ఒక 
వారం క్రితమే సాహిర్ భారతి ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు....కట్ చేస్తే....
                          గోవా కండోలిమ్ బీచ్...జన సాంద్రత, సందోహం తక్కువగా ఉండే ప్రాంతం.నార్త్ గోవాలో దాదాపు ఆరు బీచ్ లు ఉన్నాయి.ఒక్క కండోలిమ్ బీచ్ 
తప్ప అన్నింట్లో విపరీతంగా రష్ ఉంటుందని సాహిర్ 
చెప్పాడు.ఆకాశం మేఘావృతమై ఉంది.నల్లని మబ్బులు 
కమ్ముకున్నాయి..కారు డ్రైవర్ ప్రతాప్ బీచ్ ఎంట్రెన్స్ దగ్గర 
దింపాడు.సొంతూరు గోవా అని చెపుతున్నాడు,కానీ కొంకణి భాష మాట్లాడడం లేదు.నార్త్ గోవాలో డిల్లీ, ముంబై, కర్నాటక ప్రాంతాల వాళ్ళు బిజినెస్ లలో ఎక్కువగా ఉన్నారు.ప్రతాప్ మరాఠీ, హిందీ బాగా మాట్లాడుతున్నాడు.గురువారం ఉదయం మోప లోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 
దిగినప్పటి నుంచి ప్రతాప్ చాలా బాగా రిసీవ్ చేసుకొని 
అర్పూరలో నేనుండే రిసార్ట్స్ తీసుకెళ్ళడమే కాకుండా 
మార్గ మధ్యలో ఒక ఉడిపి హోటల్ దగ్గర టిఫిన్ కోసం ఆపాడు.ఈ లోపల సాహిర్ నుంచి ప్రతాప్ కి ఫోన్లు వస్తూనే ఉన్నాయి.మోప నుంచి అర్పుర వరకు 
నలబై కిలోమీటర్ల దూరం.దారిలో పిలెర్నే,మపూస,నగోవా 
ఊర్లు కనిపించాయి.ఈ ఊర్లన్నీ నార్త్ గోవా లోని టూరిస్ట్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి.కొన్ని ఊర్లు బార్దేజ్ తాలూకా లో ఉన్నాయి.అక్కడి అధికార భాష కొంకణి.
కానీ నార్త్ గోవాలో చాలా వరకు హిందీ భాషనే మాట్లాడుతున్నారు.ప్రతాప్ అతి జాగ్రత్తగా, మెల్లగా డ్రైవింగ్ చేయడం వల్ల రిసార్ట్ కి ఒక గంట సమయం పట్టింది.రిసార్ట్స్ మేనేజర్ దిలీప్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి,ఫ్లాట్ కీస్ ఇచ్చాడు.అది ఒక సింగిల్ బెడ్రూం ఫ్లాట్.
ఒక బెడ్రూం, ఓపెన్ కిచెన్, హాల్,కిచెన్ లో వండుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
సాధారణంగా ఎవరూ అక్కడ వండుకోని తినరు.ఇక్కడ
కోడి కూయక ముందే లేవడం వల్ల ఒక గంట రెస్ట్ తీసుకొని
లంచ్ కోసం సాహిర్ చెప్పిన గోవన్ రెస్టారెంట్ కి వెళ్ళాను.
అక్కడ సీ ఫుడ్ ఫేమస్.వెజ్ కూడా దొరుకుతుంది.అక్కడ
భోజనం కానిచ్చేసి, నార్త్ గోవా ఫోర్ట్ కి వెళ్ళాను.ఆశ్చర్యం
అక్కడ అంతా తెలుగు వాళ్ళే.కరీంనగర్ నుంచి ఒక గ్యాంగ్ గా కొందరు వచ్చారు.వాళ్ళతో ఫోటోలు దిగడమే కాకుండా నేనూ కొన్ని ఫోటోలు దిగాను.ఫోర్ట్ వెనక వైపు 
కనుచూపు మేరలో పెద్ద సముద్రం అద్బుత దృశ్యం.
ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే ఫొర్ట్ మీద వున్న నాకు నాకూ రెక్కలు ఉంటే ఎంత బాగుండేదన్న 
ఆలోచన వచ్చింది.సముద్రం అలలు కోట గోడలకు తగులుతుంటే.... దాన్ని చూస్తుంటే ఎంత బాగుందో.
చూడడానికి రెండు కళ్లు చాలవు.జీవితమంతా ఆ అలలను చూస్తూ గడిపేయవచ్చు....
                        ...
                       
కామెంట్‌లు