సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా

 దీప కలికా న్యాయము
   ****
 దీప అనగా దివ్వె , వెలుగు ,కాంతి,జ్ఞానం,ఆశ,ప్రాణం. కలిక అనగా మొగ్గ అని అర్థము.
చిన్న దీపము చీకటినంతా  మ్రింగివేస్తుంది అన్నట్లు.
దీపం గురించి చెప్పుకోవాలంటే బోలెడు ఉపమానాలు,కథలు, ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి."గోరంత దీపం కొండంత వెలుగు"; "నీలో దీపం వెలిగించు - నీవే వెలుగై వ్యాపించు"; "చిదిమి దీపం పెట్టుకోవచ్చు";ఇంటికి  దీపం ఇల్లాలు", "గూట్లో దీపం -నోట్లో ముద్ద" లాంటివి ఎన్నో ఉన్నాయి.
 విరిసీ విరియని మొగ్గలాంటి చిరు దీపానికి కూడా  పోరాట పటిమ, ఎదిరించే శక్తి, గెలిచే సత్తా ఉన్నాయి అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "దీప కలికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే దీపాన్ని ఉత్సాహానికి ఊపిరి, చైతన్యానికి చిరునామా అంటారు.
మరి పనిలో పనిగా నాడూ నేడూ ఉపయోగించిన దీపాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామా...
పూర్వకాలంలో విద్యుత్ కనుక్కోక ముందు ఇళ్ళల్లో లాంతరు గాజు సీసాలో కిరసనాయిలు పోసి,ఆ సీసా మూతకు రంధ్రం చేసి‌ అందులో వత్తిని దూర్చి వెలిగించుకునేవారు.దానికి పైన ఎలాంటి రక్షణ ఉండేది కాదు.కొంచెం గాలి వచ్చినా ఆరిపోయేది.అందుకే దానిని గాలి రాని మూలల్లో పెట్టి ఉపయోగించుకునే వారు.
ఆ తర్వాత ఎక్కాబుడ్లు వచ్చాయి. కింద గుండ్రటి సీసాలకు గాజుతో చేసినవి అమర్చుకోవడానికి ఉండేవి. దీపం వెలిగేందుకు వీలుగానూ, ఆరిపోకుండానూ వుండేవి.ఇక ప్రతి ఇంట్లో నూనె దీపాలు వుండేవి.కుందులలో నూనె పోసి వెలిగించుకునేవారు. వీటిని ఇత్తడి,మట్టి,పింగాణి, గాజు లాంటి లోహాలతో  తయారుచేసేవారు.
ఇంకా పెట్రోమాక్స్ దీపాలు కూడా వుండేవి.చుట్టూ గుండ్రటి ఇనుప లోహంతో కిరసనాయిలు పోసుకునే గుండ్రటి కుండ ఆకారం.దానిలోపలికి గాలి కొట్టేందుకు వీలుగా ఓ పరికరం. దాని పైన గాజు పలకల అమర్చబడి ఫై నుండి కిందికి ఓ వత్తి లాంటిది మొగ్గ ఆకారంలో వుండేది దానిని  వెలిగించి , మధ్య మధ్య గాలి కొట్టే వారు.వీటిని పెళ్ళిళ్ళలో  రాత్రి పూట ఊరేగింపు సమయంలో కొందరు తలపై పెట్టుకొని మోస్తూ వెళ్ళేవారు.
విద్యుత్ దీపాలు వచ్చిన తర్వాత  వాటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది.ఇప్పటి తరానికి ఆ దీపం పేరు, రూపం వినుండరు.చూసుండరు. విద్యుత్ పోయిన సమయంలో కొవ్వొత్తి దీపాలను వెలిగించారు కోవడం మనందరికి తెలిసిందే.
ఇక దీపావళికి వెలిగించే దీపాలు, ఆకాశ దీపం, అఖండ దీపం మొదలైనవి ఆధ్యాత్మిక సాంప్రదాయ దీపాల గురించి మనకు తెలుసు.
ఏ దీపం వెలిగించినా చీకటిని తొలగించడానికే. దీపపు కాంతి లేని ఇల్లు - ఇల్లాలు లేని ఇంటిలో ఏ అవసరానికైనా తడుముకోవలసిందే.వీరుంటే అంతా వెలుగుల మయమే.
ఈ సందర్భంగా ఓ సుమతి శతక పద్యాన్ని చూద్దాం.
 "రారమ్మని పిలువని యా/భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే/ దీపంబు లేని ఇంటను/ చే పుణికిల్లాడి నట్లు సిద్ధము సుమతీ!"
అనగా రమ్మని, వెళ్ళమని నోరారా పలకరించని ప్రభువును అంటే యజమానిని సేవించడం వల్ల ఇహపర సౌఖ్యాలు,మోక్షము రెండూ కలుగవు.అదెలా దీపపు కాంతి లేని ఇంట్లో వస్తువు కోసం చేతితో తడుముకోవడం వంటిదని అర్థము.
మనమే ఓ దీపమైతే... చీకటి మన దరిదాపుల్లోకి కూడా రాదు.దేనికీ తడుముకోవడం వుండదు.మనసూ శరీరాలకు మనమే ప్రభువులం అవుతాం. ఇహ పర సౌఖ్యాలనూ, మోక్షాన్ని అలవోకగా పొందుతాం.
మరి మనం దీపం కావాలంటే మనల మనసనే ప్రమిదలో ఆత్మను వత్తిగా చేసి, జ్ఞానమనే చమురు పోసి చైతన్యమనే అగ్నితో వెలిగించుకోవాలి.అప్పుడే దీపమై జ్ఞానకాంతితో వెలిగి పోతాం. అరిషడ్వర్గాల గాలులు వీస్తూ దీపాన్ని ఆర్పివేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అహం అనే పెను గాలి వీస్తూ వుంటుంది.వాటిని నుండి ఎదుర్కునేందుకు స్థితప్రజ్ఞతను కాపలా పెట్టాలి.అప్పుడే మనలో దీపం నిశ్చలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న చీకటిని తరిమి కొడుతుంది.
 ఉదయమంతా వెలుగును పంచే సూర్యుడు రాత్రి పూట  లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆ ఆదిత్యునికి మొర పెట్టుకున్నారట.అప్పుడు తనలోని కాంతి అంశను ఓ చిన్న దీపంగా చేసి ఇచ్చాడట.అలా ఆ  చిన్ని దీపమే రేయంతా వెలుగుతూ చీకటిపై పోరాటం చేస్తోంది.
మరి అలాంటి దీపమే మనకు స్ఫూర్తి."దీప కలికా న్యాయము" ద్వారా మనం దీపాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.మనలో చైతన్యం,ప్రాణమనే కాంతి ఉన్నంత కాలం ఇతరులకు ఉపకారపు వెలుగును పంచాలి.ఈ న్యాయము లోని అంతరార్థం ఇదే.

కామెంట్‌లు