సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఆర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు -558
దీర్ఘ శష్కులీ భక్షణ న్యాయము
*****
 దీర్ఘ అనగా పొడవైన , లోతైన,దూరమైన.శష్కులీ అనగా నేతితో కాల్చబడిన గోధుమ రొట్టె, వెలుపలి చెవి అనే అర్థాలు ఉన్నాయి.
పెద్ద గోధుమ రొట్టెను ఒక మూల  మొదలుపెట్టి తినే వ్యక్తికి దాని ఆకారము,దీర్ఘత్వము,మెత్తదనము,గట్టిదనము,ఉప్పదనము,తీపి .. మొదలైన అనేక రుచుల,విషయముల జ్ఞానము ఒకే సారి కలుగుతుంది అది ఎలానో ఈ క్రింది శ్లోకం లో చూద్దాం.
"సుగంధిం శీతలాం దీర్ఘా మశ్నన్తఃపూప శష్కులీమ్, కపిల బ్రాహ్మణాస్సన్తి యుగపత్పంచ బుద్ధయః"
అనగా  ఒకే ఒక్క యౌగ పద్యము అనగా సమ కాలికత్వం,ఒకే సమయమందుండుట వలన అనేక రకాలుగా వస్తుజ్ఞానము కలుగునప్పుడు ఈ "దీర్ఘ శష్కులీ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఏదైనా ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించడం, అధ్యయనం చేసినప్పుడు తద్వారా అందులోని మంచి చెడులను గ్రహించగలగడం, చూడగలగడమనేది ఇందులో ఇమిడి ఉన్న భావం.ఇక్కడ మనం  తేలికగా అర్థం చేసుకునేందుకు ఓ గోధుమ రొట్టెను ఉదాహరణగా  తీసుకోవడం జరిగింది.
 మరి దీనినే భౌతిక సంబంధమైన విషయ దృష్టితో పరిశీలిస్తే మనం ఏర్పాటు చేసుకున్న ఆహారాన్ని గాని,ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గాని చేసే భోజనాన్ని గానీ భుజించేటప్పుడు  అందులో ఏమేమి రుచులకు సంబంధించిన పదార్థాలు ఉన్నాయో చూస్తాం.  మనకు తెలిసిపోతుంది.అలా వాటి మీద సమగ్రమైన అవగాహన కలుగుతుంది. అలాగే   మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు గాని, పరిచయం పెంచుకునేటప్పుడు గాని వారితో మన మనోభావాలు కలుస్తాయా లేదా నిశితంగా చూసిన తర్వాతే తదుపరి అడుగు వేస్తాం.అంటే వారికి సంబంధించిన సంపూర్ణమైన విషయాలు  మన మనసు తెలుసుకొంటుం.ఇదంతా భౌతిక సంబంధమైన పరిచయాలు,స్నేహాలకు వర్తిస్తుంది.ఆయా వ్యక్తుల పట్ల మనకంటూ  ఓ అవగాహన కోసం ఉపయోగపడుతుంది.
ఇక ఆధ్యాత్మిక దృష్టితో  చూస్తే అసలు ఆధ్యాత్మికత అనేది మనిషికి అవసరమా? కాదా? అనే ప్రశ్నలకు సమాధానమే మనమేంటో తెలుసుకునేలా చేస్తుంది.
 "దేహో దేవాలయో ప్రోక్తఃజీవోద్దేవో సనాతనః" అన్న శంకరాచార్యుల మాటలను లోతుగా అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేహంలోనే దేహి అయి వున్నాం.కనుక మనల్ని మనం తెలుసుకోవాలనీ.అదెలా సాధ్యమో వేమన పద్యం ద్వారా తెలుసుకుందాం.
 "లేడు లేడనినను లేడు లేనే లేడు/కాడు కాడటన్న గానె కాడు/ తోడు తోడటన్న తోడనే తోడగు/ విశ్వదాభిరామ వినురవేమ "
అనగా లేడు లేడు అంటే ఎవ్వరూ ఉండరు.కాడు కాడు ఎప్పుడూ ఏమీ కాలేడు.తోడు తోడు అంటే ఎవ్వరైనా, ఎవ్వరికైనా తోడు అయి తీరుతారు.కాబట్టి నకారాత్మక భావనలు ముందుగా మనం వదిలించుకోవాలి. సకారాత్మక భావనలతో  ప్రయత్నం చేస్తే అనేక రకాలైన జ్ఞానం, పరిజ్ఞానం,ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి  మనల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది.
 ఇదే "దీర్ఘ శష్కులీ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి,గ్రహించవలసిన జ్ఞానం.
ఎంతో సులువైన పద్ధతిలో తినే వాటితో పోల్చి మనల్ని మనం తెలుసుకునేలా చేయడం వెనుక ఉన్న మన పెద్దవాళ్ళ అవగాహనా చాతుర్యం,తపన ఎంత గొప్పదో కదా!

కామెంట్‌లు