నా జీవన నేస్తం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కోయిలల గానం
ఊరపిచ్చుకల అల్లరి 
మల్లె మాలతీలతలు
గన్నేరు బంతి చేమంతులు
పశువుల కొట్టాలు పిడుకలు కుప్పలు 
ధాన్యం రాసుల గలగలలు
ఆవు దూడల అంబారావాలు
బసవన్నల రంకెలు
వాగులు వంకలు
మోటబావుల్లో ఈదులాటలు
చెరువులో చేపల మిలమిలలు
కలువ తామరల కిలకిలలు
బండి ఇరుసు కిరకిరలు
గుడిగంటల గణగణలు 
సంతోషచంద్రశాల బడులు
వెన్నెల్లో ఆటపాటల కార్యక్రమాలు
భూతల్లికి పచ్చటిచీర చుట్టినట్లు 
జనాలకు భోజనాలందించే చేలు 
ప్రతి ఇల్లూ నందనవనమే!
ప్రతి ఇల్లాలు అన్నపూర్ణాదేవియే!
పండుగల వేళ
ప్రతి తల్లీ ఒక బతుకమ్మా
ప్రతిపిల్లా ఒక బొడ్డెమ్మా
నోములూ,వ్రతాలూ, పూజలూ, 
దానాలూ, ప్రార్థనలూ, నమాజులూ, 
అస్పై దూలాలూ, కోలాటాలూ, 
గంగిరెద్దులూ, భాగోతాలూ, 
హరికథలూ, పురాణలూ
అన్నీ అందరివీ! 
అందరికీ హడావుడే! 
స్వచ్ఛమైన మనసులున్న 
సుస్నిగ్ధపు నవ్వులున్న 
పల్లె అంతా నందగోకులమే! 
పల్లెలోని వాళ్ళంతా బంధువులే! 
తాతమ్మలు, తాతయ్యలు 
పెద్దమ్మలు, పెద్దయ్యలు 
అత్తమ్మలు, మామయ్యలు 
వదినెలూ, మరదళ్ళూ 
బావలూ,మరుదులూ
అన్నలూ, అక్కలూ
తమ్ములూ, చెళ్ళెళ్ళూ  
ఎవరేం చేసినా 
ఊరంతా ఒక్కటే!
పెళ్ళైనా,పేరంటమైనా
కష్టమైనా, సుఖమైనా 
సంతోషమైనా, విషాదమైనా
అందరూ కలిసే పంచుకుంటారు
అందరూ కలిసే అనుభవిస్తారు 
అందుకే
నాపల్లె ఒక జీవనది
ఆజీవన జ్ఞాపకం 
నా జీవన నేస్తం !!
**************************************

కామెంట్‌లు