న్యాయాలు-569
నటాంగనా న్యాయము
*****
నట అంటే నటుడు.నటన అంటే నాట్యము,నటన, కపటముగా ప్రవర్తించుట.నటాంగనా అంటే నటించే లేదా నటనము చేయు స్త్రీ లేదా స్త్రీ పాత్ర అనే అర్థాలు ఉన్నాయి.
పూర్వకాలంలో నాటకంలో ఆడ వేషం వేసిన వ్యక్తిని గానీ, నటించే స్త్రీ పాత్రను గానీ సహచరులందరూ ఆయా సందర్భాలలో ఎవరికి వారే తమకు చెందిన వ్యక్తిగానూ భావించేవారని, చిన్న చూపు చూసేవారని అర్థము .
ఈ నటాంగన గురించి తెలుసుకోవాలి అంటే నాటకానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేమిటో రేఖా మాత్రంగా చూద్దాం.
నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. జానపద కళలు విలసిల్లిన ఆ రోజుల్లో, రాజులు పరిపాలించే కాలంలో ప్రజల వినోదం కోసం కొన్ని కళలు ప్రదర్శింపబడేవి.అందులో అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకమే.ఈ నాటకం సంగీతం, పాటలు,నృత్యాలతో కూడుకుని చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటూ వుండేది.
నాటకంలో సూత్రధారుడే ఆయువు పట్టుగా ఉండే వాడు. నాటక ప్రదర్శనలోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకుంటూ రంగప్రవేశం చేసేవి.
పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నాటక ప్రక్రియను మొదట్లో చిందు భాగవతం, యక్షగాన నాటకం, వీధి భాగవతం,బయలాట అని పిలిచేవారు.వీధి నాటకాలుగా ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారిలో కూచిపూడి, భాగవతులు ముఖ్యులని చరిత్ర కారులు అంటారు.
నాటకం యొక్క గొప్పతనం గురించి చెబుతూ మహా కవి కాళిదాసు "నాటకాంతం హి సాహిత్యం ","నాటకం రసాత్మకం కావ్యం" అన్నాడు. అందుకే "కావ్యేషు నాటకం రమ్యం- తత్ర రమ్య శకుంతలా తత్రాపి చతుర్థోంకః,తత్ర శ్లోక చతుష్టయం" అనగా కావ్యాలలో నాటకం రమ్యమైనది.అందులో కాళిదాసు రచించిన 'శాకుంతలం 'అతి రమ్యమైనది.అందులోనూ,ఆ నాటకంలోని నాల్గవ అంకంలోని నాలుగు శ్లోకాలు అన్నింటి కంటే మిన్న" అని పేరు ఉండేది.
అయితే ఈ నాటకాల ప్రదర్శనల్లో ప్రారంభంలో స్త్రీ పాత్రలను పురుషులే ధరించేవారు.ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ గారు చేసిన సంస్కరణల వల్ల స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించడం అనేది మొదలైంది.ఇది నాటకరంగంలోనే అతి ముఖ్యమైన మార్పుగా చెప్పుకోవచ్చు.
మరి నాటకాల్లో చేరిన స్త్రీలు తెర ముందు ఎంతగా ప్రేక్షకుల మెప్పు పొందినా తెర వెనుక జీవితం మాత్రం దుర్భరంగానే ఉండేదట. కారణం తమను కేవలం ఆట బొమ్మలుగా చూడటం .వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే వారు కాదని ఆనాటి మహిళా కళాకారులు వాపోయేవారు.నాటక రంగంలో మొదట్లో చేరిన మహిళల చరిత్రలు చదువుతుంటే ఇలాంటివెన్నో తెలిసి ఎవరికైనా ఎంతో బాధ కలుగుతుంది.
అందుకేనేమో ఆ రోజుల్లో స్త్రీలు నాటకాల్లోకి రావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.వారి కుటుంబాలూ ఒప్పుకునేవి కాదు. మరో కారణం కూడా ఏమిటంటే నటనాంగనలను వారి సంస్థలో ఉన్న వారిలోనే కొందరూ మరియు బయటి వారు కూడా వారిని చిన్న చూపుతో తక్కువగా చూసేవారు.అందువల్లనే ఈ "నటనాంగనా న్యాయము "వచ్చి వుండవచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమా రంగంలోని స్త్రీల పట్ల కూడా చులకన భావం ఉండటం గమనించవచ్చు. అందుకే పెద్దవాళ్ళు ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయమును ప్రస్తావించి వుంటారేమో...
ఆ తర్వాత తర్వాత వారి నటనా ప్రతిభ, నిబద్ధత, వ్యక్తిత్వంతో అలాంటి అపవాదులను పటాపంచలు చేస్తూ ఎందరో మహిళా కళాకారులు,నటీమణులు నాటక,సినీ రంగాల్లో తమదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారన్నది మనందరికీ తెలిసిందే.
అయితే ఆధ్యాత్మిక వాదులు మాత్రం ఈ న్యాయమును తమదైన రీతిలో చక్కని ఉదాహరణల ద్వారా విశ్లేషించారు.ఆకాశంలో చందమామ మనవంకే చూస్తున్నట్లు, మన వెంటే నడుస్తున్నట్లు కనిపిస్తుంది.అలాగే ఆకాశంలో విమానం వెళ్తుంటే మన తలమీద నుండే వెళ్తున్నట్లు అనిపిస్తుంది.ఇలా వీటిలో భగవంతుని దర్శిస్తే ఆ భగవంతుడు మన వెంటే వస్తున్నట్లుగా మనకు తోడుగా ఉన్నట్లు వుంటుంది కదా!అని చెబుతూ.అలా "నటాంగా న్యాయము"ను పరమాత్మకు మనకూ అన్వయించుకొని మన స్వంతంగా భావించాలి.అప్పుడే ఆత్మానందం కలుగుతుంది అంటారు.
ఈ న్యాయము ద్వారా మనం ఆనాటి సమాజంలో నాటక,సినీ రంగాల్లో స్త్రీ కళాకారుల పట్ల చిన్నచూపునూ, ఆధ్యాత్మిక దృష్టిలో దైవత్వ రూపునూ తెలుసుకోగలిగాం.మరి మన కర్తవ్యంగా మహిళా కళాకారులలోని ప్రతిభను గుర్తించి గౌరవిద్దాం.దైవత్వాన్ని హృదయంతో ఆస్వాదిద్దాం.అంతే కదండీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి