న్యాయాలు -574
నర్తక న్యాయము
****
నర్తక అనగా నట్టువుడు,నట్టువుల గురువు, నెమలి, ఏనుగు,నటనం,ఆట అనే అర్థాలు ఉన్నాయి.
నాట్యం, నర్తనం చేసే వ్యక్తి ఒక్కడే/ లేదా ఒక్కతే అనేక మందికి ఆనందాన్ని ఇస్తాడు/ ఇస్తుంది అని అర్థము.
నాట్యం చేసే మనిషికి,మనసుకే కాదు చూసే ఎదుటివారికి ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.మరి అలాంటి నాట్యం అనే కళ ఎంత గొప్పదో దీనిని సంబంధించిన వివరాలు విశేషాలు తెలుసుకుందామా...
భారతీయ చతుష్షష్టి (64)కళలలో నాట్యం అనేది ఒక అద్భుతమైన కళగా పేరు పొందింది. దీనిని లలిత కళలలో ఒకటిగా దైవదత్తమైన కళగా చెబుతుంటారు. ఇందులో నృత్యము మరియు అభినయము అంతర్భాగములుగా ఉంటాయి.అవే కాకుండా ఆంగికం,వాచికం, ఆహార్యం మరియు సాత్వికం అనే నాలుగు ఉపాంగాలు నాట్యానికి ప్రాణం లాంటివి.అంతే కాదు నాట్యంలో జ్ఞానం,శిల్పం, విద్య,కళ ,యోగం,కర్మ వంటివి మిళితమై ఉంటాయి.అలాంటి నాట్యానికి నాలుగు వేదాల సరసన నిలువగల పంచమ వేదసారంగా పండితులు నాట్యకారులు భావిస్తారు.
ఈ నాట్య కళకు భరతమునిని ఆద్యుడని అంటారు.ఈ నాట్యానికి సంబంధించి ఋగ్వేదం నుండి పాఠ్యాన్ని, యజుర్వేదము నుండి అభినయాన్ని, సామవేదము నుండి సంగీతాన్ని, అధర్వణ వేదము నుండి రసాన్ని గ్రహించి నాట్యవేదాన్ని సృష్టించారని పెద్దలు చెబుతుంటారు.అంత గొప్పదైన నాట్యాన్ని దైవంగా భావించి,అందులో దైవాన్ని దర్శించే వాళ్ళు, దైవ సన్నిధిలో ప్రదర్శించే వారు ఎందరో ఉన్నారు.
ఈ నాట్యకళ యొక్క మూలాలు జానపద నృత్యంలో ఉన్నాయనీ,ఎందుకంటే శ్రమించే జానపదుల శరీర అవయవాల కదలిక నుంచే ఈ నాట్యం ఉద్భవించిందని అంటుంటారు .
అలాంటి నాట్యానికి సంబంధించిన వివిధ భంగిమలను పురాతన కాలంలో సుమారుగా పదివేల సంవత్సరాల క్రితమే గుహల్లో చిత్రించబడిన లేదా చెక్కబడిన శిల్పాలలో చూడవచ్చు.
లయబద్ధమైన సంగీతానికి పారవశ్యం కలిగినప్పుడు లేదా పరవశించినప్పుడు దేహంలో అనుకోకుండా లయబద్ధంగా ఏర్పడే కదలికలనే నాట్యమని చెప్పవచ్చు.ఈ నాట్యం వల్ల చక్కని దేహ నిర్మాణం ఏర్పడుతుంది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందుతాయి .
ఇక నాట్య కళకు అంకితమైన వారిలో నాట్యం చేసే వ్యక్తి ఆడైనా,మగైనా నాట్యాన్ని ఓ తపస్సులా భావిస్తూ వుంటారు .అందులో తాము తన్మయులై పోతూనే ఆ తన్మయత్వ ఫలాలను పలువురికి అందిస్తారు.అంటే నాట్యం చేసేవారిని చూసిన హృదయాలు కూడా తన్మయత్వం, పారవశ్యంలో మునిగి పోతాయన్న మాట.ఏదైనా అంశానికి సంబంధించిన హావభావాలను కళ్ళతో ఒలికిస్తూ,దేహభంగిమలతో చూపిస్తూ చేసే నాట్యం, నృత్య రూపకాలు ప్రేక్షకుల హృదయాలను ఆనంద తాండవం చేయిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అయితే నాట్యం చేసే వారు ముందుగా నటరాజును పూజిస్తారు.నటరాజు అంటే ఎవరో కాదు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి.అలాంటి పరమ శివుడికి పరమానంద స్వరూపుడనీ, నాట్యం పరమానందానికి సూచిక అనీ, ప్రాణికోటికి పరమానందం అందించడమే నాట్యం యొక్క గొప్పతనమని అంటుంటారు.అందుకే నృత్యం చేస్తున్న భంగిమలో పరమేశ్వరుడు మనకు కనిపిస్తాడు.
"నర్తక న్యాయము"లో ఇమిడి ఉన్న అంతరార్థం ఇదే. ఒక "దీపం వెలుగుతూ మరిన్ని దీపాలను వెలిగించగలదు" అన్నట్లు తనను తాను దీపంలా చేసుకుని నాట్య కళా వెలుగులతో చూపరులలో ఆత్మానందమనే మనో దీపాలను వెలిగిస్తారు.
అలాంటి దైవ కళను ప్రదర్శించే నర్తకులలో ఎందరో ప్రముఖులు మన దేశంలో ఉండటం మనకెంతో గర్వ కారణము.వారు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తూ తమ జీవితాలను నాట్యానికే అంకితం చేసి జన్మ ధన్యం చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఈ న్యాయము ద్వారా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం.అలాగే ఆరోగ్యం,ఆనందం ఏకాగ్రత కోసం అనేక రకాల ఒత్తిడులు ఉన్న ఈ సమాజంలో ప్రశాంతంగా బతకడం కోసం మన పిల్లలకు ఇష్టమైతే/ఇష్టమైన ఈ నాట్య కళను నేర్పిద్దాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి