సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా.
 న్యాయాలు -577
నాసిప్రోతోష్ట్ర న్యాయము
*****
నాసి లేదా నసీ అనగా ముక్కు.ప్రోతము అనగా కుట్టబడిన, కట్టబడిన గుడ్డ ముక్కలతో, వస్త్రముతో తయారు చేసిన తీగ లాంటి తాడు ఉష్ట్రము అనగా  ఒంటె అని అర్థము.
ఒంటెకు ముకుతాడు వేసి లోబరచుకోవడమని లేదా ముకుతాడు వేసిన ఒంటె వలె అని అర్థము.
 
 అసలు ముకుతాడు ఎందుకు వేస్తారు? దాని వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఒక్క సారి నిశితంగా పరిశీలిస్తే...
ముకుతాడు ముఖ్యంగా స్వారీ చేసే లేదా అవసరానికి ఉపయోగించుకునే జంతువులలో ఎద్దులు , గుర్రాలు, ఒంటెలు మొదలైన వాటికి  వేస్తుంటారు. ఎందుకంటే మచ్చిక చేసుకొని వాటితో పనులు చేయించుకోవడానికి. అలా  వేసిన ముకుతాడు వల్ల వాటి పొగరు, ఆవేశం తగ్గిపోతుంది.యజమాని చెప్పినట్లు వింటాయి.ఆ విధంగా  వాటి ఉపయోగించుకునే యాజమానికి మేలు జరుగుతుందన్న మాట.
ఒకప్పుడు గంగిరెద్దుల వాళ్ళు  వాటికి వివిధ రకాల ఆటలు నేర్పించి ఇంటింటికీ తిరిగి వాటితో ప్రదర్శింపజేసే వారు. అది చూసి తృణమో ఫణమో ఇస్తే దానితో జీవనం సాగించేవారు.
అలా వాటికి తర్ఫీదు ఇవ్వడానికి కోడె గిత్తలను తీసుకుని వచ్చి వాటిని గట్టిగా పట్టుకొని వాటి పొగరు అణిగే విధంగా ముక్కులోపల పొడిచి రెండు వైపులా తాడును రంధ్రం నుండి పైకి లాగేవారు. దానికి తాడు తగిలించే వారు.అలా ముక్కు సున్నితమైన ప్రదేశం కాబట్టి  తాడు లాగినప్పుడు నొప్పి వుంటుంది కాబట్టి తన యజమానికి లొంగిపోయి చెప్పినట్లు వినేది. అలా దానిని మచ్చిక చేసుకొని ఆటలు నేర్పేవారు.
 మరి ఒంటెకు ఎందుకు వేస్తారో ఈ పాటికి తెలిసిపోయింది కదా! ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఎడారిలోని ఇసుకలో ఎంత దూరమైనా అలుపు లేకుండా ప్రయాణం చేస్తుంది."ఇందుగలడందు లేడను సందేహము వలదు"  అన్నట్లు మనిషి ఎలాంటి కష్టతరమైన వాతావరణంలోనూ జీవించేందుకు ప్రయత్నం చేయడం అనాదిగా చూస్తూనే ఉన్నాం.ఒంటెను మచ్చిక చేసుకుంటేనే ఎడారిలో ఎక్కడికైనా సునాయాసంగా ప్రయాణం చేయగలడు. కాబట్టి ఒంటెను మచ్చిక చేసుకోవడం కోసం దానికి  ముకుతాడు వేస్తారన్న మాట.
ఈ విధంగా మనిషి అనాదిగా తన ఆహారం,రక్షణ,రవాణా కోసం వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.
"నాసీ ప్రోతోష్ట్ర న్యాయము"లో  ముకుతాడు అనే పదం కేవలం జంతువులను ఉద్దేశించి చెప్పినది మాత్రమే కాదు. సమాజములో అనేక వివక్షతలకూ, వైరుధ్యాలకూ, వైషమ్యాలకు, మనిషిలోని  బలహీనతలకు ముకుతాడు వేసి సమస్యను అదుపులో పెట్టుకోవాలనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది.
 సమాజం సంగతి అటుంచితే మనిషిలోనే అహము, పొగరు, లెక్కచేయనితనము లాంటి అరిషడ్వర్గాలు ఉన్నాయి. అవన్నీ వ్యక్తిని సరిగా ఉండనీయవు.సమాజంలో గౌరవంగా బతకనీయవు. ఇవన్నీ  దుర్గుణాలే.మనిషిని అధఃపాతాళానికి తోసేవే.కాబట్టి వాటికి నిగ్రహం,నీతీ నిజాయితీ, మానవత్వం లాంటివి  కలిపి తాడులా పేనాలి. అలా పేనిన తాడుతో మనసుకు ముకుతాడు వేస్తే నియంత్రణలో వుండి మంచికి మచ్చిక అవుతుంది. తనకే కాకుండా సమాజానికి మేలు జరుగుతుంది.ఆ తర్వాత సమాజంలో బాధ్యత గలిగిన పౌరుడిగా పైన చెప్పిన వాటికి ముకుతాడు వేసేందుకు ప్రయత్నం చేయాలి.
ఇదండీ! "నసీప్రోతోష్ట్ర న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.

కామెంట్‌లు