సమస్యల లంచం!;- - బోగా పురుషోత్తం, తుంబూరు, నారాయణవనం మండలం , తిరుపతి జిల్లా

 పూర్వం కళింగ రాజ్యాన్ని కళావతి పరిపాలించేది.  ప్రజా రంజక పాలన అందించడంలో ఆమెది అందెవేసిన చేయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు  పరిష్కరించి  ప్రజారంజకంగా పాలించేవారు.
 ఓ సారి తన రాజ్యంలో లంచగొండితనం పెరిగిపోయి జలగల్లా పీడించింది.
 మంత్రిని పిలిచి ‘‘లంచాలపై నిఘా వుంచి చర్యలు తీసుకో..’’ అని ఆజ్ఞాపించింది రాణి. రాజు ఎంత ప్రయత్నించినా లంచగొండి తనం అదుపులోకి రాలేదు. ఎంత నిఘా వేసినా లంచం తీసుకుంటున్న వారిని కనుక్కోలేకపోయారు. శత విధాలా  ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. విసిగిపోయిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి రాణి వద్దకు బారులు తీరారు. ఇక చేసేదేమీ లేక కళావతి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్‌ ఏర్పాటు చేసింది.
 ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం  ఎనిమిది గంటలు వరకు ప్రజలు చెప్పే సమస్యలు ఆలకించింది.  అయినా జన వాహిని తగ్గలేదు.  అప్పటికే కళావతికి నిద్రముంచుకొచ్చింది.  ఇక ఓపిక నశించి కూర్చున్న చోటే నిద్రపోయింది.
  ఇది చూసిన జనం ‘‘ ఏమాత్రం బాధ్యత లేని రాణి..!’’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన కళావతి ప్రజలందరినీ ‘‘మరుసటి రోజు రండి..’’ అని వెళ్లగొట్టింది.
   ప్రజలు రాణి మాటలు లెక్కచేయలేదు. ఆ రాత్రి ఇళ్లకు వెళ్లలేదు. ప్రజా దర్బారులోనే పడుకునేందుకు సిద్ధమయ్యారు.
  కళావతి అది చూసి ‘‘ వెళ్లండి.. ఇళ్లకు వెళ్లి ఉదయం రండి.. మీ సమస్యలు సావధానంగా వింటాను..’’ అని హుంకరించింది.
  ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ‘‘  రాణిగారూ.. మేము ప్రతి పనికి లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.. లంచాలు ఇచ్చుకోలేక సతమతమవుతున్నాం..ఆఖరికి మీ వద్ద సమస్యలు చెప్పుకోవడానికి కూడా పరిపాలనా భవనం లోకి ప్రవేశించడానికి  భటులు ఒక్కొక్కరి వద్ద పాతిక వరహాలు లంచం తీసుకున్నారు.  వెనక్కి వెళ్లి రేపు వస్తే మళ్లీ లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది.  మా వద్ద అంత ఆర్థిక స్థోమత లేదు.. మా సమస్యలు వినే వరకు ఇక్కడి నుండి కదలం..’’ అని చెప్పడంతో కళావతి విస్తుపోయింది.
     మంత్రి సోమన్నను పిలిచింది. ‘‘ ఏమయ్యా..!లంచం సమస్య ఎక్కడెక్కడ వుందో తెలుసుకోమని ఆదేశిస్తే ఒక్కరినీ పట్టుకోలేకపోయావు.. అసలు ఇప్పుడు లంచం సమస్యను చెప్పుకోవడానికే లంచం అడిగి పీడిస్తున్నారు.. సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థమయిందా? వెంటనే లంచం అడిగిన రాజ భటులను తీసుకురండి..’’ అని ఆజ్ఞాపించింది.
   మంత్రి క్షణాల్లో రాజ భటులను రాణి ముందు ఉంచాడు.  వెంటనే వారి నుంచి లంచం డబ్బులు తీసుకుని ఎవరిది వారికి ఇచ్చివేసింది. రాజ భటులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత ఆ రాత్రంతా మేల్కొని ప్రజా సమస్యలు ఆలకించింది. రేయింబవళ్లు మేల్కొని మారు వేషంలో రాజ్యమంతా తిరిగి లంచాల పీడను తొలగించింది. అవినీతి పరులను విధుల్లోంచి తొలగించి మంత్రి సాయంతో అవినీతిని రూపుమాపి ప్రజా రంజకంగా
పాలించింది.
  కళావతి తీసుకున్న కఠిన నిర్ణయాలతో రాజోద్యోగులు నిజాయతీగా పనిచేశారు. ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు.
 

కామెంట్‌లు