జీవన్ముక్తి;-సి.హెచ్.ప్రతాప్

 ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసినపని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. చేయడం వలన ప్రయోజనం కానీ, చేయక పోవడం వలన నష్టం కానీ ఏమీ ఉండవు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు.బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ, ప్రారబ్దకర్మవశాన లోకనుసారంగా వర్తిస్తూ అసంగుడై ఉండటం.నిజానికి కర్మపాశవిముక్తి అయితేనే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. అప్పుడు కర్మలు, కర్మ ఫలితాలు పోతాయేగాని, ప్రారబ్దం వల్ల వచ్చిన జీవితంఅంతమవదు. దానిని పూర్తిగా అనుభవించవలసినదే! కాబట్టి అది పూర్తి అయ్యేవరకు ఈప్రపంచంలోనే వుంటూ, దీనిపట్ల అసంగుడై, దీన్ని అంటుకోకుండా వుంటారు. వారు నిజంగాముక్తులే. కాని ఆప్రక్రియ దేహానంతరంకలుగుతుంది. అంతవరకూ వారు వేచి యుండాల్సిందే! దానినే జీవన్ముక్త దశ అంటారు.ఈ దస సాధకుని జీవితంలో అత్యుత్తమ దశగా చెప్పబడింది.
సహజంగా, సరళంగా, సంతోషంగా గడప వలసిన విలువైన జీవితాన్ని మనిషి సంకటమయం చేసుకుంటున్నాడు. అల్పజ్ఞానంతో, అజ్ఞానంతో, అహంకారంతో, పక్షపాతంతో, ద్వేషంతో, అన్నీ కలిసిన వక్రాభిప్రాయాలతో పతనం అవుతున్నాడు.కాబట్టి బ్ హగవంతుని బాటయే ఆదర్శంగా సాధన ప్రారంభించాలి. జీవితమూ, ప్రపంచమూ అంతా ఈశ్వరమయంగానే అనుభూతికొస్తుంది. అనుకూలతపట్ల కృతజ్ఞత, ప్రతికూలతపట్ల అచంచలమైన నిర్ద్వేష ధర్మనిష్ఠ కలుగుతాయి. జీవితం వ్యక్తి గతంగాకాక, లోకహితగతమైన బాధ్యతగా సాగుతుంది.కర్మఫలాలను అంటుకోకుండా, జీవన్ముక్తికి ప్రయత్నించడమే యోగం. చిత్తవృత్తులను నిరోధించడమే ‘యోగం’ అంటారు పతంజలి మహర్షి.ఎన్నాళ్లు భౌతిక సంపదకు సమీపంలో ఉన్నా ముక్తి లభించదు. కేవలం పరమేశ్వరుడికి సమీపంలో ఉండటం (ఉపాసన) వల్లే భవబంధాల నుంచి విముక్తి పొందగలుగుతాం.

కామెంట్‌లు