విజయ స్థూపం;- - యామిజాల జగదీశ్
 విజయ స్థూపం...
ఇది రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఉంది. దీనినే విక్టరీ టవర్ అంటారు.
ఇందుకు సంబంధించిన ఆసక్తికర అంశాలున్నాయి.
ఈ విజయ స్థూపాన్ని 1448 ప్రాంతంలో మేవార్ రాజు రాణా కుంభ నిర్మించారు. తొమ్మది అంతస్తుల ఈ స్తంభం ఎత్తు 122 అడుగులు. ఈ స్తంభం పైభాగానికి చేరుకోవడానికి 157 మెట్లు ఉన్నాయి.
ఈ విజయ్ స్తంభ్ వాస్తుశిల్పి రావ్ జైతా. ఇక్కడి ఐదవ అంతస్తులో ఆయన పేరుతోపాటు ఆయనకు సహకరించిన ముగ్గురు కొడుకుల పేర్లు చెక్కారు. 
పై అంతస్తులో జైన దేవత, పద్మావతి విగ్రహాలున్నాయి..
ఈ స్తంభాన్ని విష్ణుమూర్తికి అంకితం చేశారు. అర్ధనారేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ, బ్రహ్మ తాలూకు వివిధ రూపాలు, రామాయణం, మహాభారతంలోని కొన్ని ప్రధాన పాత్రల శిల్పాలను ఈ విజయ స్తంభంలో పొందుపరిచారు. 
నగరంలోని ఏ ప్రాంతం నుంచి చూసినా ఈ విజయస్థూపం కనిపిస్తుంది. కనుక ఈ స్థూపం నుంచి నగరంలోని ఏప్రాంతాన్నైనా చూడవచ్చు. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న కోటలకు దీర్ఘ చరిత్ర ఉంది. నిజానికి రాజస్థాన్‌లో అనేక స్మారక చిహ్నాలు ఉన్నప్పటికీ ఈ విజయస్థూపానికి ఉన్న ప్రత్యేకతే వేరు.
ఇక చిత్తోర్‌గఢ్ కోట రాజపుత్రుల శౌర్యానికీ అంతస్తుకీ చిహ్నం. 
అలాగే ఇక్కడి సమాధీశ్వర్ ఆలయం శివాలయంగా ప్రసిద్ధి. ఈ ఆలయం చిత్తోర్ కోటలో, గౌముఖ తీర్థస్థల వద్ద, గౌముఖ్ కుండ్ రిజర్వాయర్ ఉత్తర ఒడ్డున ఉంది. ఇది అనేక శిల్పకళా శైలులను కలిగి ఉంది.
ఇక జైనమతాన్ని కీర్తించేందుకు రావల్ కుమార్ సింగ్ పాలనలో ఓ జైన వ్యాపారి  22 మీటర్ల ఎత్తైన టవర్‌ని నిర్మించారు.

కామెంట్‌లు