న్యాయాలు -563
దేవర న్యాయము
*****
దేవర అంటే ధర్మగ్రంథం ప్రకారం సృష్టిని సృష్టించి తన అదుపాజ్ఞలలో పెట్టుకునే వాడు, సృష్టికర్త,భర్త యొక్క తోబుట్టువు, ఒకరి బావ అంటే భర్త లేదా భార్య సోదరుడు అనే అర్థాలు ఉన్నాయి.
"దేవర న్యాయము" మరియు "దేవర ధర్మము" రెండు రకాల అర్థాలతో కూడిన వాక్యమిది.
ముందుగా దేవర న్యాయము అంటే ఏమిటో చూద్దాం.
ప్రస్తుత కాలంలో ఈ "దేవర న్యాయము"గురించి వినడానికి కొంత యిబ్బందిగానే వుంటుంది. ఎందుకంటే వంశాన్ని నిలుపుకోవడం కోసం పిల్లలు లేని దంపతుల్లో భార్యను వరుసైన వ్యక్తి ద్వారా సంతానం కనేందుకు అనుమతి ఇవ్వడం. ఈ న్యాయం మహాభారతంలో కనిపిస్తుంది.దీని గురించిన వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం.
మహాభారతంలో శంతనుడి భార్య పేరు సత్యవతి.ఆమె దాశరాజు అనే పల్లె పెద్ద కుమార్తె. ఆమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు.ఆమె కన్యగా ఉన్నప్పుడు పరాశరుడు అనే మహాముని ద్వారా జన్మించిన కొడుకు వ్యాసుడు.ఇతడిని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు.
ఆ తర్వాత ఆమె హస్తినాపురానికి రాజైన శంతన మహారాజును వివాహం చేసుకుంటుంది.ఈ సందర్భంలో సత్యవతి తండ్రి దాశరాజు తన కుమార్తె సంతతికి రాజ్యాధికారం ఇచ్చేటట్లయితేనే వివాహం చేస్తానని అంటాడు.శంతనుడికి అంతకు ముందు గంగాదేవి వలన కలిగిన భీష్ముడు అనే కుమారుడు ఉంటాడు. విషయం తెలుసుకున్న భీష్ముడు తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి సత్యవతి,శంతనుల వివాహం జరిపిస్తాడు.
వీరికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే కుమారులు కలగడం కాలాంతరంలో చిత్రాంగదుడు యుద్ధంలో మరణించడంతో విచిత్ర వీర్యుడిని రాజును చేస్తాడు.ఇతని భార్యల పేర్లు అంబిక, అంబాలిక. వీరికి సంతానం లేని కారణంగా వంశ పరిరక్షణకు వేరే మార్గం లేదని బాధ పడిన సత్యవతి భీష్ముడిని రాజుగా పట్టాభిషేకం చేసుకొమ్మని కోరితే భీష్ముడు నిరాకరిస్తాడు.
ఆ తరువాత "దేవర న్యాయము "ప్రకారం ఉత్తములైన వ్యక్తులతో వారిని కలిపి తద్వారా పొందిన సంతానంతో వంశాన్ని కాపాడుకోవచ్చని సత్యవతితో చెబుతాడు.ఆ సమయంలో తనకు కన్యగా ఉన్నప్పుడు జన్మించిన వ్యాసుడి గురించిన పూర్వ వృత్తాంతం చెబుతుంది.వ్యాసుడు.సమస్త ధర్మాలు తెలిసిన వాడు, వేదవేదాంగ పారంగతుడు,మహా తపశ్శాలి నీ తమ్ములకు సంతానాన్ని ప్రసాదించగలడు అని చెప్పి వ్యాసుని స్మరిస్తుంది .అలా వ్యాసుడి వలన అంబికకు దృతరాష్ట్రుడు,అంబాలికకు పాండురాజు జన్మిస్తారు.దేవర న్యాయము అంటే ఇదే.భర్త చనిపోతే భార్య అతని సోదరుడిని వివాహం చేసుకోవడం అనేది ఇప్పటికీ కొన్ని గిరిజన సమూహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఓ సీరియల్ కూడా టీవీ చానెల్ లో రావడం జరిగింది.
ఇక దేవర ధర్మము అంటే ఏమిటో చూద్దామా...
దేవర అంటే దేవుడు లేదా దేవత. దేవర ధర్మము అంటే దేవతలను భక్తితో పూజించే ధర్మము.కన్నడ ప్రజలు తమ గ్రామాలు, ప్రజలను రక్షించడానికి గ్రామ దేవతలను ఆరాధిస్తారు.వారి యొక్క శక్తిని నమ్ముతారు.వారికి అన్నం,పానకం మొదలైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత మేళాలు తాళాలు,రాగాలతో ఆనందంగా గడుపుతారు.
ఈ నమ్మకం కేవలం కన్నడ ప్రాంతంలోనే కాదు. భారత దేశంలోని ఎంతో మంది ప్రజల్లో కూడా ఉంది. ఈ చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృ దేవత అని నమ్ముతూ గ్రామ దేవతలుగా ఊరి పొలిమేరల్లో నిలిపి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ,, అంకాలమ్మ, సత్తెమ్మ,కట్ట మైసమ్మ..ఇలా గ్రామ దేవతలను పూజించే సంస్కృతినే దేవర ధర్మము అంటారు ఈ ధర్మము ముఖ్యంగా మాతృస్వామిక వ్యవస్థకు సంబంధించిన ధర్మంగా చెప్పుకోవచ్చు.
ఇవండీ! దేవర న్యాయము మరియు దేవర ధర్మము లోని విశేషాలు,విషయాలు. ఇవన్నీ నమ్మకాలు,విశ్వాసాల పునాదులపై ఏర్పడ్డాయి.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆనాటి సమాజంలో సంతానం లేని దంపతులను చిన్న చూపు చూస్తారనే భయంతో రకరకాల మార్గాల్లో సంతానం పొందే వారు.ఇందులో ముఖ్యంగా స్త్రిలే బాధితులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి ఇష్టమున్నా లేకున్నా కుటుంబ పెద్దల అంగీకారంతో సంతానం పొందడం జరిగేది. ఇది ఈనాటి సమాజానికి ఎట్టి పరిస్థితుల్లోను ఆమోద యోగ్యం కాదు. కాకపోతే ఇప్పుడు సరోగసి పేరుతోనో ,ఐవిఎఫ్ ద్వారానో సంతానం పొందడం చూస్తున్నాం.
మొత్తానికి "దేవర న్యాయము" ద్వారా భారతీయ సంస్కృతిలోని నాటి, నేటి విషయాలు తెలుసుకోగలిగాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి