గురు పూర్ణిమ వైశిష్ట్యం;-సి.హెచ్.ప్రతాప్
 శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే|
స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్||
అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం అని మన వేదాలలో చెప్పబడింది.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.   గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అఙ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు.   ‘గు కారో అంధకారస్య , రు కారో తన్నిరోధకః’ అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు. గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్సమానుడు.  మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితే గురువుని దర్శించి సేవ చేసి, ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి.
సనాతనధర్మానుయాయులైన ప్రతియొక్కరికి అత్యంత పవిత్రమైన రోజు ఆషాడ పూర్ణిమ . దీనినే మనం వ్యాస పూర్ణిమ , గురు పూర్ణిమ అని అంటాము . వ్యాసభగవానుడి పేరు మీద ఆషాడ శుక్ల పూర్ణిమకి వ్యాస పూజ అని పేరు . సత్యము చెప్పాలంటే అసలు దాని పేరు వ్యాస పూర్ణిమ. అది రూపాంతరం చెంది గురు పూర్ణిమ అన్నారు .
గురువుకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు.
గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు. వ్యాసపూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి భక్తితో పూజించాలి.గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించండి. వారిని గౌరవించండి. పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి.. తగిన బహుమతులు ఇవ్వండి. గురువుని తృప్తిపరచి పంపండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం. 

కామెంట్‌లు