సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్, అమెరికా

 న్యాయాలు -570
నద్యంబు వేగ న్యాయము
*****
నది అనగా నది పడమటి దిక్కుకు/తూర్పు దిక్కుకు ప్రవహించునది, ప్రవాహము .అంబు అనగా నీరు అని అర్థము.
నదులు తీవ్ర గతిలో ప్రవహించి  చివరికి సముద్రంలో కలుస్తున్నాయి అని అర్థము.
 నదులు వేగంగా పరుగులు తీస్తూ  వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి.అలా కలవడం వల్ల  తమకు ఉన్న మంచి పేరును పోగొట్టుకుంటున్నాయి.ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాలను సస్యశ్యామలం చేయాల్సి వుండగా, ఎంతో  మేలు జరగాల్సి వుండగా ఎవరో ఏదో అన్నట్లు కోపంగా ఉరికురికి వెళ్ళి దుష్ట సాంగత్యం చేయడం వల్ల  నది తనకు ఉన్న మంచి పేరుతో పాటు ఉనికిని కూడా కోల్పోతుందని అర్థముతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
"కౄర మనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచి వారికిన్/ వారి గుణంబెపట్టి చెడు వర్తన వాటిలు;మాధురీ జలో/దారలు గౌతమీ ముఖ మహానదు లంబుధి గూడినంతనే/క్షారము చెందవే మొదలికట్టడలిన్నయు దప్పి భాస్కరా!"
అనగా కౄరమైన లేదా చెడు బుద్ది కలిగిన వారిని సేవించు వారికి,కౄరమైన గుణములే వస్తాయి.అదెలా అంటే తియ్యని నదీ జలములు సాగరమున కలిసి ఉప్పగా ఉపయోగం లేకుండా మారిపోతాయి కదా! అని అర్థము.
 అంటే  ఈ న్యాయము వ్యక్తుల యొక్క తొందరపాటు నిర్ణయాలు, చర్యలతో  దుష్టులతో చేయి కలిపితే ఏమవుతుందో చెబుతుంది.
భాస్కర శతక కర్త అన్నట్లు అప్పటి వరకు తన తీయని మాటలు, పరోపకార చేతల వల్ల సమాజంలో ఎంతో గౌరవం పొందిన వ్యక్తి అనాలోచితంగా, తొందరపాటుతో ఎవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తులను నమ్మి వారి  చెంత చేరి అప్పటి వరకు ఉన్న మంచి పేరును పోగొట్టుకునే వారు మన చుట్టూ సమాజంలో కొంత మంది కనిపిస్తూ వుంటారు. 
అలాంటి వారివి చూసి "ఇంతమంచి వ్యక్తికి అదేం పోయేకాలం వచ్చింది- పోయి పోయి వాడి దంట పట్టిండు/ వాడి స్నేహం చేసిండు-ఇంత కాలం ఉన్న పరువూ మర్యాద,పేరూ కీర్తి అన్నీ పోగొట్టుకున్నాడే" అంటుంటారు.
 నది ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే. మన దాహం తీర్చేందుకు తీయని మంచినీరు, మన కడుపు నింపేందుకు పసిడి పంటలను ఇస్తుంది.అందుకే నదిని తల్లిలా కొలుస్తాం. అలాంటిది అలా వెళ్ళి సాగరంతో సహవాసం చేసి తనను తాను కోల్పోకూడదు కదా!
అందుకే ఓ కవి ఏకంగా  నదిని నమ్మకూడదని హితోపదేశ శ్లోకమే రాశాడు. అదేంటో చూద్దామా...
" నదీనాం శస్త్ర పాణీనాం నఖినాం శృజ్గిణాం తథా/ విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజ కులేషు చ!!"
అనగా నదుల విషయంలో, ఆయుధములు పట్టుకున్న వారి విషయంలో, వాడియైన గోర్లు కలవాటి విషయంలో, అలాగే స్త్రీలు విషయంలో మరియు రాజుల యొక్క వ్యవహారముల యందు అవగాహన  లేకుండా నమ్మకూడదు" అలా నమ్మితే సంతోషం కంటే సమస్యలే కలుగుతాయని అర్థము.
 అంటే ఇక్కడ నెమ్మదిగా కాకుండా వేగంగా పరుగులు తీసే నది ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో మనకు తెలుసు.
ఎలాగూ నదికి సంబంధించిన విషయమే కాబట్టి ఈ సందర్భంగా   మహాకవి కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకాన్ని కూడా చూద్దాం.
 ఒకసారి భోజరాజు సభలో  ఓ విచిత్రమైన పద్య పాదం ఇచ్చి పూరించమని  సభలో అడిగాడట. అప్పుడు కాళిదాసు చమత్కారంగా దానిని ఇలా పూరించాడు.
 "అంభోధి,జలధి,పయోధి,ఉందని,;వారాం నిధి: వారిది అని ఆరు సమానార్థక పదాలు ( సముద్రానికి పర్యాయ పదాలు)  ఆఖరి పాదంగా ఇచ్చి పూరించమన్నాడు.దానిని విన్న కాళిదాసు ఒక చక్కని కథను ఊహించాడు.
 " శివుడు తనకో సవతిని తీసుకుని రావడమే కాకుండా ఆమెను నెత్తిమీద పెట్టుకొని కూర్చున్నాడని పార్వతికి కోపం వచ్చిందట. తనకు వచ్చిన ఈ కష్టాన్ని కుమారుడైన షణ్ముఖునికి చెప్పుకుందట. అది విని షణ్ముఖుడికీ కోపం వచ్చిందట.
అతడు వెంటనే పరమ శివుని దగ్గరకు వెళ్ళి "నాన్నా!  నువ్వు నెత్తిన పెట్టుకొన్న గంగమ్మను చూసి అమ్మకు కోపం వస్తోంది.నువ్వు వెంటనే గంగమ్మను విడిచి పెట్టు." అన్నాడుట.
అప్పుడు పరమ శివుడు పరమ శాంతంగా "కుమారా! చిరకాలంగా నా దగ్గరే వుంటున్న గంగ. నేను వదిలేస్తే పాపం తను ఎక్కడికి పోతుంది? అన్నాడట.
 అలా సవతి తల్లిని తండ్రి వెనకేసుకుని రావడం నచ్చలేదు షణ్ముఖుడికి. ఎక్కడికి పోతుంది? అంటే తను మాత్రం ఏం చెబుతాడు. అందుకే కోపంగా "నదీనాం సాగరో గతిః " అని తన ఆరు ముఖాలతో ( షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు) ఆరు సార్లు " అంభోధి,జలధి,పయోధి, ఉదధి,వారాం నిధి,వారిధి" అన్నాడుట.
"అంబా కుష్యతి తాత మూర్ద్ని  విలసత్ గంగేయముత్సృజ్యతాం/విద్వన్ షణ్ముఖ!కా గతి మయి చిరాత్ అస్యా:స్థితాయా: వద?/ కోపావేశ వశాత శేష వదనై: ప్రత్యుత్తరం దత్తవాన్/ అంభోధి:జలధి పయోధి రుదధిః,వారాం నిధి: వారిధి:"
 ఇలా గంగ గురించి పార్వతి, షణ్ముఖుడు, శివుని సంభాషణను ఊహించి అద్భుతమైన పూరణతో అలరించిన కాళిదాసుని భోజరాజు సింహాసనం మీద నుంచి దిగి వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడట.
అంటే ఇక్కడ గంగ అనే పేరు నదికి సంబంధించినది.నది పేరు నదిని సముద్రంలో కలవమని షణ్ముఖుడు అన్నట్లుగానే నదులన్నీ సముద్రంలోనే కలవడం విశేషం.
 నదీ జలము దాని అతి వేగం, ప్రవాహం గురించి...‌అందులోని మంచి చెడుల గురించి ఈ "నద్యంబు వేగ న్యాయము" ద్వారా తెలుసుకున్నాం కదా!
 మనం నదిలా ప్రవహించాలి.సమాజంలో సద్గుణ సంపద పండించాలి. అంతే కానీ వేగమైన నిర్ణయాలు తీసుకుని, చెడుతో  కూడి మనకు మనం హాని చేసుకోకూడదని  ఈ న్యాయము నుంచి మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కామెంట్‌లు