సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా
 న్యాయాలు -556
దివాతన చంద్ర న్యాయము
****
దివా అనగా పగటిపూట లేదా పగటి యందు.చంద్ర అనగా చంద్రుడు, కర్పూరము, నెమలి పింఛము లోని కంటి చిహ్నము, నీరు, బంగారము అను అర్థాలు ఉన్నాయి.
 పగటిపూట చంద్రుని వలె శోభ తరిగి యుండుట అని అర్థము.
పగటి పూట  చంద్రుని శోభ ఎందుకు తరిగి వుంటుందో? అలాగే భూమి మీద నివసించే వారందరూ ప్రేమగా చంద్రుడిని మామా అని ప్రేమగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందామా...
  చంద్రుడిని చందమామ, జాబిల్లి,శశి అనే పేర్లతో పిలుస్తారు.సౌర కుటుంబంలో సూర్యుడు, భూమి,ఇతర గ్రహాలు,ఉపగ్రహాలు ఉన్నాయి.ఈ చంద్రుడు భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం.అలాగే ఉపగ్రహాలలో అతి పెద్ద ఉపగ్రహం కూడా.భూమి నుండి చంద్రుడు సుమారుగా 3,84,403 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.అలా భూమి చుట్టూ తిరుగుతూ భూమి మీద ఉన్న సముద్రాలను తన ఆకర్షణ శక్తితో ప్రభావితం చేస్తూ  భూమి మీద ఉన్న మానవాళికి పున్నమి వెన్నెలలు పంచుతూ కనువిందు చేస్తుంటాడు.
ఇక చంద్రుడిని మామ అని పిలవడం వెనుక మతపరమైన,పురాణ గాధలతో పాటు భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి. చంద్రడిని లక్ష్మి దేవి సోదరుడిగా చెబుతుంటారు.లక్ష్మిదేవి అంటే సాక్షాత్తూ భూదేవియే.అలా అక్కను వెంటనంటి తిరిగే తమ్ముడిలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడిని చందమామ అని పిలుస్తారన్న మాట.
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి లెక్క ప్రకారం 29-5 రోజులు పడుతుంది.అనగా చంద్రుని మీద ఒక రోజు భూమి మీద ఉన్న వారికి ఒక నెలతో సమానమని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇక చంద్రుడి కాంతి పగటి పూట తరగడానికి గల కారణం చూద్దాం. ప్రతి రోజూ తూర్పు వైపు నుంచి పడమరకు పయనించే చంద్రుడి  కాంతి సూర్యుడి కాంతి ప్రకాశం కంటే చాలా తక్కువ.అందువల్ల పగటి పూట చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పటికీ స్పష్టంగా కనిపించడు.సూర్యాస్తమయం తర్వాతే స్పష్టంగా కనిపిస్తాడు.అలా కనిపించే సమయాన్ని చంద్రోదయం అంటారు.అలా పగటిపూట చంద్రుడు వన్నె లేదా శోభ తగ్గి కనిపిస్తాడన్న మాట.
 
ఇక విషయానికి వస్తే "పగటిపూట చంద్రుని వలె" అనే సామెత కేవలం  చంద్రుడికి సంబంధించినదేనా అంటే కాదనే చెప్పాలి. ఇది వ్యక్తులను ఉద్దేశించి చెప్పినది. అలా ఎందుకో? ఏ ఉద్దేశంతో  చెప్పారో భాస్కర శతక కర్త రాసిన ఈ పద్యాన్ని చదివి తెలుసుకుందాం.
"సంతత పుణ్యశాలి యొక జాడను సంపద వాసిపోయి తా/నంతట పోకనెట్టుకొని యొప్పటి యట్ల వసించి యుండు;మా/సంతము నందు చందురుని యన్ని కళల్  పెడబాసి పోయినన్/కాంతి వహింప డోటు తిరుగంబడి దేహము నింత! భాస్కరా!!"
పుణ్యాత్ముడు తన సంపద అంతా పోయినా బాధ పడకుండా ఎప్పటి లాగానే వుంటాడు.చంద్రుడు నెల చివర కళలన్నీ పోయినా మళ్ళీ కాంతివంతునిగా వెలుగొందును కదా! అని అర్థము.
అలాగే గుణవంతుడు,భాగ్యశాలి అయిన వ్యక్తి  కూడా పగటి పూట చంద్రుని వలె తన యొక్క  పేరూ, కీర్తి ఎవరికీ తెలియక పోయినా బాధ పడడు.రాత్రి వేళల్లో అందులోనూ  పౌర్ణమిలో వెలిగే చంద్రుని వలె తన యొక్క మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు తిరిగి పొందుతూనే వుంటాడని ఈ "దివాతన చంద్ర న్యాయము"లోని అంతరార్థము.
మన యొక్క సేవలను గుర్తించే వారున్నా లేక పోయినా మన వల్ల ఈ సమాజానికి మంచి జరిగితే అంతే చాలు అనుకోవడంలోనే ఎంతో ఆనందం వుంది కాబట్టి మన శోభ తరిగిపోయిందని, ఎవరూ గుర్తించడం లేదు అనే బాధ అనవసరం.సమయం వచ్చినప్పుడు ఎలాగూ  తెలిసిపోతూనే వుంటుంది.అది చాలు కదండీ!

కామెంట్‌లు