కరువు!!!;- డా.సురేఖా MA.Phd.BEd. ( G.H.M)
ఏటేటా ఎండమావుల పంటలు పండిస్తుంటే 
పొలాల్లో జిల్లేడు పూలు
నాగజెముడు నాటుకుంటున్నాం. 

మట్టిని పొట్టన పెట్టుకున్న సూర్యుడు 
పొద్దు తిరుగుడు పువ్వై పూస్తున్నాడు. 

పొలంగట్లల్లా మోదుగ పువ్వు 
కన్నెర్రాచేస్తే
నాగలి ఆకలిగొని నేలకొరిగింది. 

భూమి పుట్టినప్పటినుంచి కాలం 
వర్షాకాలం చలికాలం ఎండాకాలం 
బాల్యం యవ్వనం వృద్ధాప్యం లా
ఎదుగుతూనే ఉంది. 

ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందేమో 
కాలం కాలం చేసింది. 
బాల్యం ఎంత బాగుండేది 
యవ్వనం మందు గుండు సామాగ్రిలా 
విర్రవీగేది.

పచ్చని మైదానం 
ఎండు గడ్డిలా స్మశానవసమైంది. 

ఆకలిగొన్న పొలం 
మేఘం ఘన చరిత్ర విని 
నోరు తెరుచుకొని కూర్చుంది. 

పొద్దున్నే సూర్యుడు నడి నెత్తికెక్కితే 

నదులు నాగుపాముల్లా కుబుసం వదులుతున్నవీ.

కాలువలు కదలకుండానే గుండెలాగి చనిపోయినవి. 

చెరువులకు చెమటలు పట్టి 
కరువు కష్టాలు ఏ కరువు పెట్టుకుంటున్నాయి. 

ఆఖరి క్షణంలో సూర్యుడు 
సముద్రాన్ని మింగేసిండు.

ఆకాశం లో నక్షత్రాల పంటలు పండినావేమో 

మేధం మాత్రం నిద్ర మాత్రలు మింగి 
ఆత్మహత్య చేసుకుంది. 

భూమి అమ్మ కోసం అమ్మ నవ్వు కోసం అమ్మ ముద్ద కోసం ఎదురుచూస్తుంది. 

మళ్లీ వర్షాకాలం 
నిండు చూలాలులా వస్తే సరిపోతుంది.
పండంటి పంటను కంటుంది. 


కామెంట్‌లు