ధీరుల త్యాగ ఫలం;- - కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108.
ఎన్నో బెదిరింపు చర్యల ఎదిరింపు పరంపర 
ఎన్నెన్నో తిరగబడి బిగించిన ఉక్కు పిడికిళ్ళు 
మరెన్నో బలిదానాల నెత్తుటి మరకల పేజీలు 
ఇంకెన్నో ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్నికెరటాలు !

ఆంగ్ల వలస పాలన విముక్తికై తూటాలకు ఎదురొడ్డి 
బానిస బంధన చేధనకై ఉరికంబానికి ఊయలలూగి 
ఓ అహింసా వాదం మరో సాయుధ పోరు మార్గం
కుల మత భాషా బేషజాలకు నిప్పంటించిన వైనం !

లాల్ బాల్ పాల్ గాంధీ అంబేద్కర్ సరోజినీ 
భగత్ ఆజాద్ అల్లూరి నేతాజీ వీరనారి ఝాన్సీ
వేలవేల ఉద్యమ దివిటీల ఉత్ప్రేరక కారకం
అంచెలంచెల క్విట్ ఇండియా ఉద్యమ శిఖరం !                                                                                                  

అఖండ భరత అశేష జన నినాదం   
కవి గాయక నాయక చైతన్య ప్రవాహం                                                      
ఎదఎదలో దేశభక్తి సమైక్య గీతాలాపనం                                                                                   
నిద్రాణ జాతి యావత్తు జాగృతమైన వైనం !

అమెరికా పౌరహక్కుల సమరానికి ప్రేరణగా 
దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష పోరుకు మార్గదర్శిగా
ఒకటా రెండా శతవసంతాల పోరాట ఘనచరిత
భరతమాత చరణాల చెంత నెత్తుటి దీపారాధన !
 
దేశమిచ్చిన దేహం కణకణం దేశానికే అర్పితం
తల్లీ! నీకోసం మరణం నా జన్మ ధన్యమనే సంకేతం
ధీరుల త్యాగగుణం భావితరం ఆశల వారధి కోసం
స్వేచ్ఛ సుమ ఫలాలిచ్చిన అమర వీరులకు వందనం !
(స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో)


కామెంట్‌లు