తాతయ్య మంత్రం ;- మొర్రి గోపి కవిటిశ్రీకాకుళం జిల్లా 8897882202

    రామన్న తోటకు వెళ్లి వచ్చేటప్పుడు ఐదు జామకాయలు తెచ్చాడు. మనవళ్ళు రాజు , రమణలను పిలిచి వారికి జామ కాయ లిచ్చి సర్దుకోమన్నారు. రాజు, రమణ తన కుమార్తె సుభద్ర పిల్లలు. సుభద్ర , అల్లుడు సుమన్ స్నేహితుల వివాహ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం వెళుతూ పిల్లల్ని , ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారు.
    తాతయ్య రామన్న కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేసరికి రాజు గట్టిగా ఏడుస్తున్నాడు. తాతయ్య రామన్న చూసి "ఒరేయ్ రమణ! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు"అని అడిగాడు. రమణ ఏమి సమాధానం చెప్పలేదు. రాజు ఏడ్చుకుంటూ"తాతయ్య! నువ్వు ఐదు జామకాయలు ఇస్తే వాడు మూడు జామకాయలు తీసుకొని నాకు రెండే ఇచ్చాడు"వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పాడు."ఒరేయ్ రాజు! అలా చేయడం తప్పు కదా! నువ్వు రెండు తీసుకొని మిగిలినది అమ్మమ్మకి ఇవ్వు"అని పిల్లల మధ్య తగువును తీర్చాడు రామన్న . రాజు "నేను ఇవ్వను తాతయ్య... నేనే తింటాను"అంటూ మంకు పట్టుపట్టాడు. ఇంతలో  అమ్మమ్మ కాంతం వచ్చి రాజు చేతిలో ఉన్న ఒక జామకాయ తీసుకొని, రెండు ముక్కలు చేసి చెరో ముక్క ఇద్దరికీ ఇచ్చింది. మనవళ్లిద్దరు  ఇంట్లో ఏది ఇచ్చినా నాకు ఎక్కువ కావాలి, నాకు అది కావాలి అంటూ అల్లరి పెడుతూనే ఉన్నారు. వీరి తగాదాలను పరిష్కరించలేక అమ్మమ్మ కాంతం చాలా చికాకు పడుతున్నది. రామన్నతో"ఏమండీ! వీళ్ళిద్దరితో అసలు పడలేకపోతున్నాను. నిరంతరము తగువులే"అంటూ ఫిర్యాదు చేసింది. రామన్న"అందుకే కదా! వీరిని ఎక్కడికి తీసుకు వెళ్లినా వీరి గోల తో మనసు ప్రశాంతంగా ఉండదని సుభద్ర మన దగ్గర వీళ్ళను విడిచిపెట్టి వెళ్ళింది"అని అన్నారు. "ఎలాగు సుభద్ర వాళ్ళు వచ్చేటప్పటికి వారం రోజులు పడుతుంది. అంతవరకు వీరి అల్లరిని భరించాల్సిందేనా!"అని కాంతం నిట్టూర్చింది. 
     రాత్రి భోజనం అయ్యాక రమణ రాజులను తాతయ్య పిలిచి"ఒరేయ్! మిమ్మల్ని మీ అమ్మానాన్న ఎందుకు పెళ్లికి తీసుకు వెళ్ళలేదో తెలుసా!. మీకు వారితో కలిసి పెళ్లికి వెళ్లాలని అనిపించలేదా?"అని అడిగారు.""అనిపించింది... కానీ మేము అల్లరి చేస్తామని వారు తీసుకెళ్లలేదు"అని రమణ అన్నాడు."అంటే మీరు అల్లరి పిల్లలని మీకు తెలుసు అన్నమాట!... ఇలా నిరంతరము అల్లరి చేస్తే మీకు ఎక్కడికి తీసుకువెళ్లరు. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. రేపట్నుంచి మీకు ఏ తినుబండారాలు తేను. ఎందుకంటే మీరు నేను తెచ్చి ఇస్తున్న తినుబండారాలు కోసం పోట్లాడుకుంటున్నారు. ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. అల్లరి పిల్లలకు ఇకపై ఏవి దొరకవు. మీరు బుద్ధిగా ఉంటామని నాకు మాట ఇస్తే నేను మీకు అన్ని తెస్తాను"అని రామన్న అన్నారు. రమణ రాజు ఏమి అనలేదు. ఊరుకున్నారు. 
    తర్వాత రోజు తాత రామన్న బజారుకు వెళ్లినా, ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం ఏమీ తేలేదు. రాజు రమణ తాత తెచ్చిన సంచిలో అమ్మమ్మ వస్తువులు తీస్తూ ఉంటే, అక్కడ కూర్చుని తమ కోసమేమైనా తాత తె చ్చాడేమో అని చూశారు. సంచిలో ఏమీ లేదు. అమ్మమ్మ కాంతంతో"అమ్మమ్మ! ఈరోజు తాతయ్య మా కోసం ఏమీ తేలేదు"అని రమణ, రాజుఅడిగారు. అప్పుడు కాంతం"తాతయ్య... నిన్న రాత్రి మీకు చెప్పారు కదా... బుద్దిగా ఉంటామని చెబితేనే తెస్తామన్నారు కదా! మీరు తాతయ్య కు మాట ఇవ్వలేదు. అందుకే తేలేదు. నాక్కూడా ఇంట్లో ఏమి చేయవద్దని చెప్పారు"అంటూ అసలు సంగతి చెప్పింది. రాజు, రమణ తాతయ్య దగ్గరకు వెళ్లి"తాతయ్య! ఇకపై మేము అల్లరి చేయము. మాపై అమ్మ నాన్న లు ఎందుకు విసుక్కుంటూ ఉంటారో అర్థమైంది. ఇకపై అమ్మ నాన్నలు చెప్పినట్లు నడుచుకుంటాం. నీ మాట వింటాం"అని అన్నారు. తాతయ్య రామన్న "అయితే మంచి పిల్లలు అయిపోయారు అన్నమాట! ఇకపై అనవసరమైన అల్లరి చేయకూడదు. ఇద్దరూ బుద్ధిగా క్రమశిక్షణగా మసులు కోవాలి"అని చెబుతూ"బుద్ధిగా ఉండే పిల్లలకు నా బహుమతి "అంటూ ఇద్దరికీ చేరో వేరు వేరు బాలల కథల పుస్తకాలు ఇచ్చారు. రమణ రాజు ముఖాల్లో ఆనందం కనబడింది. అంతేకాకుండా ఐదు చాక్లెట్లు పంచుకోమని ఇద్దరికీ ఇచ్చారు. రమణా రాజు చేరో రెండు చాక్లెట్లు తీసుకొని, ఒక చాక్లెట్ అమ్మమ్మకి ఇచ్చారు. సుభద్ర సుమన్ వచ్చేంతవరకు రమణ, రాజు అమ్మమ్మ తాతయ్య మాట వింటూ అల్లరి చేయకుండా గడిపారు. తాతయ్య వాళ్లకి ఏమేం కావాలో  తెచ్చి ఇస్తుంటే ఆనందపడ్డారు. 
  సుభద్ర సుమన్ వచ్చి ఒకరోజు ఇంట్లో ఉన్నారు. రాజు రమణ బుద్దిగా మసులుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. రామన్న సుభద్ర తో "ఇకపై నీ పిల్లలు అల్లరి చేయకుండా క్రమశిక్షణతో ఉంటారని"అన్నారు. సుభద్ర చాలా సంతోష పడింది.
****

కామెంట్‌లు