టక్కుపల్లి సుబ్బయ్య- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

    ఒకూర్లో రామయ్య, సోమయ్య అని ఇద్దరు వుండేటోళ్ళు. వాళ్ళిద్దరూ మంచి పరుగు పందెంగాళ్ళు. ఉరకడం మొదలు పెట్టినారంటే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఎవరూ చెప్పలేరు. కానీ వాళ్ళలో రామయ్య చానా అమాయకుడైతే సోమయ్య మాత్రం పెద్ద టక్కరోడు.
రామయ్య దగ్గర ఒక పెద్ద వజ్రం వుండేది. దాన్ని వాళ్ళ నాయన చచ్చిపోతా... చచ్చిపోతా... వాని చేతిలో పెట్టినాడు. అది చానా విలువైనది. సోమయ్య కన్ను ఆ వజ్రం మీద పడింది. ఎట్లాగయినా సరే దాన్ని కొట్టేయాలని అనుకున్నాడు.
సోమయ్య ఒకరోజు రామయ్యతో 'రామయ్యా... రామయ్యా... రేపు మనం పరిగెత్తే పందెం వేసుకుందామా. నువ్వు గెలిస్తే మా ఇంటికొచ్చి మొట్ట మొదట ఏం ముట్టుకుంటే అది నీకిస్తా. అట్లాగాక నేను గెలిచినాననుకో... నేను మీ ఇంటి కొచ్చి మొట్టమొదట ఏం ముట్టుకుంటే అది నాకియ్యాల. సరేనా" అనినాడు.
రామయ్య "సరే" అన్నాడు.
తరువాత రోజు సోమయ్య పందెం గురించి చెప్పి ఊరి పెద్దలనంతా పిల్చుకోనొచ్చినాడు. కర్నూలు నుంచి కాల్వబుగ్గ దాకా ముప్పై కిలోమీటర్లు ఎవరు ముందు వురికితే వాళ్ళు గెలిచినట్లు అనుకున్నారు. ఊరి పెద్దలు ఒకటి, రెండు, మూడు అనగానే ఇద్దరూ ఒకేసారి వురకడం మొదలు పెట్టినారు.
ముప్పై కిలోమీటర్లంటే మాటలు కాదు గదా. చానాచానా దూరం. తాండ్రపాడు దాటాల, నన్నూరు దాటాల, పూడిచెర్ల దాటాల, ఓర్వకల్లు దాటాల, హుసేనాపురం దాటాల... ఆ తర్వాత కాల్వబుగ్గ. దాంతో ఊరోళ్ళు మధ్య మధ్యన వాళ్ళు తాగడానికని నీళ్ళు ఏర్పాటు చేసి ఇద్దరు మనుషుల్ని ఆడాడ పెట్టినారు. 
సోమయ్య వాళ్ళలో ఒకన్ని మంచి చేసుకోని తాగే నీళ్ళలో మత్తుమందు కలిపినాడు. అది తెలీని రామయ్య వురుక్కుంటా... వురుక్కుంటా.... ఆడికొచ్చి దప్పిక తీర్చుకోడానికని ఆ నీళ్ళు తాగినాడు. అంతే కొంచెం దూరం వురికినాడో లేదో చేతగాక కిందపడిపోయినాడు. దాంతో సోమయ్య వానిని దాటుకోని గెలిచేసినాడు.
పందెం ప్రకారం తరువాత రోజు పొద్దున్నే "మీ ఇంటికి వస్తా'' అన్నాడు. రామయ్య సరే అన్నాడు. సోమయ్యకు వజ్రం మీద కన్నుంది గదా... ఆ సంగతి కొందరు పోయి రామయ్యకు చెప్పినారు. దాంతో రామయ్యకు ఏం చేయాల్నో అర్థం కాలేదు. వాడు ఖచ్చితంగా వచ్చి వజ్రాన్ని ముట్టుకుంటాడు. తాత ముత్తాతల కాలం నుంచీ ఒకరి నుండి ఒకరికి వస్తావున్న వజ్రమది. తన కాలంలో పోతుందే అని బాధపడసాగినాడు.
అప్పుడు రామయ్యకు తన స్నేహితుడయిన టక్కుపల్లి సుబ్బయ్య గుర్తుకొచ్చినాడు. టక్కుపల్లి సుబ్బయ్యంటే అందరిలెక్క అట్లాంటిట్లాంటోడు గాదు. చానా తెలివయినోడు. ఎటువంటి చిక్కు సమస్యనయినా సరే చిటికెలో తీర్చేయగలడు. దాంతో గుర్రమేస్కోని రాత్రికి రాత్రి టక్కుపల్లికి చేరుకోని సుబ్బయ్యకు జరిగిందంతా చెప్పేసినాడు.
సుబ్బయ్య కాసేపాలోచించి "సరే... పోదాం పద" అని వానెంబడే వాళ్ళ ఊరికి
వచ్చినాడు. ఇంట్లో వజ్రాన్ని బాగా ఎత్తున్న మచ్చు మీద కనబడేటట్లు పెట్టి, ఒక మూలన నిచ్చన గోడకు ఆనించినాడు. హాయిగా పడుకో... రేపు చూద్దువు గానీ, ఏం జరుగుతుందో" అన్నాడు.
తరువాత రోజు పొద్దున్నే సోమయ్య ఊరోళ్ళందరినీ వెంటబెట్టుకోని రామయ్య ఇంటికి వచ్చినాడు. వచ్చి వజ్రం కోసం ఇల్లంతా వెదకసాగినాడు. యాడా కనబళ్ళేదు. ఇదేందబ్బా యాడా కనబడడం లేదు అని ఆలోచిస్తా వుంటే మచ్చు మీద ధగధగధగ మెరిసిపోతా కనబడింది. సంబరంగా పోయి చేయి చాచినాడు. అది అందలేదు. ఎగిరి చూసినాడు. ఐనా అందలేదు. ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే మూలన నిచ్చెన కనబడింది. టెరబెరా పోయి నిచ్చెన తీసుకోని ఏసి మచ్చు మీదికి ఎక్కసాగినాడు.
అంతలో టక్కుపల్లి సుబ్బయ్య “ఆగు మిత్రమా... యాడికి ఎక్కుతా వున్నావు" అన్నాడు. సోమయ్య చిరునవ్వుతో వజ్రాన్ని చూపిస్తా "అది తీసుకోడానికి" అన్నాడు.
టక్కుపల్లి సుబ్బయ్య నవ్వుతా “చూడు సోమయ్యా... ఒకసారి పందెం గుర్తు చేసుకో, ఇంట్లోకొచ్చి మొట్టమొదట ఏం ముట్టుకుంటే అది నీది... అంతే గదా... ఇప్పుడు నువ్వు ఇంట్లో మొట్టమొదట ముట్టుకున్నది ఏది. నిచ్చెన గదా. కాబట్టి నిచ్చెన తీసుకోని ఇంగ నీ ఇంటికి నువ్వు పో" అన్నాడు.
సోమయ్య నోట మాట రాలేదు. నోరుమూసుకుని మట్టసంగా కిందకి దిగినాడు. ఊరి జనాలంతా కిందామీదాపడి నవ్వుతా ఉంటే గమ్మున ఆ నిచ్చన అక్కన్నే వదిలేసి తలొంచుకొని ఇంటికి పోయినాడు. టక్కుపల్లి సుబ్బయ్య తెలివికి ఊరు ఊరంతా మెచ్చుకోని చప్పట్లు కొట్టినారు.
***********
కామెంట్‌లు