పిట్టపిల్లా సముద్రుడ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

    ఒకూరి పక్కన ఒక పెద్ద సముద్రముండేది. ఆ సముద్రం ఒడ్డునే ఒక పెద్ద కొబ్బరిచెట్టు వుండేది. దాని మీద ఒక బుల్లిపిట్ట గూడు కట్టుకోనింది. అది రోజూ అక్కడుండే చిన్నచిన్న పురుగులనూ, గింజలనూ తింటా సంతోషంగా దారిలో కనపడిన అందరినీ కిచకిచమని పలకరిస్తా హాయిగా వుండేది.
కానీ అనుకోకుండా దానికి ఒక పెద్ద కష్టమొచ్చి పడింది. అదుండేది సముద్రం పక్కనే గదా. ఆ సముద్రానికి ఒక రాజున్నాడు. వానికి నన్నెవడూ ఏమీ చేయలేడని భలే పొగరు. పిట్టపిల్ల సంబరంగా వుంటే చూల్లేక, ఎట్లాగైనా సరే దాన్ని ఏడిపియ్యాలనుకున్నాడు.
బుల్లిపిట్ట ఒక రోజు నాలుగు గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పగిలిపోకుండా దాన్ల కింద మెత్తని ఆకులు పరచింది. ఎప్పుడెప్పుడు గుడ్లు పగులుతాయా ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూద్దామా అని ప్రేమగా ఎదురు చూడసాగింది.
ఒకరోజు అది ఆహారం కోసం బైటకి పోయింది. పిట్టపిల్ల అట్లా బైటకి పోవడం ఆలస్యం... దాని కోసమే ఎదురు చూస్తావున్న సముద్రుడు ఠక్కున బైటకొచ్చి ఆ నాలుగు గుడ్లు మట్టసంగా ఎత్తుకోని పోయినాడు. పిట్టపిల్ల తిరిగొచ్చి చూస్తే ఇంకేముంది... గుడ్లు లేవు. పాపమా పిట్ట బాధతో విలవిలలాడిపోయింది. గుడ్లు ఎవరెత్తుకుపోయినారో తెలీక కళ్ళనీళ్ళు పెట్టుకోనింది.
ఆ రోజు నుండీ పిట్టపిల్ల ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా ప్రతిసారీ సముద్రుడు దొంగచాటుగా వచ్చి వాటిని ఎత్తుకోని పోవడం మొదలు పెట్టినాడు. పిట్టపిల్ల అలోచించి, ఆలోచించి... ఇట్లాగైతే లాభం లేదు... ఎవరెత్తుకుపోతున్నారో కనుక్కోవాలనుకోని ఒకరోజు మేతకు పోయినట్లే పోయి ఒక చిన్న బండరాయి చాటున దాక్కోని చూడసాగింది. పిట్ట పిల్ల లేదనుకొన్న సముద్రుడు బైటకొచ్చి మట్టసంగా అన్నీ తీస్కొని వెళ్ళిపోయినాడు.
పిట్టపిల్లకు సముద్రుని మీద చానా కోపమొచ్చింది. ఎట్లాగైనా సరే సముద్రునికి బుద్ధి చెప్పాలనుకోని ఒకొక్క చుక్కా నీటిని ముక్కుతో తీసుకోనొచ్చి బైట పోయసాగింది. సముద్రమంటే మాటలా... చానా చానా పెద్దగుంటాది కదా. దానికేమైతాది. అందుకే అది చూసి సముద్రుడు పకపకపక నవ్వుకోసాగినాడు.
పిట్టపిల్ల మాత్రం పట్టు వదల్లేదు. రోజులు పోయి, నెలలు పోయి, సంవత్సరం దాటింది. ఐనా పిట్టపిల్ల ఏ మాత్రం అలసిపోకుండా రాత్రీ పగలూ ఒక్కొక్క చుక్కా తీసుకోనొచ్చి బైటపోయసాగింది.
ఒకరోజు ఒక ముసిలోడు సముద్రం ఒడ్డు మీద పోతా పోతా పిట్టపిల్ల పడతావున్న కష్టం చూసి అయ్యో పాపం అని జాలిపడి “ఏమే... పిట్టపిల్లా ఎందుకట్లా కష్టపడతా వున్నావ్. ఏంది నీ బాధ" అనడిగినాడు. పిట్టపిల్ల కళ్ళనిండా నీళ్ళు కారిపోతావుంటే వెక్కి వెక్కి ఏడుస్తా జరిగిందంతా చెప్పింది.
అప్పుడా ముసిలోడు “సముద్రమంటే మాటలు గాదు. నువ్వెన్ని సంవత్సరాలయినా వాన్నేమీ చేయలేవు. అందుకే వాడు గూడా నిన్ను లెక్కపెట్టడం లేదు. ఈ ఊరిని పాలించే రాజు దగ్గరకుపో. ఆయన చానా మంచోడు. తప్పకుండా నీకు సాయం చేస్తాడు” అని చెప్పినాడు.
పిట్టపిల్ల ఎగురుకుంటా...
ఎగురుకుంటా.... రాజు దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పింది. అది విన్న రాజు జాలిపడి "నీవు చిన్నదానివని ఏమీ చేయలేవనే గదా వానికంత పొగరు. నువ్వేమీ బాధ పడొద్దు, నేను నీకు సాయం చేస్తా. వాని అంతు చూద్దువు గానీ” అని మాటిచ్చినాడు.
తర్వాత రోజు పొద్దున్నే వడ్రంగులందర్నీ పిలిపించి పెద్దపెద్ద రెక్కలున్న చెక్క పక్షుల్ని చేసి, అవి గాలిలో ఎగురుతా వేగంగా రెక్కలు ఉపేటట్లు యంత్రాలు అమర్చమన్నాడు. వాళ్ళు సరేనని రాత్రింబగళ్ళు కష్టపడి ఓ నెలరోజుల్లో లెక్కలేనన్ని చెక్క పక్షుల్ని చేసిచ్చినారు. రాజు అవన్నీ పిట్టపిల్లకు ఇచ్చినాడు.
పిట్టపిల్ల అవన్నీ తీస్కోని పోయి సముద్రం మీద వదిలింది. అవి రాత్రనకా పగలనకా సముద్రం మీద చేరి వేగంగా రెక్కలు ఊపడం మొదలుపెట్టినాయి. అంతే ఆ దెబ్బకు నీళ్ళు ఆవిరి కాసాగినాయి. అది చూసి సముద్రుడు "ఎంతలే... రెండ్రోజులు వూపీ... వూపీ... అలసిపోయి అవే వెళ్ళిపోతాయి" అనుకున్నాడు. కానీ అలసిపోవడానికి అవి మామూలు పక్షులు కాదు గదా. యంత్రాలు. అదీగాక ఒకటిగాదు. రెండు కాదు... లక్షలు లక్షలు వున్నాయి. దాంతో చూస్తుండగానే సముద్రంలో నీళ్ళు సగానికి సగం తగ్గిపోయినాయి.
దాంతో సముద్రుడు అదిరిపడ్డాడు. ఇట్లాగే చూస్తావుంటే కొన్ని రోజులకు ఒక్క చుక్క నీళ్ళు గూడా మిగలవని అర్థమైంది. దాంతో ఉరుకులు పరుగుల మీద గసబెట్టుకుంటా బైటకొచ్చి పిట్టపిల్ల కాళ్ళ మీద పడినాడు. “ఇంకెప్పుడూ ఎవరి జోలికి వెళ్ళననీ, బుద్ధిగా వుంటాననీ, ఈ ఒక్కసారీ క్షమించమని" వేడుకొన్నాడు. అంతవరకూ తానెత్తుకుపోయిన గుడ్లన్నీ మట్టసంగా గంపలో పెట్టి తీసుకోనొచ్చి ఇచ్చినాడు. అప్పుడా పిట్టపిల్ల చెక్కపక్షులన్నింటినీ పంపిచ్చేసి, తన గుడ్లతో సంతోషంగా గూడు చేరుకోనింది.
***********
కామెంట్‌లు