పిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వండి- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
పిల్లలను స్వేచ్ఛగా
ఎదగనివ్వండీ
ముందరి కాళ్ళకు బంధాలేసి
లోకం తెలియని అజ్ఞానులను
చేయకండి

వేలకు వేలు వారి విద్యాబుద్ధులకై డబ్బు ఖర్చుచేసే
తల్లిదండ్రులు మీ మూలాల్ని
మీ రెక్కాడితే కానీ డొక్కాడని
మీ బ్రతుకు చిత్రాన్ని ఏకరువుపెట్టండి

పిల్లలకు అప్పులు తెచ్చి
విద్య ఆర్థిక వనరు అని
నమ్మబలికిన 
కార్పోరేట్ మాయాజాలాన్ని
పసిగట్టి ముందు కెళ్ళడం
నేర్చుకొమ్మని
సమకాలీన ఆర్థిక సామాజిక అంశాలను ఎప్పడికప్పుడు
తెలుసుకొమ్మని
మీ పిల్లలకు భుజం తట్టిచెప్పండి

మానవుడి అత్యాశకు 
ప్రకృతి
వికృత రూపం దాల్చితే
సాంకేతికాభివృద్ధి కొరగానిదైపోతే

ఉద్యోగం రాకున్నా ఆత్మగౌరవం తో బ్రతకడానికి
సంప్రదాయ వృత్తులైనా
నేర్చుకొని బ్రతకేలా!?
వారికి తర్ఫీదునివ్వండి

పిల్లలతో ముఖాముఖి సంభాషించండి
వారి వారి భయాలు , నిరాశలు
పారద్రోలి
స్వీయ ఆత్మగౌరవంతో 
బ్రతకేలా 
ప్రేరణకల్గించండి

సంపదున్నప్పుడు అహంభావాన్ని
లేనప్పుడు బేలతనాన్ని ఆత్మన్యూనతను ప్రదర్శించకుండా
ఆశావాదాన్ని 
ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పండి

కామెంట్‌లు