సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
న్యాయాలు-585
పయోముఖ విషకుంభ న్యాయము
*****
పయస్ పాలు, నీరు.ముఖము అనగా నోరు,ముఖము,అగ్రభాగము, ఒడ్డు, పక్షి ముక్కు, ద్వారము, ఆరంభము, ప్రస్తావన,ముఖ్యము,ఉపాయము. విష అనగా నీరు,గరళము.కుంభము అనగా నీటి కడవ, ఏనుగు కుంభ స్థలము,ఒక రాశి అనే అర్థాలు ఉన్నాయి.
"లోపల విషము పైన పాలు గల కుండ వలె" అనగా "కుండ పై భాగంలో పాలు లేదా నీరులా కనిపించినా లోపల ఉన్నది విషము" జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడమే ఈ న్యాయములోని ముఖ్య ఉద్దేశ్యం.
 మరి ఎందుకో ఎలానో చూద్దామా...
 'పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియ వాదినమ్!/వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్!!"
అనగా ప్రత్యక్షంగా ఎంతో తీయగా, ప్రియంగా మాట్లాడుతూ పరోక్షంగా అంటే మనం చేసే పనులను వెనుక నుండి చెడగొట్టే వాడు మిత్రుడు లాగే పైకి పాలకుండలా కనిపిస్తాడు కానీ లోపల వుండేది విషము. అనగా పాల కుండలా కనిపించే విషపు కుండ అలాంటి వాడిని వదిలి పెట్టాలి అని అర్థము.ఎందుకంటే పైకి పాలకుండలా మంచిగా కనిపిస్తూ , అలా ఎదుటివారిని నమ్మిస్తూ ద్రోహం చేసే బుద్ధి కలిగి ఉంటాడు.
 దీనికి సంబంధించిన భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దాం.
"పాపపు ద్రోవ వాని కొక పట్టున మేను వికాస మొందినన్/లోపల దుర్గుణంబె ప్రబలుంగద నమ్మగ గూడ దాతినిన్/బాపట కాయకున్ నునుపు పైపయి గల్గిన కల్గుగాక యే/రూపున దానిలోగల విరుద్ధపు జేదు నశించు భాస్కరా!
అనగా "మేడిపండు ఏవిధంగానైతే పైకి చూడటానికి నిగనిగలాడుతూ మంచిదిగా కనిపిస్తూ వుంటుంది.దాని పొట్ట విప్పి చూస్తే అందులో పురుగులు కనిపిస్తాయి అన్నట్లుగా, పుచ్చకాయ  పైకి నునుపుగా వుండి లోపల చేదు కలిగినట్లు దుర్మార్గుడు పైకి  చూడటానికి అందంగా సౌమ్యంగా కనిపించినప్పటికీ లోపల ఉన్న దుష్ట గుణం పోదు కదా" అని అర్థము.
(ఇక్కడ మనం చెప్పుకుంటున్న పుచ్చకాయ అనేది మనం తినే  తీయని పుచ్చకాయ కాదు. చిన్న దోసకాయ పరిమాణంలో ఉండే ఒక రకపు పుచ్చకాయ.ఇది పైకి చూస్తే అచ్చం పుచ్చకాయ వలెనే వుంటుంది.కానీ తింటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి దీనిని చేదు పుచ్చ లేదా పిచ్చి పుచ్చకాయ అని పిలుస్తారు).
 ఇక విషయానికి వస్తే  పైకి  తెల్లగానో స్వచ్ఛంగానో  పాలూ, నీళ్ళలా కనిపిస్తూ కుండలాంటి మనసు కడుపులో విషం దాచుకుని మిత్రుత్వానికే అపవాదు, అపకీర్తి వచ్చేలా  చెడ్డ పనులు చేస్తూ ఉంటారు.
 అందుకే మన పెద్దలు "తెల్లని వన్నీ పాలు - నల్లని వన్నీ నీళ్ళు " అనుకోవద్దనీ, "మెరిసేదంతా బంగారం కాదు" అని ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని హెచ్చరిస్తూ వుంటారు.
కాబట్టి ఈ "పయోముఖ విషకుంభ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎవరినీ అంత త్వరగా నమ్మకూడదు. పైకి కనిపించేంత మంచితనం లోపల వుండక పోవచ్చు.అలాగే చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన  అందమైన మనసు వుంటుందో లేదో తెలియదు కనుక  నిశితంగా గమనించిన తర్వాతనే పరిచయం, స్నేహం పెంచుకోవాలి.
 

కామెంట్‌లు