సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా

 న్యాయాలు -580
పంకమగ్న గజ న్యాయము
******
పంకం అంటే బురద, ఱొంపి,పాపము.మగ్న అంటే మునిగినది.గజ అనగా ఏనుగు, ఎనిమిది సంఖ్య, పొడవును తెలుపు కొలత ( మూడడుగులు) అనే అర్థాలు ఉన్నాయి.
ఱొంపిలో పడిన ఏనుగును ఏనుగే లేవనెత్తవలెను "ఏనుగు పల్లసంబిడిన నేలికకున్ వశమే వహింపగన్ " అన్నట్లు" అంటే బురదలో పడిన లేదా చతికిల పడిన ఏనుగును లేపడం మానవులకు సాధ్యం కాదు. ఎందుకంటే అది అతి బరువైన,బలమైన జంతువు. దానిని పైకి లేపేందుకు మరో ఏనుగు సహాయమే తీసుకోవాలి అని అర్థము.
అందుకే  ఇదిగో ఇలాంటి సామెతలు పుట్టాయి. "ఏనుగు కింద పడితే లేదా చతికిల బడితే ఏనుగే లేపాలి కానీ ఎవరు లేపగలరు ?,"ఏనుగు ఱొంపిలో కూరుకు పోతే కాకికి కూడా లోకువే".
 ఎలాగూ ఏనుగు సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి  ఏనుగు గురించి మరోసారి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
 ఏనుగు భూమిపై నివసించే అతి పెద్ద క్షీరదం మరియుతొండము కలిగిన జంతువు.ఈ ఏనుగు వంశము 55 మిలియన్ సంవత్సరాలకు పైగా విస్తరించి వుందని చెబుతుంటారు.దీనిని హిందూ, బౌద్ధ మతస్థులు ఎంతో పవిత్రంగా చూడటం  మనకు తెలుసు. ఇంత  భారీ శరీరాన్ని కలిగి వున్నా  ఇవి పూర్తిగా శాఖాహారులే. వీటిని విధేయత,శక్తి, జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు.సాధారణంగా ఏనుగులు చాలా తెలివైన జంతువులని  చెబుతారు.ఎందుకంటే వీటిలో స్వీయ అవగాహన,ఉద్దేశ పూర్వక సంభాషణ, అభ్యాసం, జ్ఞాపక శక్తి మరియు వర్గీకరణ మొదలైన సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి.
ఇక విషయానికి వద్దాం." బురదలో పడిన ఏనుగును ఏనుగే లేపగలదు" అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది. ఒక బలవంతుడిని కాపాడాలంటే మరో బలవంతుడైతేనే కాపాడగలడని.
 దీనికి సంబంధించిన  ఉదాహరణగా గత రాజుల చరిత్రను చెప్పుకుందాం. పూర్వకాలంలో రాజులు వాళ్ళు పరిపాలించే రాజ్యాలు వుండేవి కదా! వారు తమ రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఇతర రాజులపై యుద్ధం చేసేవారు.ఆ సమయంలో ఓడిపోయిన రాజు  శత్రురాజును ఓడించి మళ్ళీ రాజ్యాన్ని పొందాలంటే  తనకు ధీటుగా  సైనిక బలం, వ్యూహ చాతుర్యం ఉన్న మరో రాజు యొక్క సహాయంతోనే శత్రువును ఓడించగలడు.అలా ఓడించే వాడు కూడా.
ఇక వ్యక్తి పరంగా చూసినట్లయితే ఆర్థిక సాయమో,  అవసరాల సాయమో ఎవరైనా చేయగలరు.కానీ మనిషి లోని లోపాలను సరిచేసుకోవాలన్నా, లోపలి శక్తి సామర్థ్యాలను బయటి ప్రపంచానికి చూపాలన్నా  ఎవరికి వారే సహాయం చేసుకోవాలి. అలా  ఎవరికి వారే  వెన్నుతట్టి ముందుకు నడిపించుకోవాలి.
 ఆ విధంగా ఈ "పంకమగ్న గజ న్యాయము"ను 'మనకు మన మనసుకు' వర్తింపజేసి చూసినట్లయితే "మనసుకు మనసే సరి".'మనసే మిత్రుడు- మనసే శత్రువు '  అంటారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే మాట చెప్పారు.అదెలా అనేది మనందరికీ తెలిసిందే.
మమకారానికి, అహంకారానికి మూల కారకాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి సకారాత్మక ఆలోచనలున్న బుద్ధివి.నకారాత్మక ఆలోచనలు మనసువి.చెడు అలవాట్ల, నకారాత్మక బురద నుంచి బయట పడాలంటే మనసును బుద్ధి చెప్పినట్లు వినేలా శిక్షణ  ఇవ్వాలి.తద్వారా మనసును దృఢం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఎంత భయంకరమైన దురలవాటు నుండైనా అలవోకగా బయటపడొచ్చు.
 ఈ న్యాయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏనుగు లాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న మనం పొరపాటున అవలక్షణాల బురదలో కూరుకుపోతే మనసును బుద్ధిమంతమైన ఏనుగును చేసి బయటకు లాగుదాం.శక్తికీ,జ్ఞానానికీస్వీయ అవగాహనకు మనకు మనమే సాటిగా నిలుద్దాం.

కామెంట్‌లు