ప్రముఖ జర్నలిస్టు శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు!;- అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆయన పేరు వినటమే గాని అంతగా ఆయన జీవిత విశేషాలు నాకు తెలీదు.కానీ 2.8.24 రేడియో లో తెలుగు పద్మాలు శీర్షిక లో గతంలో డా.వి.వి.రామారావుగారు చేసిన ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.అరగంటలో అద్భుతంగా ఎన్నో విషయాలు వివరించారు.ఆయన 14 వ ఏట స్కూల్ డిబేట్ లో స్వరూపరాణి అనే అమ్మాయి ఆడపిల్లలకి చదువు అవసరం అని చెప్పింది.కానీ ఈయన ఠక్కునలేచి ఆడపిల్ల కి పెళ్లి చదువు చాలు అని టపటపా నోటికి వచ్చిన పాయింట్లు చెప్పి స్టేజీ దిగారు.ఆపిల్ల ఏడుస్తూ కంటపడింది.ఆరాత్రి చిన్నారి తుర్లపాటి వారి కి కంటిమీద కునుకు లేదుట.మర్నాడు బడి కెళ్లి ఆడపిల్లలున్న గది దగ్గరికి వచ్చి " నన్ను క్షమించు స్వరూపరాణి" అని అడిగాకే ఆయన మనసు కుదుట పడిందిట.నార్లవెంకటేశ్వరరావుగారి సంపాదకీయాలు బాగా చదివారు .ఆప్రభావంతోవ్యాసాలు రాయడం నల్గురిదృష్టిలో పడటం అలా ఆంధ్రపత్రిక లో కరస్పాండెంట్ గా చేస్తూ అంబేద్కర్ ని స్వయంగా ఇంటర్వ్యూ చేస్తూ" గాంధీజీని అభినందిస్తాను మిమ్మల్ని రాజ్యాంగ నిర్మాత గా చేసినందుకు " అన్న ఆయనవైపు ప్రశంసా పూర్వకంగా చూశారు బాబాసాహెబ్.ఎన్.జి.రంగా గారి వాహిని పత్రిక లో కూడా పనిచేశారు పిన్న వయసులోనే.నెహ్రూని విజయవాడ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆయనది.పోలీస్ బందోబస్తు అట్టహాసం లేకుండా సరాసరి ప్రధాని నెహ్రూ ని కల్సి ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆయనది.4వేలకుపైగా జీవిత చరిత్రలు నిర్మొహమాటంగా నిర్భయంగా రాసిన జర్నలిస్టు.
త్యాగశీలి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అవిశ్వాస తీర్మానం తో పదవి నుంచి తొలగించటం దుర్మార్గం కదండీ " అన్న వారిమాటలతో నాకు అర్ధమైంది ఆనాడు కూడా కుళ్లు రాజకీయాలు ఉన్నాయని. ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షుడు గా అక్కినేని నాగేశ్వరరావు గారి కి సన్మానం తలపెట్టినప్పుడు అంతా పూలదండలు శాలువాలతో సత్కరిద్దాం అంటే తుర్లపాటివారు సూటిగా ఇలా అన్నారు " పూలదండలు వాడుతాయి.శాలువాలు ఆయన దానం చేస్తారు.దాని బదులు నటసామ్రాట్ అన్న బిరుదు ఇద్దాం" అనడం అక్కినేని గారు బ్రహ్మానందపడిపోయి " ఇది చాలు నాకు.ఇది శాశ్వతం" అని ప్రతిచోటా చెప్పేవారు.
అలాగే ఈయన గొప్ప వారి కి లేఖలు రాయడం వారు తిరిగి జవాబు ఇవ్వడం తన జీవితంలో మరువలేని మధురానుభూతి అన్నారు.ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కి ఈయన లేఖలు రాయడం ఆయన జవాబీయడం మర్చిపోలేని అనుభూతి.గుజరాత్ భూకంపంగూర్చి ఈయన రాసిన లేఖ చదివి క్లింటన్ స్వయంగా గుజరాత్ వచ్చి వస్తువులు డబ్బు ఇంకా వారి కి కావలసిన పదార్ధాలు పంచడం అమెరికన్ ప్రెసిడెంట్ గా ఆయన గొప్పతనం గురించి ప్రశంసించారు.
ఒక రచయిత కావాలంటే బాగా పుస్తకాలు చదవాలి.కనీసంరోజుకి 10_12 గంటలు చదవాలి అని ఖచ్చితంగా చెప్పారు కుటుంబరావుగారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రోజూ అన్నేసి గంటలు చదువుతారని తెలుసుకున్న స్టాలిన్ ప్రత్యేకంగా రాధాకృష్ణన్ 
గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం ఆరోజుల్లో విశేషం.రష్యారాయబారిగా ఉన్నారు సర్వేపల్లి వారు.
ఇలా తుర్లపాటివారు ఎన్నో విషయాలను చెప్తుంటే ఇంకా ఇంకా వినాలని పించింది.రామారావుగారు చిన్న ప్రశ్నలతో విస్తృత సమాచారం రాబట్టారు.నిజంగా రేడియో వింటే చాలు 10 పుస్తకాలు చదివినంత సమాచారం హాయిగా వీనులవిందు చేస్తుంది 🌷

కామెంట్‌లు