కిరణాల తాకిడికి
శిఖరాలు కనకమై..
తుహినాలు కరిగి
కాంచనధారలై పోగా...
గగనాన వర్ణాలు
అలవోకగ మారుతూ
ఆనంద తాండవమాడుతూ
దినకరుని ఆగమింప...
మంచు దుప్పటి కప్పి
మగతనిదర పోతున్న
భువిని మేలుకొలుప
భూపాలమాలపించె నింగి
తనలోని హిమగిరిని
కనక వేదిక చేసి రవిని
కమనీయముగ వేంచేపు చేయ
రెప్పవేయక వేచె సరోవరము..
అపురూప దృశ్యమేదో
అవనిపై అగుపింపబోవునని
ఆతురముగ వీక్షింప కాంక్షించి
ఆత్మీయు రాకకై నిరీక్షించె జగతి
అద్భుతముగ అరుదెంచి
అవిరామ సేమమును అందించి
అలుపులేక ఆదరము పంచు
ఆదిత్యుని రాక ప్రకృతికి పండుగ
మనుషులలో మంచిని పెంచి
మానవత్వ పరిమళము పంచి
మదిని మాధవ మందిరము చేసి
మనిషిలో మనసు ఉనికి గుర్తు చేయు
విలువైన వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి