న్యాయాలు-581
పతింవరా న్యాయము
*****
పతింవరా అనగా స్వయంగా భర్తను వరించు కన్య లేదా యువతి అని అర్థము.
ఇందులో మూడు రకాల స్వయంవరాలు ఉంటాయి.1.స్వయంవరంలో ఏ కన్య అయినా అల్పులను త్రోసిరాజని తనకు ఈడు జోడయ్యే శ్రేష్ఠ పురుషుడినే వరించడం.2. గుణాగుణ విచారము పక్కకు పెట్టి స్వయంవరంలో తాను ప్రేమించిన యువకుడినే వరించడం.3.ఉంకువలతో నుండు స్వయంవరములందు నెగ్గిన రాకుమారుడు ఎట్టి వాడైనా కన్య అతడినే భర్తగా స్వీకరించాలి. అంటే తమ తల్లిదండ్రుల పెట్టిన వివిధ పోటీల్లో, పరీక్షల్లో నెగ్గిన వరుడిని వివాహం చేసుకోవడం. పై మూడు విధాలుగా కన్యక భర్తను పొందుతుందని అర్థము.
అనగా ఒక యువతి లేదా కన్యక వివాహం పై మూడు విధాలలో ఏదో ఒక రూపంలో జరుగుతుందనేది మనకు అర్థమై పోయింది కదా! అయితే వాటిని గురించి కొన్ని విశేషాలు విషయాలను తెలుసుకుందామా!
పై విధంగా పెళ్లి కుమార్తెలు వరుణ్ణి స్వయంవరం పేరుతో ఎంచుకుంటారు.మరి ఈ మూడు రకాల పద్ధతులను ఏమంటారో చూద్దామా.1. ఇచ్ఛా స్వయంవరం.2.సవ్యవస్థా స్వయంవరం 3.శౌర్య శుల్క/ వీర శుల్క స్వయంవరం అనేవి.
ఇచ్ఛా స్వయంవరం అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కన్యక లేదా పెళ్లి కూతురు తనకు నచ్చిన వరుడిని అంటే తనకు ఈడు జోడుగా అనిపించడమే కాకుండా అందరి దృష్టిలోనూ శ్రేష్ఠమైన వాడుగా పేరు పొందిన వ్యక్తిని వరించి వివాహం చేసుకోవడం. దీనికి ఓ మంచి ఉదాహరణ నల దమయంతుల వివాహం. అదెలానో చూద్దామా.
దేవ హంస ద్వారా దమయంతి యొక్క అపూర్వమైన, అద్భుతమైన అందచందాల గురించి తెలుసుకుంటాడు.అలాగే ఆ దేవ హంస ద్వారా దమయంతి నలుని గొప్ప తనం గురించి తెలుసుకుంటుంది. ఈ సంభాషణను విన్న దమయంతి తండ్రి స్వయంవరం ప్రకటించి అందరికీ వర్తమానం పంపుతాడు.
స్వయంవరం ప్రకటన విని బయలు దేరిన నలుడికి యముడు, వరుణుడు, అగ్ని,వాయువు దేవతలు ఎదురై తమలో ఒకరిని వరించేలా దమయంతిని ఒప్పించమని అడుగుతారు.అంతే కాకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించేందుకు అదృశ్య రూపములో వెళ్ళే శక్తిని ఇస్తారు. నలుడు తన కోరికను పక్కకు పెట్టి వారి కోరిక తీర్చేందుకు దమయంతి ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశించి విషయం చెబుతాడు. వారు దేవతలు వారిని వరిస్తేనే జీవితం సుఖమయం అవుతుంది అని నచ్చ చెబుతాడు. వారిని స్వయంవరానికి రమ్మని ఆహ్వానిస్తూనే తాను నలుడినే వివాహం చేసుకుంటానని చెప్పి పంపుతుంది.
స్వయంవరంలో మమ్మల్ని ఎలా వరించదో చూస్తామంటూ వచ్చిన ఆ నలుగురు అచ్చంగా నలుని రూపంలో నలుని పక్క నిలబడతారు.ఐదుగురూ ఒకే విధంగా ఉండటంతో దమయంతికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే ముక్కోటి దేవతలను మదిలో తలుచుకుని తాను ప్రేమించిన నలుడిని గుర్తు పట్టేలా చేయమని వేసుకుంటుంది.దేవతలు కరుణిస్తారు.అసలైన నలుడిని గుర్తించి వివాహం చేసుకుంటుంది.
ఇక రెండవది సావ్యవస్థా స్వయంవరం.అంటే ఆమె ఆ యువతి.ఆమె తనకు నచ్చిన,మెచ్చిన యువకుడిని వరించి చేసుకోవడం.ఇక్కడ పెద్దల అభిప్రాయాలకూ,అతడి గుణగణాలకూ, పూర్వాపరాలకూ ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రేమ పేరుతో వివాహం చేసుకోవడం.దీనికి చక్కని ఉదాహరణ "శకుంతల పరిణయం". దుష్యంతుడు వేట కోసం వెళ్ళడం. కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలను చూడటం.ఇరువురూ ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని గాంధర్వ వివాహం చేసుకోవడం. ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతలోపాఖ్యానం పేరుతో ఉన్నది.
ఇక మూడవది "శౌర్య/ వీర్య శుల్క స్వయంవరం". దీనికి ఉదాహరణలుగా"సీతా కళ్యాణం". "ద్రౌపది కల్యాణము"లను చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనకుడు శివధనస్సు విరిచిన వాడికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని అంటాడు.అతడు కోరిన శుల్కం ఏమిటంటే శివ ధనుస్సు ఎక్కుపెట్టడం.శివ ధనుస్సు విరిచిన రాముడు వెంటనే వివాహానికి అంగీకారం తెలుపడు.తన తండ్రి దశరథ మహారాజు అనుమతి కావాలని అంటాడు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది.
ఇక ద్రౌపది వివాహం. ద్రపద మహారాజు అర్జునుడు మాత్రమే ఛేదించగలిగిన మత్స్య యంత్రాన్ని తయారు చేస్తాడు.అది ఛేదించిన వాడికే ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటిస్తాడు.ఆ విధంగానే అర్జునుడు ఆ స్వయంవరానికి వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపడతారు.
ఇలాంటి వివాహాలు పూర్వకాలంలో రాజుల కాలంలో వుండేవి.వివిధ దేశాల రాజ కుమారులను స్వయంవరానికి పిలిచి వారికి రకరకాల పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన యువరాజుకు తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేవారు.
ఇవండీ! "పతింవరా న్యాయము" లోని విశేషాలు విషయాలు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు మాత్రం ప్రేమ పేరుతో తల్లిదండ్రులను ఎదిరించి నచ్చిన వ్యక్తి అంటూ పూర్వాపరాలు ఏమీ తెలుసుకోకుండా వివాహం చేసుకోవడం.ఆ తర్వాత అనేక రకాల యిబ్బందులు పడటం చూస్తున్నాం. తమను ఇన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్ళి చేసుకోవడం కాకుండా ఒప్పించి వివాహం చేసుకుంటే ఆ జంటతో పాటు ఇరు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఇది నేటి యువత గ్రహించాలి.అలాగే మొండి పట్టుదలలకు పోకుండా తమ పిల్లలు చేసేది మంచిదైతే మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అప్పుడే పరువు హత్యలు, బలవన్మరణాల వంటివి లేకుండా ఉంటాయి. అంతే కదండీ!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి