సుప్రభాత కవిత ;-బృంద
వేగంగా దూకే జలపాతాల
సవ్వడెంత మధురమో!
కొండరాళ్ళ జారే సెలయేటి
సందడెంత సుందరమో!

మిసిమి జిలుగుల మెరుపుతో
పసిమి కళల వెలుగుతో
ముసి ముసి నవ్వులతో
పరచుకున్న పచ్చికదెంత ముచ్చటో!

గుబురుగా గుమిగూడి
గుసగుసలు పంచుతూ
గుత్తులుగా  విరబూసే
గుబురు పొదలదెంత సొగసో!

పరవశించి ఆడిపాడే 
పసిపిల్లలంటి నవ్వులతో
ప్రభువు వచ్చే త్రోవలో
పరుగులిడు మబ్బులదెంత సంబరమో!

అన్నలాగా అదిలిస్తూ
నాన్నలాగ మందలిస్తూ
తాతలాగ నవ్వుతూ హాయిగా చూస్తున్న తరువుదెంత భాగ్యమో!

ఇన్ని సొగసుల ఉనికితో
దివిని పోలిన సౌఖ్యమిచ్చి
ఇంపుగా ఇలను మార్చి
మనకిచ్చిన దైవానిదెంత కరుణో!

అందరికీ మిత్రుడై
అంతర్యామి తానై
అరుదెంచు ఆదిత్యుని
ఆగమనమెంత అద్భుతమో!

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు