సుప్రభాత కవిత ; - బృంద
తూరుపు వాకిట ఎరుపు
తాకిన చోట మెరుపు
చీకటులన్నీ చెరుపు
లోకానికి మేలుకొలుపు

సాగర గర్భాన దాగి
అంబర మార్గాన సాగి
బంగరు రంగులు పరచి
సంబరమెంతో  పంచే బింబం

అలల అంజలి చూసి
కనుల వెలుగులు నింపి
మిసిమి సొగసులు అద్ది
కిరణపు చేతిని సాచే వైనం

ఉషోదయ తరుణాన
ఆశల ఆరాటం పెంచి
పోరాడే ధైర్యం ఇచ్చే
అవకాశపు వరప్రసాదం

అన్నీ తెలిసిన అంతర్యామి
అవసరమేదో ఎరిగిన స్వామి
అదును చూసి అందించే తీరును
అరుదైన తనదైన తీరున అనుగ్రహం

బాటను నడిచే ఓర్పు
మాటలు మీరని నేర్పు
ఓటమి ఒప్పుకోని కూర్పు
పాటిస్తే ...కలుగును మార్పు

నిత్యం  నిండుగ పుట్టి
ముత్యంలా వెలుగులు పరచే
సత్యమై కనుల ముందు నిలిచే
అత్యంత అద్భుతమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు