సుప్రభాత కవిత ; బృంద
పొంగీ పొంగీ కెరటాలు
నింగిని తాకే చిత్రాలు
వంగీ వంగీ జలదాలు
అలలుగ మారిన వైనాలు

ఉదయ రాగాలు వింటూ
వెలుగు తానాలు చేసి
జగానికి మేలుకొలుపుగా
గగనానికెగసె విహంగము

కరగని దూరపు తీరాన
కదలని కొండల మధ్యన
వదలక రోజూ కనువిందుగ
విరిసే కాంచన పుష్పం.

సయ్యాటలాడే తరంగాలపై
ఊయలూగే నురగల నాట్యం
వేచి చూచు సైకత వేదిక
ఆపలేదు అరక్షణమైనా!

ఓపలేని వేగంగా వచ్చే అల
ఆపలేక దీనంగా చూసే శిల
కలలకీ ...వాస్తవాలకూ మధ్య
పరుగులు తీసే కాలగమనం.

అందినవి అనుభవించేలోపే
అంతర్ధానమయే వింత
అనుకోని తీరాల వేటకు
అల్లిన క్షణాల వలే జీవితం!

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు