సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు -578
నిర్వ్యాపారాంబష్ట న్యాయము
******
నిర్వ్యాపారం అనగా సుఖ దుఃఖాల గురించి ఆలోచన గాని,కష్ట నష్టాల గురించి భయం ,బాధ గానీ,అవి రాకూడదనే కోరిక గాని లేకుండా ఉండటము.అంబష్టం అంటే అడవి మల్లె అని అర్థము.
 ఎలాంటి కోరికలు, ఆలోచనలు,ఆశలు  లేకుండా అడవి మల్లెలా పుష్పించి పరిమళాలు వెదజల్లడం అని అర్థము.
 నిర్వ్యాపారము అనగానే అన్నీ  వదిలేసుకోవడం, లేదా అన్నీ వదిలేయడం అనే అర్థం ఉన్నప్పటికీ  అది సాధ్యం కాదనే చెప్పాలి.ఎందుకంటే  ఎవరు కూడా ఎలాంటి కర్మలు చేయకుండా వుండరు.ఏ పనీ చేయని సోమరిలో కూడా ఆలోచనల వ్యాపారం నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.
కాబట్టి నిర్వ్యాపారం అనేది అడవి మల్లెలా గుబాళిస్తూ వుండాలనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఎవరో వస్తారు తన పరిమళాలను ఆఘ్రాణిస్తారని కాకుండా తనదైన ధర్మంగా పుష్పించి గుబాళిస్తుంది .
అలాగే వ్యక్తి కూడా అడవి మల్లెలా ఉండటం అంటే తమ పనులు తాము సక్రమంగా నిర్వహిస్తూ, ధర్మ సూత్రాలు పాటిస్తూ ఈ సమాజంలో తనదైన అస్తిత్వాన్ని నిలుపుకోవడం. 
దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మనిషికి ఏఏ సుఖాలు మొదట సంతోషం, సుఖాన్ని కలిగించి ఆ తర్వాత దుఃఖంగా, భారంగా మార్చుతాయో వాటిని వదిలేసి ప్రశాంతంగా గడపమని చెప్పడం.
ముఖ్యంగా త్రిగుణాలకు,వాటి కార్య రూపములైన శరీర , ఇంద్రియ,అంతఃకరణ వ్యాపారములలో చాలా వరకు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఏ మాత్రం చలించకుండా త్రిగుణాతీతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
 ఇదంతా మనల్ని ఒకింత అయోమయ స్థితిలో పడేసినా అసలు విషయం ఏమిటంటే  మనిషి అన్న తర్వాత నిర్వ్యాపారంగా వుండకుండా  ఉత్తమోత్తమమైన మానవ జన్మ ఎత్తిన మనం మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అదెలాగో మనందరికీ తెలిసిందే మనతో పాటు మౌనంగా జీవించే మొక్క ఊరికే ఉండదు ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి ఓ పూల మొక్కగానో పండ్ల చెట్టుగానో, నీడ నిచ్చే వృక్షంగానో ఎదిగి తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటుంది.
 మరి మనము స్తబ్దత, స్వార్థంతో వుండకుండా  జీవన భృతి కోసం ఏదో ఒక గౌరవప్రదమైన వృత్తిని చేపట్టి , ఆనందంగా జీవించటంతో పాటు సాటి వారికి చేతనైన సాయం చేయడం  వల్ల జీవితాన్ని  సార్థకం చేసుకోవాలని చెప్పడమే ఈ "నిర్వ్యాపారాంబష్ట న్యాయము"లోని అంతరార్థము.అది గ్రహించి ఆ విధంగా జీవన ప్రయాణం చేస్తూ బతుకును చరితామృతం చేసుకుందాం.

కామెంట్‌లు