న్యాయాలు -588
పర్వతాధిత్యకా న్యాయము
******
పర్వతం అనగా భూమి మీద రాళ్ళతో నిండిన ఎత్తైన ప్రదేశం.కొండ,గిరి, పుడమి తాల్పు,మహీధరం,అచలం,అద్రి,అవనీధరం,శైలం అనే పర్యాయ పదాలు ఉన్నాయి.ఆధిత్యకా అనగా పర్వతం యొక్క ఉపరిభాగము లేదా పర్వతోపరిభాగము, ఆధిపత్యం ,అని అర్థము.
పర్వతాధిత్యకా అనగా పర్వతము యొక్క ఉపరిభాగము లేదా పర్వతం యొక్క ఆధిక్యతా/ ఆధిపత్య ఫలితం.
ఇక పర్వతాల గురించి కొన్ని విశేషాలూ విషయాలను తెలుసుకుందామా...
పర్వతము అనగా భూతలంపై అతి ఎత్తుగా చొచ్చుకొని వచ్చిన భూభాగం అని చెప్పవచ్చు.ఎత్తైన దాని శిఖరమే పర్వత శిఖరము.ఇది దూరం నుంచి మనకు తలెత్తుకుని సగర్వంగా నిలబడ్డట్లు కనిపిస్తుంది కదా!
అలాంటి పర్వతాల గురించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది.అదేమిటో చూద్దాం.
పూర్వం కుల పర్వతాలు లేదా కుల శైలాలు అనేవి వుండేవి.వీటినే కులాచలములు అని కూడా అంటారు.అవి ఏడు వుండేవి.వాటిని సప్త కుల పర్వతాలు అంటారు.భరత వర్షానికి సంబంధించిన మహేంద్రగిరి,మలయగిరి, సహ్యాద్రి,శుక్తిమాన్,ఋక్ష పర్వతం, వింధ్య పర్వతం,పారియాత్ర పర్వతాలు.అయితే ఒకప్పుడు పర్వతాలు అన్నింటికీ రెక్కలు ఉండేవట.అవి ఎటు పడితే అటు స్వేచ్ఛగా ఎగురుతూ జనావాసాల మీద వాలుతూ ఉంటే జనమంతా వాటికింద పడి నలిగి చనిపోతూ ఉండేవారట.
ఈ విధంగా జరుగుతున్న జన హననాన్ని నిరోధించడానికి,వాటి అహంకార పూరిత ప్రవర్తనను అణచడానికి ఇంద్రుడు 'శతధార'( నూరు పదునైన అంచులు కలిగినది) గా పేరొందిన తన వజ్రాయుధం తో ఆ పర్వతాల రెక్కలు నరికాడట.దాంతో ఆ పర్వతాలు ఇక ఎగరలేక ఉన్న చోటే పాతుకుపోయి అచలాలు ( కదలిక లేనివి) అయ్యాయట.ఎవో కొన్ని పర్వతాలు చేసిన తప్పిదానికి అన్ని పర్వతాలకు రెక్కలు లేకుండా పోయాయన్న మాట.
అయితే ఆధిక్యత, ఆధిపత్యం,అధిక స్వేచ్ఛ అనేవి గర్వానికి, అహంకారానికి చిహ్నాలని మనందరికీ తెలిసిందే కదా.అవి ఎప్పటికైనా భంగపడక తప్పదు అనేదే ఈ "పర్వతాధిక్యా న్యాయము"లోని అంతరార్థము.
ఎలాగూ పర్వతాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి గర్వభంగమైన వింధ్య పర్వత కథను కూడా తెలుసుకుందాం.
మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణుల్లో వింధ్య పర్వత శ్రేణులు ప్రసిద్ధి చెందినవి. ఇవి మన దేశాన్ని ఉత్తర దక్షిణ భారత దేశాలుగా విడదీసినట్లు మధ్యలో ఉంటాయి.ఈ పర్వత శిఖరాలు గాలి దూరనంతగా,ఈగను కూడా దాటనివ్వనంతగా ఎత్తుగా అడ్డుగోడలా వుంటాయి.
అలాంటి వింధ్య పర్వతానికి నేనే గొప్ప నన్ను మించిన వారు లేరనే గర్వం ఏర్పడింది.నిరంతరం మేరు పర్వతం చుట్టూ తిరిగే సూర్యుడిని చూసి మనసులో కోపగించుకుంటూ ఓ రోజు సూర్యుడు విధులు నిర్వహించుకుని వెళ్తున్న సమయంలో పిలిచి తన చుట్టూ ఎందుకు తిరగడం లేదని అడుగుతుంది.వింధ్య పర్వతం వేసిన ప్రశ్నకు బ్రహ్మ ఆజ్ఞతో లోకరీతిని అనుసరించి వెలుగు నీడలను అందిస్తున్నాను.ఇందులో ఎలాంటి తేడా వచ్చినా జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది.అంటూ ఎంతో వివరంగా విషయం చెబుతాడు.
అయినా ఆ మాటలేవీ వినకుండా, పట్టించుకోకుండా నేను ఎంతో ఉన్నతమైన శిఖరాన్ని.రేపటి నుండి నా చుట్టూ తిరగాల్సిందేనని ఆదేశిస్తుంది.ఆ మాటలకు "మేరు పర్వతమే మహోన్నతమైనది. సృష్టి ఆదేశం కూడా ఆ పర్వతం చుట్టూ తిరగమనే వుంది. కాబట్టి నేనేమీ చేయలేను" అని చెప్పి వెళ్ళిపోయాడా సూర్యుడు.
ఆ మాటలకు వింధ్య పర్వతం అహం దెబ్బతింటుంది. వెంటనే తన ఆకారాన్ని అంతకంతకూ పెంచసాగింది. ఆకాశం అంచుల దాకా పెరిగిన వింధ్య పర్వత శిఖరంతో లోకమంతా అల్లకల్లోలం అయ్యింది. సూర్య చంద్రులు గతులు తప్పినవి. అంధకారం నెలకొంది వింధ్య పర్వత బరువుకు భూలోకం కృంగిపోసాగింది.
ఈ ప్రళయాన్ని ఆపడం ఒక్క అగస్త్య మహర్షికే సాధ్యమని ఇంద్రాది దేవతలు అగస్త్యుడి చెంతకు చేరుకుని విషయం చెప్పారు.
వారికి అభయం ఇచ్చి వెంటనే అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వత శ్రేణులు చేరుకున్నాడు.అగస్త్య మహామునిని చూసి వింధ్య పర్వతం ఎంతో సంతోషించి మీ రాక నాకెంతో ఆనందాన్ని, జన్మ ధన్యత కలిగించింది. నేను ఏం సేవ చేయాలో సెలవివ్వండి అంటుంది.
ఆ మాటలకు అగస్త్యుడు నేను ఓ ముఖ్యమైన పని మీద దక్షిణ దిశగా వెళ్తున్నాను.మరి నేను వెళ్ళేందుకు వీలు లేకుండా దారికి అడ్డంగా వున్నావు.నీవు కొంచెం తలవంచుకుని వున్నావంటే నేను ఎలాంటి యిబ్బంది లేకుండా అవతలి వైపునకు వెళ్ళగలను." అంటాడా మునీశ్వరుడు.అలాగే నంటూ తలవంచుకున్న వింధ్యను చూస్తూ మరి ఏ క్షణాన తిరిగి వస్తానో తెలియదు కాబట్టి నీవు నేను వచ్చేంతవరకూ అలాగే వుంటే నా ప్రయాణం త్వరగా పూర్తి చేసుకోగలను" అన్న మాటకు కట్టుబడి అలాగే వుండి పోతుంది.
దక్షిణ భారత దేశం వెళ్ళిన అగస్త్యుడు తిరిగి రాకుండా అక్కడే వుండటం, వింధ్య పర్వతం ఎదురు చూస్తూ ఇచ్చిన మాట కోసం తలవంచుకుని అలాగే వుండి పోయిందట.ఈ విధంగా వింధ్య పర్వతానికి గర్వభంగం అవుతుంది.
దీనిని బట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వినయ విధేయతలు మంచితనంతో ఏదైనా సాధించవచ్చు కానీ గర్వం, అధిపత్యం అనేవి ఎప్పటికైనా ఎవరికైనా ముప్పు తెస్తాయి. కాబట్టి అలాంటి వాటిని మనసులోకి రానీయకుండా ఆమడ దూరంలో ఉంచాలి.అందరితో మంచిగా మెలగాలి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి