'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
=======================================
క్రొత్త వృత్తములు.
=============
76.
మౌక్తికమాలా - భ, త, న, గ, గ.
యతి  - 7.
నీదయ నే కోరి నిలిచి యుంటిన్
కాదనకయ్యా!ఖగపతి రావా!
వేదన తీర్పంగవిభుడవే నీ
పాదములేదిక్కు వరద!కృష్ణా!//
77.
సత్యవతీ  - భ, త, త, గ, గ.
యతి -8.
బాలను నన్నేలవా!భాగ్యదాతా!
కాలము నీవే నిరాకారమూర్తీ!
జాలము లేలా? సుధాసారదీప్తీ!
పాలన సేయంగ రావయ్య!కృష్ణా!//

78.
లక్షణ లీల  - భ, త, మ, గ, గ.
యతి  - 8.
భారము నీదే ప్రభూ!వైభోగంబుల్
కోరను స్వామీ!ననున్ ఘోరంబౌ సం
సారపయోధిన్ క్రమించంగన్ తోడై
ధీరతనీవా!హరీ!దేవా!కృష్ణా!//

79.
నభో - భ, న, భ, గ, గ.
యతి - 7.
జీవన మొసగు చిన్మయరూపా!
మావగ కనుము మాధవుడా!మా 
సేవలు కొనుము శ్రీకర!మమ్మున్ 
బ్రోవుచు నిడుము ముక్తిని కృష్ణా!//
80.
తోవకము - భ, భ, భ, గ, గ.
యతి  - 7.
సన్నుతి జేయుచు సారెకు దల్తున్.
సన్నిధి సేవకు సమ్మతి నీవా!
పున్నెము నిచ్చెడి పూజ్యుడవీవే!
మన్నన సేయుము మాధవ కృష్ణా!//

కామెంట్‌లు