సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -600
పూతి కూశ్మాండ న్యాయము
*****
పూతి అనగా మురిగిపోయిన, చెడిపోయిన,కూశ్మాండ  (కూష్మాండ) అనగా గుమ్మడి కాయ అని అర్థము.
చెడిపోయిన లేదా మురిగి పోయిన గుమ్మడి  కాయ వలె అంటే  గుమ్మడి కాయ ఒకోసారి  తొడిమ ఊడి మురిగిపోతుంది.అలాంటి దాని వల్ల మనకెలాంటి ఉపయోగం ఉండదని అర్థము.
గుమ్మడి కాయ అనగానే గృహ ప్రవేశ సమయంలో ఇంటి ముందు కొట్టే గుమ్మడి కాయ, దృష్టి దోష నివారణకు గుమ్మానికి ఉట్టిలో వేలాడ దీసే గుమ్మడి కాయ, నవరాత్రులలో కూష్మాండ దేవి అమ్మవారినైవేద్యంగా,బతుకమ్మ పండుగ సమయంలో పవిత్రంగా పెట్టే గుమ్మడి పూవు గౌరమ్మ కళ్ళముందు మెదులుతాయి. మరి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా... 
 భారత దేశంలో చరిత్ర పూర్వ యుగముల నుండి గుమ్మడిని పండించడం వుంది. ఎండిపోయిన గుమ్మడి పండ్లు తేలికగా వుండటం వల్ల నీటిలో తేలుతూ మహా సముద్రాలపై పయనించి సుమారుగా పదివేల సంవత్సరాల క్రితమే ఉభయ అమెరికా ఖండాల నుండి ఇతర ఖండాలకు  వ్యాపించాయని,అక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఇవి మొలకెత్తి విశ్వ వ్యాప్తం అయ్యాయని శాస్త్రజ్ఞుల శోధనలో తేలింది.
అందుకే కాబోలు అమెరికాలో గుమ్మడి కాయకు సంబంధించి "పంప్కిన్ ఫెస్టివల్" పేరుతో పెద్ద ఎత్తున ఒక పండుగే జరుపుకుంటారు.
 ఇక గుమ్మడి తీగ చూడటానికి సన్నగా ఉంటుంది కానీ బరువైన గుమ్మడి కాయలను మోస్తుంది. అది చూసే మన పెద్దలు "తీగకు కాయ భారమా- తల్లికి బిడ్డ భారమా" అంటుంటారు. అంతే కాదు బొద్దుగా ముద్దుగా ఉన్న పసిబిడ్డను 'గుమ్మడి పండులా' ఉందంటారు. ఇక సామెతల విషయానికి వస్తే "గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు" అని, "కడివెడంత గుమ్మడి కాయ కత్తి పీటకు లోకువ" అనీ, పాటల్లో  "వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి", "ఓ లచ్చా గుమ్మడి "అనేవి మనం నిత్య జీవితంలో వింటూనే ఉంటాం.
 గుమ్మడి పండు,కాయలతో పాటు వాటి లేత ఆకులు,కాండం, పూలు, గింజలు మొత్తంగా అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. మల బద్ధకం మొదలుకొని మధుమేహ నివారణకు కూడా ఉపయోగపడే గుణాలు ఉన్నాయి.వీటిని ఆయుర్వేద వైద్యులు అనేక రకాల అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగిస్తారు.
ఇక విషయానికి వస్తే  ఇన్ని ఔషధ గుణాలు, మానవాళికి రకరకాలుగా ఉపయోగపడే లక్షణాలు ఎన్ని ఉన్నా గుమ్మడి కాయ మురిగి లేదా కుళ్ళిపోతే  దాని వల్ల  వచ్చే వాసన వల్ల కొంత అనారోగ్యం శ్వాసకోశ  సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి.
 మరి ఈ "పూతి కూశ్మాండ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెప్పడంలో అంతరార్థం ఏమిటో చూద్దాం. గుమ్మడి కాయ తొడిమ ఊడనంత వరకు,చెడిపోనంత వరకు ఎంతో మేలు చేస్తుంది.అలాగే మనం మనసా వాచా కర్మణా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకే సాటి వారికి,సమాజానికి చేతనైనంత సహాయం చేయగలం.ఈ ఆరోగ్యాలు పాడైపోతే  ఏమీ చేయలేము.కాబట్టి మనం మన వీటన్నింటికీ  మూలమైన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.ఒకోసారి శారీరక ఆరోగ్యం మన చేతుల్లో లేకపోయినా గుమ్మడి కాయలోని గింజలు మళ్ళీ మొలకెత్తినట్లు మనసా వాచా కర్మణా మనం చేసిన మంచి పనులే ఆదర్శమవుతాయి.పరంపరగా తరాలకు ఆచరణీయమై  కొనసాగుతూనే వుంటాయి.అప్పుడు మనం పుణ్య కూష్మాండాలమై  గౌరవ మర్యాదలు అందుకోగలం.

కామెంట్‌లు