సుప్రభాత కవిత ; - బృంద
మంచి ముత్యాలు పొదిగిన
కనక కిరీటం వంటి
తుహినగిరి శిఖరాలు
గంభీరంగా అమరగా.......

దివిజ గంగ దిగివచ్చి
గిరుల లోయల జాలువారే 
జలధారల అలరారు హిమనగాలు  సిగలోన ఊగేటి మల్లెమాలైపోగా

పరమశివుడు  ప్రత్యక్షంగా
యుగాలనుండీ జగాన నిలిచి
పవిత్ర భూమిగ భారతాన్ని
నిలిపిన వారణాసి కంఠాభరణంలా..

మానవుడిగ పుట్టి
మాధవుడిగా సేవలందే
రామయ్య పుట్టిన అయోధ్య
రొమ్ముపై వెలుగొందు కౌస్తుభంలా...

అల వైకుంఠము వీడి విష్ణువు
ఇలపైన కొలువుండి వెంకన్నగ
ఇలవేలుపుగా తెలుగునాట
వెలసిన తిరుమల...  వడ్డాణంలా...

ఆది అంతం ఎరుగని 
అంతర్యామి లింగమై వెలిసి
అంతరంగాన్ని ప్రశ్నించుకోమన్న
అరుణాచలంలా  కరుణ కురిపిస్తూ

ఆగమవిధులన్ని అలవాటుగా
విధించి అందరిని ఒక్కటిగ చేసే
ఆదిగురువుగ శంకరులు ఆగమించిన 
పచ్చని కేరళ పట్టుపుట్టంలా కట్టి

ఆధ్యాత్మిక జ్ఞానమొసగి
సనాతనమైన జీవనరీతుల
శతాబ్దముల కిందటే నేర్పి
జగద్గురువుగా  వెలుగు రత్నగర్భ!!

ఎందరు దొంగలు కొల్లగొట్టినా
ఎవరూ పొందలేని స్వర్గం
నా కర్మభూమి నా జన్మభూమి
భారతదేశమని గర్వంగా చెబుతూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు