రసాస్వాదన;- - యామిజాల జగదీశ్

 ఆస్వాదించడం అనేది జీవితంలో ఓ భాగం. మనం రోడ్డు పక్కన నిల్చున్నప్పుడు మన పక్కనే ఆగిన కారులోంచి ఓ చిన్నారి మన వంక చూస్తూ చేయి ఊపుతూ నవ్వే నవ్వుని ఆస్వాదించని మనసుంటుందా. అలా నవ్వేటప్పుడు మనసు వికసిస్తుంది. కానీ సిగ్నల్ సెకండ్ల వంకే చురచురాచూసేవారే ఎక్కువ. ఇక అటువంటి వారు దేనిని ఆస్వాదించగలరు. మన చుట్టూ వారిలో కొందరు ప్రతి దానినీ ఆస్వాదించగలరు. అలాటి వారిని నేనెరుగుదును. కానీ చాలా మంది తాము చేస్తున్న పనినీ అదేదో శిక్షలా భావించి చేస్తుంటే వారికి ఆనందమెక్కడుంటుంది.
నా మిత్రుడొకడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. ఉదయం అయిదు గంటల సమయం. అన్నా అరివాలయం అనేది డిఎంకె పార్టీ కార్యాలయం. అక్కడికెళ్ళేసరికే ఏర్పాట్లు చకచకమని జరుగుతున్నాయి. అయిదున్నరకు వస్తారనుకున్న కరుణానిధి అయిదుంపావుకే వచ్చేసారు, ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి మిత్రుడు పరుగెత్తగా వెనకాతల కెమేరామాన్ పరుగులు తీస్తున్నాడు. కరుణానిధి ఆ సమయంలో అరివాలయం ఆవరణలో వాకింగ్ చేయడం అలవాటు. ఆ సమయంలో అనేకసార్లు నేనాయనను చూశానుకూడా. ఎందుకంటే ఆ ఆవరణలోనే అప్పట్లో నేను పని చేసిన సన్ టీవీ కార్యాలయం ఉండేది. ఆ వాకింగ్ సమయంలో ఆయన వెంట తోక ఊపుతూ కుక్కొకటి. ఆ కుక్కపిల్లకు బిస్కెట్ వేయడం మొదలుకుని, అక్కడున్న చెట్టు కదలికలు వరకూ ఆయన ప్రతి అంశాన్ని ఓవైపు ఆస్వాదిస్తూనే నా మిత్రుడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓ సీతాకోకచిలుక ఎగురుతూ ఓ పువ్వుపైన వాలిన దృశ్యాన్ని చూసి ఆయన ఆస్వాదించడం గమనించిన మిత్రుడికి ఆనందం. ఈ రసాస్వాదనే ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ అది చాలా మందిలో లేదు.
టీ.నగర్లో ఓ టీకొట్టు ఉంది. అటువైపుగా వెళ్ళినప్పుడు మిత్రులతో కలిసి వెళ్ళి అక్కడ టీ తాగడం అలవాటు. ఇష్టం కూడాను. నేను ఆ కొట్టు వాకిట్లో అడుగుపెడుతుంటేనే ఆ కొట్టు టీ మాష్టర్ రండి సార్ రండి, అంటూ ఒక గ్లాసుపైకెత్తి ఇంకొక గ్లాసులోకి టీ పోసే తీరు చూసితీరాల్సిందే. టీకొట్టలో ఇది చాలా సాధారణ దృశ్యం. కానీ బలే ఆశ్చర్యంగా ఉంటుంది ఓ గ్లాసులోంచి ఇంకొక గ్లాసులో టీ పొయ్యడం అనేది. అది చూసి ఆస్వాదించవలసిన, ఆశ్చర్యపడాల్సిన విషయం. కానీ మనలో చాలా మంది టీకొట్లోకి వెళ్ళడంతోనే ఓ టీ ఇవ్వు అని అడిగి సెల్ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాం. టీ ఇచ్చే మాష్టారు వంక ఓ చిన్న నవ్వు కూడా చిందించక ఓ హృదయంలో చోటు సంపాదించే అవకాశాన్ని కోల్పోతుంటాం.
అందుకే అడగాలనిపిస్తుంది, మీ పెదవులు చివరిసారిగా నవ్వాయో గుర్తుందా అని సెల్ పోన్ కి అత్తుకుపోయేవారిని చూస్తే.

కామెంట్‌లు