న్యాయాలు -601
పృథివ్యోషధి న్యాయము
*****
పృథివి అనగా అవని, నేలతల్లి, భూమి. ఓషధి అనగా వనస్పతి( పూయకుండానే ఫలించు అడవి చెట్టు, చెట్టు,మందు అనే అర్థాలు ఉన్నాయి.
పృథివి యందే ఔషధాలు యిమిడి వున్నట్లు.అనగా ఈ భూమాతను ఎంత తవ్వినా విత్తనాలు వేయనవసరం లేకుండానే అచట ఏదో ఒక రకానికి చెందిన మొలకలు వస్తాయి అని అర్థము.
మనం ఎంతో గౌరవంగా భూమాత,నేలతల్లి,అవనమ్మ పిలుచుకునే పుడమి తల్లి సౌర కుటుంబంలోని గ్రహాల్లో ఒకటి. సూర్యుడి నుండి దూరంలో భూమి మూడో గ్రహం.మానవునికి తెలిసి జీవత్వం ఉన్న గ్రహం భూమి ఒక్కటే.ఈ భూమి జీవుల ఆవిర్భావానికి తోడ్పడే పర్యావరణాన్ని కలిగివున్నది.
మరి ఈ భూమి ఔషధాల నిధి అని చెప్పడానికి ముందు భూమి పుట్టుక గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చూద్దాం.
"ఆకాశాత్ వాయుః,వాయో రగ్నిః, అగ్నయోరాపః,,ఆపయోః పృథ్వీః, పృథ్వియోఃఓషధిః,ఓషధియోరన్నం,అన్నయోర్ జీవై సః,ఇతి క్రమశః"అనగా ఆకాశం నుండి శబ్ద స్పర్శ గుణాలున్న వాయువు పుట్టింది.(గాలి కంటికి కనిపించకపోయినా అది మనల్ని తాకడంతో గాలి యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది.)అలా వాయువు నుండి మహాతేజోతత్వమైన అగ్ని వచ్చింది.అగ్ని నుండి రస గుణం ఉన్న జలము పుట్టింది. నీటి నుండి భూమి ఏర్పడిందని అంటారు.
అయితే ఈ భూమికి శబ్ద స్పర్శ, రూప, రస గుణములతో పాటు గంధః అనగా వాసన గుణము కూడా ఉంది. ఈ భూమి నుండి ఏర్పడిన మొక్కలు, వృక్షాలు, పువ్వులు వాసన కలిగి ఉంటాయి.భూమి కూడా మంచి మట్టి వాసన కలిగి వుండటం మనకు తెలిసిందే.
పృథివ్యోషధి అనగా ఏమిటంటే భూమి నుంచే ఓషధులు ఉద్భవించాయని,ఈ ధరణి ఔషధాల గని చెప్పడమన్న మాట. ఇక్కడ ఓషధులు అంటే ఉషఃకాలంలో ఆహారం తయారు చేసుకునేవి.అనగా మొక్కలు,వృక్షాలు మొదలైనవి పుట్టాయి.ఈ ఓషధుల నుండే అన్నం వచ్చింది.అన్నమంటే ఇక్కడ బియ్యం ఉడికించి తినే అన్నం కాదు.అన్నమంటే ఆహారం. ఒక్కో ప్రాంతంలో, ఒక్కో దేశంలో ప్రజలు తినే ఆహారం వేరువేరు రూపాల్లో ఉంటుంది.అయితే దీనినే అన్నం అంటాం..
ఇలా ఓషధుల నుండే మంచి పంటలు, కాయలు, పండ్లు కూరగాయలు విత్తనాలు, ఆకులు, దుంపలు,తేనె.. ఇలా అనేక రకాలు వచ్చాయి.
"ఆకాశము, అగ్ని, వాయువు, జలము, పృథ్వీ... వీటిని పంచభూతాలు ఉంటామని మనందరికి తెలుసు. అయితే ఈ పృథ్వీ మిగిలిన నాలుగింటిని తనలో ఇముడ్చుకుంది.వీటి వల్లనే తాను పృథివ్యోషధి కాగలిగిందని పై విషయాల ద్వారా మనం గ్రహించవచ్చు.
మరి మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పడానికి కారణం మన శరీరం కూడా పంచభూతాల నిర్మితం. భూమి ఏవిధంగా మిగతా నాలుగు భూతాలతో ఔషధాల నిధి అయ్యిందో అలాగే మనమూ ఆ విధంగా మారాలి అని అర్థము.
అది సాధ్యమేనా అన్న సందేహం మస్తిష్కంలో ఉదయిస్తుంది. కానీ సాధ్యమే .సాధ్యమైతే ఎలా మళ్ళీ ఇంకో ప్రశ్న. మరి వీటికి సమాధానాలు చూద్దాం.పంచభూతాలను పంచేంద్రియాలుగా భావిద్దాం.అప్పుడిక జవాబు తేలిక అవుతుంది.
శబ్ద అంటే మాటలు.స్పర్శ అంటే ఆత్మీయంగా వెన్ను తట్టడం.కళ్ళల్లోంచి కరుణ రసం జాలువారడం.కనిపించే ఈ రూపం ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉండటం.సాటి వారిని చూసి సమయానుకూలంగా సానుభూతి సహానుభూతి లాంటి భావోద్వేగాలతో ఆకాశమంటి హృదయం స్పందించడం.వీటన్నిటితో పాటు మనలోని సద్గుణాల సౌరభంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిమళ భరితం చేయడం... ఇవన్నీ పంచభూతాల ప్రతీకలే. వీటి సమ్మేళనమే ఔషధీయ గుణాల నిలయం.
మరి పృథివికి ఈ భూమ్మీద నివసించే సమస్త జీవరాశిలో దేనికి ఏది కావాలో అది ఇవ్వడం తెలుసు.అలాగే మానవులుగా ఎవరికి ఏ సహాయం ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఇచ్చి "మానవ్యోషధి" అవుదాం. ఇదండీ మన పెద్దవాళ్ళు "పృథివ్యో షధి న్యాయము" చెప్పడంలో గల అంతర్యం .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి