ఎక్కువతక్కువలు;- - యామిజాల జగదీశ్
 ఓమారుభగవాన్ రమణమహర్షి ఓ చెట్టు కింద కూర్చుని తనను చూడటానికి వచ్చిన వారు ఆడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్తున్నారు.
చాలా మంది లాగే భగవాన్ దర్శనం కోసం ఓ విదేశీయుడుకూడా అక్కడికి వచ్చాడు. అయితే ఆయన మనలాగా నేల మీద కూర్చోలేక బయటకు వెళ్ళి ఒక కుర్చీని తీసుకొచ్చి అందులో కూర్చున్నాడు. ఆయనలా కూర్చున్న చోటు భగవాన్ రమణమహర్షి కన్నా ఒకింత ఎత్తయిన చోటు కావడం ఆశ్రమ నిర్వాహకులకు నచ్చలేదు. దాంతో వారు వెంటనే విదేశీయుడి వద్దకు వెళ్ళి ఇలా కూర్చోకూడదు అని చెప్పగా ఆయన కాస్తా బయటకు వెళ్ళిపోయాడు.
ఇదంతా గమనిస్తున్న భగవాన్ రమణమహర్షి ఏమిటైంది... ఆయనెందుకు వెళ్ళిపోయాడని అడగ్గా ఆశ్రమ నిర్వాహకులు ఇలా చెప్పారు...
" మీకన్నా ఎత్తయిన ప్రదేశంలోఅందులోనూ కుర్చీలో కూర్చోకూడదని మేం నెమ్మదిగానే చెప్పాం. కానీ మేమలా అనడంతో ఆయన బయటకు వెళ్ళిపోతారనుకోలేదు స్వామీ " అని.
అప్పుడు రమణమహర్షి చెట్టు మీద కూర్చున్న ఓ కోతిని చూపించి " అది కూడా నాకన్నా ఎత్తయిన చోట కదా ఉంది. ఇప్పుడు దాన్నేం చేస్తారు? " అని అంటూ "ఇందులో తక్కువేమిటీ ఎక్కువేమిటీ" అని చెప్పారు.
 
మహాత్ముల జీవనశైలి మనకందరికీ ఎప్పుడూ ఓ పాఠమే.
ఈ భూమ్మీద ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని వేరు చేసి చూడటం మహాపాపం అన్న ఓ కవి మాటలు గుర్తుకొచ్చాయి ఈ సందర్భంగా.

కామెంట్‌లు