సుప్రభాత కవిత ; -బృంద
రెక్కలు విప్పుతూ
చుక్కలు దాటాలని
దిక్కులు తాకాలని
ఒక్కటే గమ్యం విహంగాలకు

తూరుపు ఎర్రబడగానే
మార్పులెన్నో లోకంలో
చేర్పులెన్నో బ్రతుకులో
కూర్పులెన్నో జగతిలో

కెరటాల పొంగులెందుకో
ఆరాటపు హంగులెందుకో
నిరంతరం పరిశ్రమించినా
తీరాన నిలుచునా తరంగం

చేరువ ఎరుగని దూరాలే
తీరవు తీరపు కోరికలే
మారని  సృష్టి చిత్రాలే
మాయని మదిలో కోరికలే!

చెలిమి చేయిని చాచినా
చేయందని దూరమేనా?
నీలమంతా  కడలికిచ్చిన
నింగిదంతా త్యాగమేనా?

జలదాలకు నీరిచ్చి
జనపదాన కురిపించమని
జలసిరుల బహుమతే
సాగరమిచ్చే కానుక

ఎప్పటికీ కలవనివైనా
ఎప్పటికీ మారనిది
ఎపుడూ విడిపోని విలువైనది
కడలీ సంద్రపు స్నేహం

ప్రతి ఉదయం కొత్తగా
ప్రతి క్షణమూ బహుమతిగా
ప్రతి నిత్యం జీవించమని
ప్రభాకరుని  దీవెనలు

ప్రతి వెలుగు కిరణం
తెచ్చే శుభసందేశం
ప్రతి మనసును మురిపించే
ప్రియమైన వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు